“రైతేరాజు, దేశానికి వెన్నెముక అని గౌరవం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతాంగం పరిస్థితి సంక్షోభంలో ఉంది. నవంబర్ 2018లో 24 రాష్ట్రాల నుండి 35 వేల మంది రైతులు, కూలీలు పంటల కనీస మద్దతుధర కోసం, రుణాల నుండి విముక్తి కోసం ఢిల్లీ వీధులలో ర్యాలీలను నిర్వహించారు. మార్చ్ నెలలో జరిగిన నాసిక్ నుండి ముంబై వరకు నలభై వేల మంది రైతుల క్రమశిక్షణతో కూడిన పాదయాత్ర దేశ ప్రజలను ఆలోచనలో పడేసింది. వాతావరణంలో అనూహ్య మార్పులు, ఉత్పత్తి ఖర్చులు పెరగడం, పంటలకు నష్ట పరిహారం సక్రమంగా చెల్లించకపోవడం ఫలితంగా రైతులు దయనీయమైన పరిస్థితులకు నెట్టివేయబడుతున్నారు.అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, రుణాల వితరణ సరళతరం చేయాలని, భూ పట్టాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కొనసాగిన ఈ ప్రదర్శనలు ప్రజల మద్దతును పొంది ప్రభుత్వాలను ఓ మేరకు కదిలించాయి.”
నూతన సంవత్సరంలోకి, నూతన దశాబ్ధంలోకి ఉద్వేగభరిత మానసిక స్థితిలో ప్రవేశిస్తున్నప్పుడు గడిచిన కాలంలోని చరిత్ర ఇముడ్చుకున్న సామాజిక సంఘర్షణలు, ప్రజల ఆరాటాలు, పోరాటాలు, పాలితుల ప్రతిఘాతుక విధానాలు మన మనస్సులలో చెరగని ముద్రగా మిగిలిపోతాయి. ఉత్కష్ట మానవ జీవనంకోసం సాధించిన కొన్ని విజయాలు మనలో సాహసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్గిస్తే, మానవ సమిష్టి జీవనాన్ని ఆటవిక దశలోకి మళ్ళింప చేసే మూక, ఆధిపత్య శక్తుల విజృంభణ పట్ల నైరాశ్యంను కల్గిస్తున్నాయి. 2010-2019 దశాబ్ధకాలాన్ని పరిశీలిస్తే పీడిత ప్రజల ప్రతిఘటనా, నిరసన దశాబ్ధ•ంగా చరిత్రలో నిలబడుతుంది.ప్రజాస్వామిక విలువల ప్రాతిపదిక సమాజ ఆవిర్భావం కోసం సామాన్య జనం త్యాగభరిత పోరాటాలు నిర్మిస్తే పాలకులు మారుతున్నారు కానీ పాలన స్వభావం మారడం లేదని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గుర్తించారు. ఇంకనా ఇకపై కొనసాగకూడదు అనే ధ్యేయంతో అనేక దేశాలలో నిరసనలు హోరెత్తాయి. ఇవి దావానంలా వ్యాప్తి చెందాయి. ‘‘మేము 99 శాతం, మీరు ఒక శాతం, కాని ఒక శాతం ఉన్న వర్గంలో 99% సంపద ఉంది.’’ సంపద సమాన పంపిణి ఇతివృత్తంతో ‘‘వాల్‌స్ట్రీట్ ఆక్రమణ’’ ఉద్యమము 2011లో న్యూయార్క్‌లో ప్రారంభమైంది.
వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలు వీధుల్లోకి వచ్చారు. చీలి, కంబోడియాలో నియంకృష పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు కదం తొక్కారు. ఈ దశాబ్ధంలోనే భారతదేశంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీలు తాము సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా కోల్పోతున్న సందర్భంలో వాటి రక్షణ కోసం ఎన్నడు లేని సమరశీలతతో కదులుతున్నారు. ప్రతీ పోరాటం పీడితులకు కొంత మేరకు ఆశాకిరణమై నిలుస్తున్నది. కొన్ని చట్టాలు రూపొందించబడ్డాయి. మరికొన్ని తొలగించబడ్డాయి. అక్కడక్కడ దోషులకు శిక్షలు పడ్డాయి. కానీ కోల్పోయిన వాటితో పోలిస్తే తిరిగి సాధించుకున్నవి చాలా స్వల్పం. ప్రస్తుతం కొనసాగుతున్న నిరసన, పోరాటాల పరంపర రానున్న సంవత్సరాలలో ప్రజలకు హక్కుల, రక్షణ ఫలాలను అందివ్వగలవనే ఆశావాదం కనిపిస్తున్నది.
రైతేరాజు, దేశానికి వెన్నెముక అని గౌరవం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతాంగం పరిస్థితి సంక్షోభంలో ఉంది. నవంబర్ 2018లో 24 రాష్ట్రాల నుండి 35 వేల మంది రైతులు, కూలీలు పంటల కనీస మద్దతుధర కోసం, రుణాల నుండి విముక్తి కోసం ఢిల్లీ వీధులలో ర్యాలీలను నిర్వహించారు. మార్చ్ నెలలో జరిగిన నాసిక్ నుండి ముంబై వరకు నలభై వేల మంది రైతుల క్రమశిక్షణతో కూడిన పాదయాత్ర దేశ ప్రజలను ఆలోచనలో పడేసింది. వాతావరణంలో అనూహ్య మార్పులు, ఉత్పత్తి ఖర్చులు పెరగడం, పంటలకు నష్ట పరిహారం సక్రమంగా చెల్లించకపోవడం ఫలితంగా రైతులు దయనీయమైన పరిస్థితులకు నెట్టివేయబడుతున్నారు.అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, రుణాల వితరణ సరళతరం చేయాలని, భూ పట్టాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కొనసాగిన ఈ ప్రదర్శనలు ప్రజల మద్దతును పొంది ప్రభుత్వాలను ఓ మేరకు కదిలించాయి.
ప్రజల భావోద్వేగాలతో జనరంజక రాజకీయాలకు ఈ దశాబ్ధం సాక్షీభూతంగా నిలిచింది. 2008లో సంభవించిన ఆర్థిక మాంద్యం, పారిశ్రామిక వేగం తగ్గుదల మొదలగు కారణాలతో పాశ్చాత్య ప్రపంచంలో జనరంజక రాజకీయాలకు దారితీసింది. తమదేశాల ఆర్థిక సంక్షోభానికి శరణార్థులు, ఆక్రమ వలసదారులు కారణమని, స్థానికత పేరుతో తీవ్ర జాతీయవాద విద్వేష ధోరణులను రెచ్చగొట్టి హంగేరిలో విక్టర్ ఆర్చనే, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, ఇంగ్లాండ్‌లో బోరిస్ జాన్సన్, భారత్‌లో నరేంద్రమోడీలు అధికారాన్ని చేపట్టారు. ప్రజా సంక్షేమ రాజకీయాలను విస్మరించి జనరంజక రాజకీయాలు కొనసాగిస్తున్న ఈ ప్రాంతాల పాలకులపై ప్రజలు అలఅలలుగా పోటెత్తుతూ ఉద్యమిస్తున్నవైనం కూడా కనిపిస్తున్నది.
ఆకాశంలో సగం, అవనిలో సగం, అవకాశాలలో సగం అని స్త్రీల సాధికారత కోసం అనేక సంఘ సంస్కరణ ఉద్యమాలు నడిచి కొంత సానుకూల ఫలితాలు వచ్చాయి. వివిధ రంగాలలో అవకాశాల లభ్యత కోసం లైంగిక వేధింపులకు గురవుతున్నారు. స్త్రీలు తమపై జరిగే వేధింపులు, వివక్షతను బహిరంగంగా ప్రకటించే ‘‘మీ టూ’’ ఉద్యమాన్ని ఈ దశాబ్ధము వేదికగా నిలిచింది. హాలీవుడ్ నటి తరన్ బర్కి తనపై జరిగిన వేధింపుల గురించి రాస్తూ ‘‘మీ టూ’’ అనే పదాన్ని ఉపయోగించారు. వేధింపులకు గురిచేసిన నిర్మాత వెన్‌స్టీన్ పై కేసును నమోదు చేయడంతో ‘‘మీటూ’’ ఉద్యమం వైరెల్‌గా మారి ప్రపంచమంతా విస్తరించింది. భారత్‌లో తనుశ్రీ దత్త అనే నటి తనపై నానాపటేకర్ వేధింపులకు పాల్పడ్డాడని ప్రకటించి మీటూఉద్యమానిక అంకురార్పణ చేసారు. ఆరాధన స్థలాల సందర్శనపై స్త్రీలకు గల ఆంక్షలను ఎత్తివేయాలని, తృప్తిదేశాయ్ నేతృత్వంలో భూమాత బిగ్రేడ్ ఉద్యమం, స్త్రీల శరీర సంబంధ ప్రక్రియ రుతుస్త్రావం, ఈ ప్రక్రియలో ఉన్న స్త్రీలపై విధించబడిన అమానవీయ ఆంక్షలు, నిషేధాలపై నిఖిత ఆజాద్ నడిపిన ‘‘హ్యాపీ టు బ్లీడ్’’ ఉద్యమాలలో పెద్ద ఎత్తున స్త్రీలు పాల్గొన్నారు. ఆరాధన స్థలాల సందర్శన హక్కును న్యాయబద్ధంగా సాధించుకున్నారు. 2012లో నిర్భయ ఘటన దేశప్రజలను తీవ్రంగా కలిచివేసింది. రేప్ నిందితులకు శిక్షలు కఠినంగా ఉండాలని లక్షలాది స్త్రీ లు ఆందోళనలు నిర్వహించారు.
ఫలితంగా జస్టిస్ వర్మ కమిటిని నియమించారు. ఈ కమిటి రేప్ నిందితులకు 20 సంవత్సరాల శిక్షను, సత్వర న్యాయ విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించింది. దిశ సంఘటనలో కూడ ప్రజా ఆందోళన నిర్భయ స్థాయిలోనే జరిగింది. స్త్రీల ప్రతిఘటనకు నిర్భయ ఒక ప్రతీకగా మారింది. ‘‘మానవజాతి మహా విపత్తును ఎదుర్కొంటున్నది. జీవ వైవిద్యం క్షీణించి వేలాది జాతులు అంతరించిపోతున్నాయి. వాతావరణ మార్పుతో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో మీరంతా ఆర్థిక వృద్ధి పెరుగుదల వంటి కాకమ్మ కథలతో కాలం గడపడానికి మీకు ఎంత ధైర్యం ’’ అని ప్రపంచ దేశాల అధినేతలను ప్రశ్నించి ఆలోచింపచేసిన 15 ఏండ్ల స్వీడిష్ బాలిక గ్రెమా తుంబెర్ల్ ఈ దశాబ్ధపు పెను సంచలన వ్యక్తిగా మారిపోయారు. “school strike for the climate” ఇతివృత్తంతో గ్రెటా ఒంటరిగా ప్రారంభించిన ఉద్యయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. కోట్లాది ప్రజలను పర్యావరణ రక్షణకు పాటుపడే విధంగా, పాలకుల కళ్ళు తెరిపించే విధంగా గ్రెటా ఉద్యమం చిరస్మరణీయంగా మారింది. టైమ్స్ పత్రిక పర్సన్ ఆఫ్ ది ఇయర్-2019 ఎంపికైంది.
