- కేంద్రానికి అధికారం ఉంది
- నోట్ల రద్దును సమర్థిస్తూ సుప్రీమ్ కోర్టు ధర్మాసనం తీర్పు
- ధర్మాసనంలోని నలుగురు న్యామూర్తులు సమర్థించగా వ్యతిరేకించిన ఏకైక మహిళా న్యాయమూర్తి
- దాఖలైన 58 పిటిషన్లు కొట్టివేత
న్యూ దిల్లీ, జనవరి 2(ఆర్‌ఎన్‌ఎ) : మోడీ ప్రభుత్వం 2016 నవంబర్ 8న తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీమ్ కోర్టు ధర్మాసనం సమర్థించింది. నోట్ల రద్దుపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని అయిదుగురి న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు బిఆర్ గవాయ్, ఎస్ అబ్దుల్ నజీర్, ఏఎస్ బోపన్నా, వి రామసుబ్రమానియన్ సమర్థించగా ధర్మాసనంలోని ఏకైక న్యాయమూర్తి బివి నాగరత్న వ్యతిరేకించింది. డీమానిటైజేషన్పై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య సంప్రదింపుల తర్వాతే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది.
కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన 58 పిటిషన్లను ధర్మాసనం ఈ సందర్భంగా కొట్టి వేసింది. రాజ్యాంగ ధర్మాసనంలోని నలుగురు సభ్యులూ పెద్దనోట్ల రద్దును సమర్థించారు. పెద్దనోట్ల రద్దు చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ చట్టబద్ధమైనదేనని సుప్రీమ్ కోర్టు అభిప్రాయపడింది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసే ముందు తగిన చర్యలు తీసుకున్నారని చెప్పింది. అలాగే రద్దు చేసిన నోట్ల బదిలీ కోసం ఇచ్చిన గడువు హేతుబద్ధం కాదని చెప్పలేమని పేర్కొంది. ఈ కేసును జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి రామసుబ్రమణ్యం, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన బెంచ్ విచారించింది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సుప్రీమ్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంలో 58 పిటిషన్లు దాఖలు అయ్యాయి.
సెంట్రల్ బోర్డు నిర్ణయం తీసుకున్న విదటే ప్రభుత్వం డిమానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని.. కానీ ఇక్కడ రివర్స్‌లో ప్రభుత్వ నిర్ణయానంతరం సెంట్రల్ బోర్డుకు తెలపడం జరిగిందంటూ పిటిషనర్ల తరుఫు న్యాయవాదులు పి. చిదంబరం, ప్రశాంత్ భూషణ్ వాదించారు. అయితే నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నది సరికాదని కేంద్రం తరుఫు న్యాయవాదులు వాదించారు. విస్తృత ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ పక్రియ సరైనదేనని పేర్కొన్నారు. నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వొచ్చిందంటూ అటార్ని జనరల్ వాదించారు.