Take a fresh look at your lifestyle.

‌బిజెపికి సవాల్‌గా మారిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

The Delhi Assembly elections that have become a challenge for the BJP

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలోనూ విజయం సాధించాలని భారతీయ జనతాపార్టీ గట్టిపట్టుదలతో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో మరో పార్టీ అధికారంలో ఉండడాన్ని బిజెపి తట్టుకోలేకపోతోంది. ఇటీవల కాలంలో ఆ పార్టీ చేదు అనుభవాలను చవిచూడాల్సివస్తోంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ క్రమేణ అధికారాన్ని కోల్పోతూ వొస్తున్నది. చత్తీస్‌గడ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌రాజస్తాన్‌, ‌మహారాష్ట్ర, జార్ఖండ్‌ ‌రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోతూరావడం ఆ పార్టీ అవమానంగా భావిస్తున్నది. పోతున్న పరువును ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా నిలబెట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వొచ్చినప్పటి నుండి ఆప్‌ ‌పక్కలో బల్లెంలా తయారైంది. భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కూడా అప్‌ అధినేత అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ఘన విజయాన్ని సాధించి, బిజెపికి సవాల్‌గా నిలిచాడు. అనేక విషయాల్లో ఆయన తరుచూ కేంద్రంతో గొడవ పడడం, పాలనా విషయంలో కేంద్రం జోక్యాన్ని సవాల్‌ ‌చేయడంతో బిజెపికి తలనొప్పిగా తయ్యారైనాడు. ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రజలను ఆకట్టుకునే అనేక సంక్షేమ పథకాలను రచించి, బెస్టు సిఎంగా ఆయన పేరుతెచ్చుకోవడంతో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో కేజ్రీవాల్‌ ‌ప్రభుత్వాన్ని పడకొట్టడం అంత సులభమేమీ కాదన్న విషయం బిజెపి అధినాయకత్వానికి అర్థమైయింది. పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలను గుర్తించిన కేజ్రీవాల్‌ ‌వాటిపైనే ప్రధానంగా దృష్టి సారించాడు. విద్యారంగంలో పెరుగుతున్న కార్పొరేట్‌ ‌విద్యావ్యవస్థకు ధీటుగా ఆయన ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది ప్రజల మన్ననలను పొందాడు. ఆ తర్వాత నిరుపేద వర్గాలు కోరుకునే మంచి ఆరోగ్యం. అందుకుగాను ఆయన మొహల్లా క్లినిక్‌లను, సంచార క్లినిక్‌లను ఏర్పాటు చేసి, పేదలు నివసించే బస్తీల ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాడు.

తాజాగా ఆయన తీసుకున్న మరో నిర్ణయం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇది ముఖ్యంగా మహిళా వోటర్లను ఆకట్టుకునేదిగా ఉంది. అలాగే రెండు వందల యూనిట్ల వరకు కాల్చుకున్నవారు విద్యుత్‌ ‌బిల్లు చెల్లించాల్సిన అవసరంలేదు. నీటి బిల్లులో కూడా రాయితీలున్నాయి. ఇలా ప్రజలను ఆకట్టుకునే పథకాల రచనతో కేజ్రీవాల్‌ ‌మూడవసారి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించినా ఆశ్చర్యపడాల్సింది లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే  కెజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టే ఎత్తుగడలను బిజెపి ఎంచుకుంటోంది. ఢిల్లీలో అక్రమ నిర్మాణం చేసిన పలు భవనాలను రెగ్యులరైజ్‌ ‌చేస్తామనడం అనేక కుటుంబాలకు ఊరట కలిగించే అంశం. దీన్ని కేజ్రీవాల్‌ ‌సర్కార్‌ ‌వ్యతిరేకిస్తున్నా, ప్రజలు మాత్రం లక్షలాది రూపాయలతో నిర్మించుకున్న తమ భవనాలకు అధికార ముద్రపడుతుందని భావిస్తున్నారు. అయితే వారు బిజెపికి ఎంతవరకు వొట్లేస్తారన్నది మాత్రం క్వశ్చన్‌ ‌మార్కే. అయినా బిజెపి ఢిల్లీని ఎట్టిపరిస్థితిలో పోగొట్టుకోవద్దన్న దీక్షగా పనిచేస్తున్నది. ప్రధాని మొదలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయినా కేజ్రీవాల్‌కు ధీటుగా సిఎం అభ్యర్థి ఎవరన్న విషయాన్ని మాత్రం బిజెపి రహస్యంగా ఉంచింది. గత ఎన్నికల్లో ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానలకుగాను ఆమ్‌ ఆద్మీ 67 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోగా, భిజెపి కేవలం మూడంటే మూడు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. కాని, ఇటీవల జరిగిన ఢిల్లీ పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి ఏడు పార్లమెంటు స్థానాలతో అపూర్వ విజయాన్ని సాధించడంతో బిజెపి వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారన్న భావన ఏర్పడుతున్నది. కాంగ్రెస్‌ ఒక్క స్థానాన్ని కూడా పొందలేకపోయింది. అధికారాన్ని పొందిన  ఆమ్‌ ఆద్మీపార్టీ కేంద్రాన్ని కాదని స్వతంత్రంగా ఏమీ చేయలేకపోతున్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు.

ఢిల్లీ అభివృద్ధి జరుగాలంటే కేంద్రంతో ఘర్షణ ఉన్న పార్టీ కాకుండా, సయోధ్య ఉండే పార్టీ అవసరమన్న అభిప్రాయంలో అక్కడ వోటర్లున్నట్లు తెలుస్తున్నది. షీలాదీక్షిత్‌ ‌తర్వాత కాంగ్రెస్‌ ‌కూడా ఢిల్లీలో పెత్తనం చేయలేకపోతున్నది. అయినా ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో తాను లాభపడాలని చూస్తోంది. అందుకు ఆకర్షణీయమైన మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ ‌విడుదల చేసింది. ఢిల్లీ రాష్ట్ర పరిధిలో అన్ని ఇళ్ళకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందజేస్తామని, అలాగే 20 వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఆటోలు, ఈ రిక్షాలపై ఉన్న రుణాలను మాఫీ చేస్తామని కూడా కాంగ్రెస్‌ ‌ప్రకటించింది. ప్రస్తుతం కేజ్రీవాల్‌ ‌సర్కార్‌ ఆహార భద్రత చట్టం కింద అందిస్తున్న బియ్యం, గోధుమలను రెట్టింపుచేస్తామంటోంది కాంగ్రెస్‌. ‌వీటితో పాటుగా డిగ్రీ చదివిన వారికి నిరుద్యోగ భృతిగా నెలకు అయిదు వేల రూపాయలు, పోస్టు గ్రాడ్యుయేట్‌లకు 7,500, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉచిత కోచింగ్‌, ‌సీనియర్‌ ‌సిటిజన్లకు అయిదువేల పెన్షన్‌ ఇస్తామని తెలిపింది. మహిళలను ఆకట్టుకునేందుకు వంద ఇందిరా క్యాంటిన్లను నడుపుతామని, ఏడాదికి ఒకసారి వారికి వైద్య పరీక్షలు ఉచితంగా అందజేస్తామని తన మ్యానిఫెస్టోలో తెలిపింది. ఇలా మూడు పార్టీలు మధ్య ముక్కోణపు పోటీ కొనసాగుతుండగా, ఈ నెల 8న జరుగనున్న ఎన్నికల్లో ఢిల్లీ వోటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.