
నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2019 మరచిపోలేని సంవత్సరమని గుర్తు చేసుకున్నారు. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను 2019 అందించిందని అన్నారు. తాను ఇటీవలే రెండో సారి ఎమ్మెల్యేగా ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పంచాయతీ, పంచాయతీ రాజ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ విజయం సాధించడం సంతోషం కలిగించిందని అన్నారు. ఇదే స్పూర్తితో 2020 లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆరెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. నియోజకవర్గంలో అభివృద్ది పనులు కూడా చెప్పుకోదగిన రీతిలో జరిగాయని, ముఖ్యంగా గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగంగా జరగడం హర్షనీయమని అన్నారు.
2020 లో అన్ని అభివృద్ది పనులు పూర్తి అవుతాయన్న ఆశాభావం ఎమ్మెల్యే వ్యక్తం చేసారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ది పనులకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ రైతాంగానికి ఈ ఏడాది మంచి పంటలు పండి దిగుబడులు రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నిన్ననే సీఎం మధ్య మానేరు ప్రాజెక్టు ను సందర్శించిన సందర్భంలో గౌరవెల్లి, శనిగరం ప్రాజెక్టు గురించి కూడా ప్రస్తావించారని తెలిపారు. కాళేశ్వరం జలాలతో గౌరవెళ్లి నింపడమే లక్ష్యంగా సీ ఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. గౌరవెల్లి, శనిగరం, మధ్య మానేరు కాలువలు, సింగరాయ, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయి నియోజకవర్గం సస్యశ్యామలం అయి, రైతుల కళ్లల్లో సంతోషం చూడాలన్నే తన అభిమతమని ఆయన అన్నారు. రాబోయే కొద్ది కాలంలోనే గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గంలో పరుగులు పెడుతాయని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు తనను, తమ ప్రభుత్వాన్ని ఎంతగానో ఆదరించారని వారికి ఎప్పుడూ రుణ పడి ఉంటానని ఆయన స్పష్టం చేసారు. నియోజకవర్గ ప్రజలకు వేలాది మందికి పించన్లు, కల్యాణ లక్ష్మి, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ల రుణాలు అందుతున్నాయని, సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా సీ ఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఆయన గుర్తు చేసారు. గత ఏడాది వలేనే ఈ సారి కూడా కళాశాలల, మోడల్ స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు, ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రుల సహకారంతో నియోజక వర్గాన్ని మరింత అభివృద్ది పథంలో తీసుకుపోతామని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2020 లో అందరూ మంచి ఫలితాలు సాధించాలని, ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని, నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో పయనించాలని ఆయన ఆకాంక్షించారు.
Tags: constituency, developed, usnabad mla, trs odithala satish kumar