సమాచార శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణ ‘‘వాట్సప్’’ సామాజిక మాద్యమ హృదయంగా మారింది. భారతీయుల జీవితాల్లో చొరబడి విడదీయరాని బంధంగా మారింది. ఒక సమాంతర ప్రపంచాన్ని సృష్టించింది. వాయిస్ నోట్స్, వాయిస్, వీడియో కాల్స్‌తో మానవ సంబంధాలను కొంత మేరకు గాఢపరిచింది. తమ అంతర్గత భావాల వ్యక్తీకరణకు తోడ్పడే జిఫ్‌లు, ఎమోజీలు మరింత పరిమళాన్ని అద్దాయి. విద్యార్థులు, కార్యాలయాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు, కుటుంబం, వృత్తిపరంగా, భావజాల పరంగా ఇంకా అనేక అంగాల ప్రాతిపదికగా గ్రూప్‌లు ఏర్పాటు చేసుకొని సమాచారం చేరవేయటం, సంభాషణ, బాగోగులను తెల్సుకోవడం వంటి అంశాలకు తోడ్పడుతున్నది. ఇదే సమయంలో సమాచారం చేరవేతకు రాజకీయ సాధనంగా మారుతున్నది. భిన్నాభిప్రాయాలను గౌరవించని అసహన బృందాలు ఆధార రహిత, అసత్య విషపు వార్తలను ప్రచారం చేస్తూ అల్లర్లను సృష్టిస్తున్నాయి. అరబ్ దేశాలలో పేదరికాన్ని నిర్మూలించలేని నియంత పాలకులను గద్దె దించడానికి కొనసాగుతున్న ‘‘ వసంత విప్లవం’’ విస్తరణలో, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమములో ‘‘వాట్సప్’’ కీలక వేదికగా పనిచేసింది.
దళితుల తమ హక్కుల రక్షణ కోసం, తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మరొక్కసారి ఉప్పెనలా కదిలిన దశాబ్ధం కూడా ఇదే. బ్రిటీష్ ఇండియాలో మహార్ రెజిమెంట్ సైన్యం మనుస్మ•తి ఆధార హిందుత్వ పాలకుడైన పీష్వా బాజీరాకు-2 ను ఓడించింది. దీనికి గుర్తుగా ప్రతియేట యుద్దం జరిగిన భీమ్‌కోరేగావ్ ప్రాంతంలో స్ఫూర్తి సభలను ఏర్పాటు చేసుకునే సాంప్రదాయాన్ని అంబెద్కర్ ప్రారంభించాడు. 2018లో కొరెగావ్ యుద్ధ 200వ వార్షికోత్సవంను లక్షలాది దళితులు ఘనంగా నిర్వహించారు. శంభాజీ భిడే, మిళింద్ ఎల్‌బాలే వంటి మతోన్మాదుల దుశ్చర్యలతో హింసాకాండ జరిగింది. ఘటనకు కారణమైన వీరిని వదిలేసి హక్కుల కార్యకర్తలూ సురేంద్ర గాడ్లింగ్, సుధీర్, రోనావిల్సన్, అరుణ్ ఫెరిరా, సుధా భరద్వాజ్, గౌతమ్, వరవరరావు, ఆనంద్ తెల్‌తుంబ్డెల పై కేసులు నమోదు చేశారు. వీరంత జైలులో ఉన్నారు. అలాగే గుజరాత్‌లోని ఉనా లో చనిపోయిన ఆవుల చర్మాన్ని వొలిచిన దళితులపై గోరక్షక ముఠాలు హంతకదాడులను చేసాయి. వీటికి వ్యతిరేకంగా అంబెద్కరిస్టులు జిగ్నేష్ మేవాని, భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్‌ల నాయకత్వంలో దళితులు ఉద్యమిస్తున్నారు. ఆగస్ట్ 5, 2019న కేంద్ర ప్రభుత్వం 370 ప్రకరణ రద్దుతో పాక్షిక స్వయం ప్రతిపత్తి అనుభవిస్తున్న సుందర కాశ్మీర్ నిశ్శబ్ధ కాశ్మీర్‌గా మారింది.భౌగోళికంగా, సాంస్కృతికంగా ఒకే రకమైన జీవనవిధానం గల కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రజా ఆందోళనలు తీవ్రమవుతాయి అనే నెపంతో టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా నిలిపివేసింది.
