Take a fresh look at your lifestyle.

సహనం సందర్భం

కాస్త, ఇంకాస్త ఓపిక పట్టు
పక్షి ఎప్పుడో పారేసిన విత్తనం
తడి తగిలే దాకా ఎంత ఓపిక పడితే
భూమి పొరల్ని తొలిచి మొలకవుతుంది
మట్టిలో ఒదిగుండి పైకెదగడం దానికి తెలిసిన విద్య

సముద్రానిది ఎంత ఓపిక
అలల కల్లోలాన్ని నిరంతరం సహిస్తుంది
అద్భుతమైన వనరులున్నా విర్రవీగదు
తప్పదనుకుంటే దాడి కల్లోల తుఫాన్‌ ‌లే

సుఖ ప్రసవం కావాలంటే
ఓపిక పట్టాల్సిందే, ఓర్చుకోవాల్సిందే బాధ
తిన్నది రోత పుట్టిస్తే కక్కాల్సిందే వెంటనే
మృత శిశువును మోయడానికి
అంగీకరించదు ఏ కన్న తల్లి

కంట్లో నలుసు పడితే తొలగించాలి సత్వరమే
ఎంత నలిపితే అంత బాధ కన్నుకే
బయటకొస్తే నలుసును పట్టించుకునేదెవరు

గద్ద పైన తిరుగుతున్నదంటే
గమనించే నేర్పు తల్లి కోడిది
తక్షణం తరలిస్తది పిల్లల్ని రక్షణ గూటికి
దాడి చేసే పిల్లి, కొంగలు
ఎదురుచూస్తయి అవకాశం కోసం
ఎలుకైనా, చేపయినా సమయం చూసి తప్పించుకోవాలి

ఎంత సహనశీలి అయినా
సమయం, సందర్భం, మెలకువ ముఖ్యం
సహనానికి హద్దులుంటాయి
దాటితే దండిస్తది అమ్మయినా
– కొమురవెల్లి అంజయ్య
సిద్దిపేట, సెల్‌..9848005676

Leave a Reply