Take a fresh look at your lifestyle.

దేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్‌దే

కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్‌ల నిరంకుశ పాలన
నిరుద్యోగులను మోసం చేస్తున్న సిఎం కెసిఆర్‌
‌గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరించిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌జనవరి 26 : కీలక చట్టాలు తెచ్చి దేశాన్ని కాంగ్రెస్‌ ‌శక్తివంతంగా తీర్చిదిద్దిందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మన రాజ్యాంగం నిలిచిందన్నారు. దేశానికి కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. బ్యాంకుల జాతీయకరణ చేసి ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ ‌పార్టీ అందించిందన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన అనంతరం రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..మోదీ, కేసీఆర్‌ ‌లాంటి నాయకులు ప్రజలను పట్టి పీడిస్తున్నారన్నారు. కేంద్రం ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులు కాలరాస్తుందరన్నారు. పార్లమెంట్‌లో చర్చలకు తావులేకుండా బిల్లులు ఆమోదిస్తున్నారన్నారు. మోదీ రాజ్యంలో మోదీ చక్రవర్తి అయితే కేసీఆర్‌ ‌సామంత రాజు అని రేవంత్‌ ‌పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్‌రెడ్డి వాపోయారు. తెలంగాణలో కేసీఆర్‌ ఒక సామంత రాజు లాగా పాలన చేస్తున్నారని ఆరోపించారు.

ఉద్యమకారులు నిరుద్యోగులు, మేథావులు మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు పాలకులను కలిసి వినతి పత్రం ఇద్దామంటే సచివాలయం కూడా లేదని విమర్శించారు. నెరేళ్లలో ఇసుక మాఫియాను వ్యతిరేకిస్తే యువకులను థర్డ్ ‌డిగ్రీతో దారుణంగా కొట్టి హింసించడంపై మండిపడ్డారు. ఖమ్మంలో మిరప రైతులు గిట్టుబాటు ధరలు ఉద్యమిస్తే కేసులు పెట్టి దొంగల్లాగా జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలంలో ఆదివాసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అనాగరిక పాలనకు అద్దం పడుతుందన్నారు. కాంగ్రెస్‌ ‌శ్రేణులు, యువకులు ప్రజలకు అండగా ఉండాలని..వారి హక్కులను సాధించేందుకు మద్దతుగా ఉద్యమాలు చెయ్యాలని రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.

తెలంగాణలో విద్యార్థులు ..ఉద్యోగుల ఆకాంక్షలు నేరవేరడం లేదని..ప్రజల కోసం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ ‌విధానాల వల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. త్వరలో జైల్‌ ‌భరో చేద్దామని కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులకు పిలుపు నిచ్చారు. మోడీ..కేసీఆర్‌ ‌లాంటి నాయకులు దేశాన్ని పట్టి పీడుస్తున్నారని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల విధానం వి•ద అనుమానం వొచ్చేలా ప్రధాని కార్యాలయం వ్యవహరిస్తుందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తొక్కి చంపిన మంత్రిని మోడీ క్యాబినెట్‌లో ఇంకా కొనసాగించడం అంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. రైతులను తొక్కి చంపండని ప్రొత్సహించడమేనా అని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కాయని విమర్శించారు. వొచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈ రెండు ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

Leave a Reply