Take a fresh look at your lifestyle.

మాయమవుతున్న మానవత్వం

humanity, parents, women
జగత్తును సృష్టించింది బ్రహ్మ అయితే, ఆ బ్రహ్మను సృష్టించింది అమ్మ. అమ్మ అనే కమ్మదనం మాటకోసం మహిళలు ఎంతో తపిస్తుంటారు. చేయని పూజలు, కొలువని దేవుడుండడు. నవమాసాలు మోసి బిడ్డను కన్నాక పొత్తిళ్ళలోని బిడ్డను చూసి  తమ ప్రసవవేదనను మరిచి మురిసిపోతుంటారు. అప్పుడే ఆమెకు తల్లి హోదా వొస్తుంది. అలాంటి అదృష్టం కోసం స్త్రీలు ఎంతగానో ఆశిస్తుంటారు. ఇటీవలనే తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన డెబ్బై అయిదేళ్ళ వృద్ధ మహిళ కవల పిల్లలకు జన్మనివ్వడం పలువురిని ఆశ్చర్యపర్చడం అటుంచి మాతృత్వం కోసం అమె తపనను తెలియజేస్తుంది. అందుకే తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలంటారు. వారి ఆప్యాయత, అనురాగం వెలకట్టలేనిది. కాని ఈనాటి యాంత్రిక జీవనంలో వారిని పట్టించుకోవడం తగ్గిపోతున్నది. కేవలం సంపాదనే పరమావదిగా మారి వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనడానికి ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు సంఘటనలే ప్రత్యక్ష నిదర్శనాలు. తాజాగా జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఓ వృద్ధ దంపతుల జంట పురుగుల మందు తాగి బల్వన్‌మరణం చెందిన సంఘటన ఒక్క చిట్యాల మండలంలోనే కాకుండా మానవత్వమున్న అందరి హృదయాలను కలిచివేస్తున్నది. సంతానం ఉండి కూడా ఒంటరి బతుకుతో విసుగుచెంది, మానసికంగా కృంగి, కృషించి వారీ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తున్న సమాచారం. విచిత్రమేమంటే ఇంటిముందు చాపవేసుకుని ఒకరిపక్కన ఒకరు పడుకుని ప్రాణాలు వదిలిన ఈ ఇద్దరు దంపతులు తామెలా సహజీవనం చేశారో అదే విధంగా ఒకేచోట సమాధి చేయాలని లేఖను రాసి మరణించడం పలువురిని కంటతడిపెట్టించింది. ఇలాంటి సంఘటన ఇదే జిల్లాలో మూడు నెలలకింద మహదేవ్‌పూర్‌ ‌మండలం ఎలికేశ్వరం గ్రామంలో జరిగింది.
విచిత్రమేమంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులకు ఎలాంటి ఆర్థిక, అనారోగ్య బాధలు లేవు. ఆస్తిపాస్తులకు కొదవలేదు. భార్యాభర్తలిద్దరిదీ అన్యోన్య దాంపత్య జీవితం. కేవలం తమను పట్టించుకునే వారు లేరన్న వ్యధతో, మానసికంగా కృంగిపోయి, మరణమే శరణ్యమన్న నిర్ణయానికి వొచ్చినట్లు వారి మరణాన్ని విశ్లేషిస్తూ రాసిన పత్రికల ద్వారా తెలుస్తున్నది. ఇక్కడ విచిత్ర విషయమేమంటే తమ మరణం వల్ల ఎవరికీ ఇబ్బంది కలుగవద్దని ముందుగానే కర్మక్రియలకు కావల్సిన సామగ్రీని, అవసరమయ్యే నగదును కూడా వారు సిద్ధం చేసి పెట్టుకోవడం. అంతకు ముందు చేసిన అప్పులను తీర్చివేయడం, రావల్సిన బకాయిల చిట్టాను తయారుచేసి పెట్టడం, మంచి ముహూర్తాన్ని అడిగి తెలుసుకుని, కొత్తబట్టలు వేసుకుని ప్రాణాలు వొదలడం. ఇదంతా చూస్తుంటే అన్ని వసతులు, సౌకర్యాలున్నా అయినవారి నుండి ఆదరణ కరువవడం కారణంగానే వారు మానసిక క్షోభకు గురైనారన్నది అర్థమవుతోంది. ఆదిలాబాద్‌ ‌జిల్లా నేరేడుకొండలో కూడా ఇలానే మానసిక వేదనకు గురైన వృద్ధ దంపతులు జలపాతంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నాలుగు నెలలకింద ఓ వార్త వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ సంవత్సరం ఇలాంటి ఘటనలు ఎక్కడోదగ్గర వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఒక తెలంగాణలోనే కాదు, మన పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం మొదలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి విషాధ సంఘటనలకు సంబంధించిన వార్తలు వొస్తూనే ఉన్నాయి.
మానసికంగా వ్యధ చెంది వృద్ధులైన తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోవడం ఒకటైతే, తమకు ఆస్తి పంచి ఇవ్వలేదనో, తమ దారికి అడ్డుగా ఉన్నారనో తల్లిదండ్రులను మట్టుపెడుతున్న ఘటనలు కూడా ఇటీవల కాలంలో అనేకం వెలుగు చూస్తున్నాయి. అన్నీ ఉండి, అందరూ ఉండి బజారుపాలైన బతుకుల కథలు నిత్యం ఎక్కడోదగ్గర కనిపిస్తూనే ఉన్నాయి. తన బిడ్డకు ఏమాత్రం చిన్న ఆపద వొచ్చినా, దాన్ని బూతద్దంలో చూసినంత పెద్దదిగా భావించి తల్లడల్లిపోతుంది తల్లి. తన దుంఖాన్ని మింగి తన పిల్లలకు నవ్వులు పంచే తల్లి, బిడ్డడు ఒక ముద్ద తినకపోతే ఎంతో ఆదుర్దాపడుతుంది. అలాంటి తల్లిదండ్రులు వృద్ధులయినప్పుడు వారి కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో వారి హృదయాలు తల్లడిల్లిపోతాయి. మనస్సు రాయి చేసుకున్నవారు తమకోసమే అన్నట్లుగా వెలసిన వృద్ధాశ్రమంలో చివరి రోజులు లెక్క పెట్టుకుని కాలం గడుపుతున్న వారెందరో. కాని, మానసికంగా కృంగిపోయేవారు మాత్రం ఇగో ఇలాంటి బల్వన్‌మరణాలను ఎంచుకుంటున్నారు. తెలంగాణ వాగ్గేయకారుడు అందెశ్రీ అన్నట్లు  ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు’ అన్నది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజమేననిపిస్తుంది. మరుగవుతున్న ఈ మానవత్వ విలువను పునురుద్ధరించాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. అప్పుడే ముందు తరాల వారు వాటిని అనుసరించి అమలుచేసే అవకాశాలుంటాయి.
Tags: humanity, parents, women

Leave a Reply