Take a fresh look at your lifestyle.

డెల్టా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరం

హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌
అ‌ప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు టెడ్రోస్‌ ‌హెచ్చరిక
ప్రపంచం క్లిష్ట సమయంలో కొట్టుమిట్టాతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్‌ఒ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌టెడ్రోస్‌ అథనామ్‌ ‌గెబ్రాయాసిస్‌ ‌హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచంలో డెల్టా వేరియంట్‌ ‌లాంటి వ్యాప్తి చెందే వైరస్‌లు ఉన్నాయని అన్నారు. డెల్టా వేరియంట్‌లు అభివృద్ధి చెందడంతో పాటు రూపాంతరం చెందుతుందని తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ప్రజారోగ్యం, సామాజిక చర్యలు…పటిష్టమైన నిఘా, వ్యూహాత్మక పరీక్షలు, త్వరగా కేసులను గుర్తించడం, ఐసోలేషన్‌, ‌క్లినికల్‌ ‌కేర్‌ ‌వంటివి చాలా ముఖ్యమైనవని చెప్పారు. మాస్క్, ‌భౌతిక దూరం, రద్దీ ప్రదేశాల్లో సమూహాలను నివారించడం, ఇండోర్‌ ‌ప్రాంతాలు వెంటిలేషన్‌ ‌సదుపాయాలు చూసుకోవడం ఉండాలని అన్నారు. ఆక్సిజన్‌, ‌పరీక్షలు, చికిత్స, టీకాలు ప్రపంచం సమానంగా షేర్‌ ‌చేసుకోవాలన్న ఆయన…దీనికి ఒకరికొకరు సహకారం అందించుకోవాలని దేశాధినేతలకు విజ్ఞప్తి చేశారు. తక్కువ టీకా కవరేజ్‌ ఉన్న దేశాల్లో..కొరోనా రోగులతో కిటకిటలాడుతున్న హాస్పిటళ్లలోని భయానక దృశ్యాలు పరిస్థితుల ఉధృతికి దారితీయవొచ్చునని అన్నారు.

డెల్టా లాంటి తీవ్రంగా వ్యాప్తి చెందే వేరియంట్లు…చాలా దేశాల్లో అధిక ప్రభావాన్ని చూపుతున్నాయని, ప్రపంచం మరింత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని చెప్పారు. కొరోనా కట్టడికి నిరంతర పరిశీలన అవసరమని, ప్రజారోగ్య ప్రతిస్పందనను సరిగ్గా నిర్వహించాలని సూచించారు. ఈ వేరియంట్‌ను 98 దేశాల్లో గుర్తించారని, తక్కువ, ఎక్కువ వ్యాక్సినేషన్‌ ‌కవరేజ్‌ అనే తేడా లేకుండా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఈ కొత్త వైరస్‌ను తరిమికొట్టేందుకు రెండు మార్గాలున్నాయని చెప్పారు. వొచ్చే ఏడాది ఇదే సమయానికి 70 శాతం మంది ప్రజలు టీకా వేయించుకునేలా చూడాలని తెలిపారు.

ఇవే మహమ్మారిని అదుపుచేసేందుకు, ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకునేందుకు ఇవే సరైన మార్గాలని చెప్పారు. ఈ సెప్టెంబర్‌ ‌నాటికి దేశ జనాభాలో 10 శాతం మందికైనా టీకా అందించాలని పలు దేశాలకు విజ్ఞప్తి చేశారు. టీకాలు ఉత్పత్తికి సాంకేతికను పంచుకోవాలని బయో ఎన్‌టెక్‌, ‌మోడార్నా, ఫైజర్‌ ‌వంటి టీకా సంస్థలను కోరారు. దీని వల్ల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. త్వరలో వ్యాక్సినేషన్‌ ‌హబ్‌లు ప్రారంభిస్తామని, ప్రపంచ టీకా సామర్థ్యాన్ని ఎంత త్వరగా పెంచుతామో…అప్పుడు ప్రాణాంతక వైరస్‌లకు అంతమొందించగలమని అన్నారు.

Leave a Reply