అందుకు 2024 వరకు ఆగాల్సిందే ..సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా
భూమిపైనున్న అందరికీ కోవిడ్ టీకా అందాలంటే కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల వరకు పట్టొచ్చని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా అభిప్రాయ పడ్డారు. 2024 వరకు అందరికీ వ్యాక్సిన్ అందే అవకాశముందన్నారు. ఔషధ కంపెనీలు ప్రపంచ జనాభాకు సరిపోయేటంత వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి లేవని చెప్పారు. జీల్స్ టీకాల మాదిరిగా టూ డోస్ ప్రోగ్రాం చేపడితే 15 బిలియన్ మోతాదుల కోవిడ్ వ్యాక్సిన్లు అవసరం ఉంటాయని వివరించారు. అలాగే, వ్యాక్సిన్ను 1.4 బిలియన్ల ప్రజలకు సురక్షితంగా వేసేందుకు భారత్లో మౌలిక సదుపాయాలు లేవని చెప్పారు.
భారతదేశంలో కనీసం 40 కోట్ల మందికి టీకా వేయాలనే ప్రణాళికను ఇప్పటిదాకా చూడలేదని, అంటే వ్యాక్సిన్ వచ్చినా దాన్ని వెంటనే అందరూ పొందలేరని పూనావాలా వెల్లడించారు. కాగా, పూనావాలా చేసిన ఈ వ్యాఖ్యలతో అక్టోబర్ కల్లా టీకా వస్తుందని ఊదరగొడుతున్న రాజకీయ నాయకుల మాటలు నీటిమూటలేనని తేలిపోతున్నది. అలాగే, వ్యాక్సిన్ను పొందేందుకు యూఎస్ఏ, యురోపియన్ యూనియన్ దేశాలు వివిధ కంపెనీలతో ముందస్తు ఒప్పందాలు చేసుకుంటుండడంతో మనకు టీకా దొరకదనే మాట నిజమవుతుందని అనిపిస్తోంది. ఇదిలా ఉండగా, ఎస్ఐఐ ఒక బిలియన్ మోతాదు టీకా ఉత్పత్తికి ఆస్ట్రాజెనెకాతో సహా ఐదు గ్లోబల్ ఫార్మా కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉంది. దీంతోపాటు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీకి రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందంలో ఉంది. ఇది ఉత్పత్తి చేసే సగం టీకాలను భారత్ కోసం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేసింది.