వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మరో ఉద్యమకారుడి బలవన్మరణం

February 12, 2020

The death of another activist
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రవినాయక్‌, ఆయన కుటుంబం (ఫైల్‌ఫోటోలు)

తెలంగాణ ఉద్యమం కొందరి కడుపు నింపింది… కొందరి కడుపు కొట్టింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రాణాలకు తెగించి, ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో చురుకుగాపాల్గొన్న వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం పీజీ తండాకు చెందిన నూనావత్‌ ‌రవినాయక్‌ ‌ప్రభుత్వ ఆదరణ కరువై, కడు పేదరికంతో, అత్యంత దయనీయస్థితిలో బలవన్మరణం పాలయ్యారు. ఉన్నత విద్యావంతుడైన ఈయన ఉద్యమ సమయంలో మన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు మనకేనన్న నాటి ఉద్యమనేత కేసీఆర్‌ ఉపాన్యాసాలకు ఆకర్షితుడై ఉద్యమంలో పాల్గొన్నాడు. దుగ్గొండి మండలం చుట్టు పక్కల తండాల ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడంలో సఫలీకృతు డయ్యాడు కానీ, ఆయన జీవితంలో సఫలీకృతుడు కాలేకపోయాడు. ఆయన కుటుంబ నేపథ్యం చూస్తే అతడి తండ్రి దస్రూ నాయక్‌ ‌మాజీ ఎమ్మెల్యే ఓంకార్‌కు కుడి చేయిగా ఉండేవాడని పలువురు తెలిపారు. దాదాపు పది పదేహేనేండ్లు సర్పంచి, ఉప సర్పంచ్‌గా పదవులు నిర్వహించినట్లు తెలుపుతున్నారు. ఇతడి సోదరుడు ఒకరు ప్రభుత్వ టీచరు, ఇంకో సోదరుడు ప్రైవేట్‌ ‌కళాశాలలో లెక్చరర్‌, ‌సోదరుడి భార్య ప్రభుత్వ ఉపాద్యాయురాలు. కుటుంబ పరంగా అంతా బాగానే ఉంది కానీ, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో మండలం నుంచి ముందున్న ఈయన కుటుంబం అన్ని విధాల వెనకబాటుకు గురైంది. ప్రత్యేక రాష్ట్రం సిధ్ధించి ఇన్నేళ్లైనా తనకు ఉద్యోగం రాట్లేదని తెగ బాధ పడేవాడని పలువురు అంటున్నారు.

ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక కూడా బతుకుదెరువుకోసం ఆరాటం
ఉద్యమం అనంతరం ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక పలు చోట్ల వివిధ పనులు చేస్తూ కుటుంబం వెళ్లదీసాడు. ఇటీవలే బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లో దాదాపు ఎనిమిది నెలలుగా పని చేసినట్లు తెలిసింది. మేడారం సందర్భంగా ఊరికి వచ్చి క్షణికావేషంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారని కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఇద్దరు కూతుళ్లు ఎదగడంతో అతడు మానసికంగా ఇబ్బందులకు గురికావొచ్చని అంటున్నారు. ఈ మధ్యనే ఓ ప్రభుత్వోద్యోగి సంబంధం పెద్ద అమ్మాయికి వచ్చినట్లు తెలిపారు. పెళ్లి చేయడానికి చేతిలో చిల్లి గవ్వా లేకపోవడం ఆయనను కలిచివేసి ఉండవొచ్చని వారు తెలుపుతున్నారు. 20 గుంటల పొలంతో చాలా చాలని ఆదాయంతో ఇబ్బందులు పడ్డాడని చెప్పారు.

ఉద్యమ నాయకులకు కొంత అండ ఉంటే ఊరట ఉండేది: రవినాయక్‌ ‌సోదరుడు రాందాస్‌
‘‌తమ్ముడు రవి నాయక్‌ ఉద్యమ కాలంలో చురుగ్గా పాల్గొనే వాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని వెళ్లదీసాడు. ప్రత్యేక తెలంగాణాలో ఇలాంటి ఉద్యమ కారులకు వారికి తగిన ప్రతిపలం దక్కి ఉంటే బాగుండేది’ అని రవినాయక్‌ ‌సోదరుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు.

మా కుటుంబాన్ని ఆదుకోవాలి : మృతుడి భార్య, పిల్లలు
మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదు కోవాలనీ మృతుడి భార్యా పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయస్సులో పెద్ద దిక్కు కోల్పోడంతో కూలీ నాలి చేసే తన పిల్లలను ఓ ఇంటికియ్యాలంటే కష్టమని ఆమె వాపోయింది.