స్వతంత్ర భారత చరిత్రలో తీవ్రంగా పడిపోతున్న వృద్ధి కొలమానాలకు, అత్యధిక నిరుద్యోగ రేటుకు, నిత్యం అభద్రతకు లోనవుతున్న మైనారిటి, దళిత, ఆదివాసి, మహిళలకు, వెర్రితలలు వేస్తున్న తీవ్ర ఉగ్ర జాతీయవాదానికి, బాధ్యతాయుతంగా ఉండాల్సిన పాలకుల విద్వేష ప్రసంగాలకు, భిన్న మతస్థుల పరిచయాలను లవ్ జిహాద్‌గా ముద్ర వేస్తున్న ఘోరాలకు ఈ దశాబ్ధం సాక్ష్యంగా నిలుస్తున్నది. మెజారిటి మతస్థుల ప్రాతిపదికగా రాజ్యాన్ని నిర్మించాలన్న తపనతో రాజ్యాంగ స్పూర్తిని ఉల్లంఘిస్తూ పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరజాబితా వంటి విధానాలకు, మూఢత్వాన్ని కల్గించే జ్యోతిష్యం, భూతవైద్యం కోర్సులను విశ్వవిద్యాలయాలలో నిర్వహిస్తున్న వైనానికి వేదిక అయ్యింది. అమెరికాకు చెందిన స్వతంత్ర పరిశోధన సంస్థ ప్యూ రిసెర్చ్‌సెంట్ ప్రకారం మైనారిటీ మతస్థుల పై ఆంక్షలు విధించడంలో, వేధించడంలో ఆసియా దేశాలలో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. మోడి అనుసరిస్తున్న విధానాలే ప్రథమ స్థానానికి కారణమయ్యాయని విశ్లేషించింది. హాస్యాస్పదకరం ఏమిటంటే మతపర వివక్షత భారత్ తర్వాత స్థానాలలో ఉన్న అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మైనారిటీలకు పౌరసత్వం ఇస్తామనడం, అందులో ఉద్దేశ్య పూర్వకంగా ముస్లింలను, శ్రీలంక తమిళులను విస్మరించడం.
అభివృద్ధిని విస్మరించి, ప్రజలను విభజించి పాలించే, మైనారిటీలను అభద్రతకు గురిచేసే పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా మేధావులు, ప్రజాతంత్ర వాదులు ఐక్యమయ్యి పోరాడుతున్న సందర్భం ఆవిష్కృతమౌతున్నది. కారు చీకట్లలో కాంతిరేఖలలాగా ఉన్నత విద్యా సంస్థల విద్యార్ధిలోకం విశ్వవిద్యాలయాలు ముళ్ళకంచెలు దాటి వీధులలోకి వస్తున్నది. హక్కులకై పోరాడుతున్న విశాల ప్రజానీకానికి సంఘీభావం తెలుపుతున్నది.కార్మిక, కర్షక, విద్యార్థి ఉద్యోగ మేధావుల ఐక్యతను అనివార్యం చేసి రాజ్యాంగాన్ని రక్షించుకుని, స్ఫూర్తిని నిలుపుకుని సుస్థిర, సంతులిత, సహజీవన భారత నిర్మాణం రానున్న దశాబ్ధంలో నెలకొనాలని ఆశిద్దాం.
అస్నాల శ్రీనివాస్,
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
9652275560
Tags: nrc, save constitution, save country, cab nrc, social media