- ఉందనుకుంటే అది ఊహలో మాత్రమే…!
- ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉగ్రవాదులని ముద్ర వేస్తున్నారు
- పెట్టుబడిదారుల కోసమే ప్రధాని పనిచేస్తున్నారు
- నిరంకుశ విధానాలు వీడాలి
- రాహుల్ నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం
భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధానికి వ్యతిరేకంగా నిలబడిన వారిని ఉగ్రవాదులు అని ముద్ర వేస్తున్నారని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రైతు నిరసనల నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారని, మరి అయన కూడా ఉగ్రవాదా..? అని రాహుల్ గాంధీ ప్రశ్నిచారు. ‘‘ప్రధాని మోడీ తన పెట్టుబడిదారు మిత్రుల కోసం డబ్బు సంపాదిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు నిలబడటానికి ప్రయత్నిస్తారో వారిని ఉగ్రవాది అని పిలుస్తారు. రైతులు కార్మికులు లేదా మోహన్ భగవత్ అయినా కావచ్చు’’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఘాటైన విమర్శలు చేసారు. ఆర్ఎస్ఎస్ చీఫ్, బిజెపి సైద్ధాంతిక గురువు మోహన్ భగవత్ డిమాండ్‌ను మీడియా ముందు ప్రస్తావిస్తూ..మోడీ కనీసం ఆయన మాటైనా వినాలని కోరారు.
‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు. మీలో కొందరు మన దేశంలో ప్రజాస్వామ్యం వుంది అనుకుంటే అది మీ ఊహలో ఉంది’’ అని రాహుల్ గాంధీ తెలిపారు. సెప్టెంబరులో అమల్లోకి వొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సమీపంలో జరుగుతున్న భారీ నిరసనలను శాంతియుతంగా ఓ పరిష్కారానికి వొచ్చేలా చేయడంలో జోక్యం చేసుకోమని కోరుతూ కాంగ్రెస్ కార్యకర్తల ప్రతినిధి బృంద•ం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసి రాష్ట్రపతి వినతిపత్రం అందజేసింది. అనంతరం మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..వ్యవసాయ చట్టాలను చర్చించడానికి పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసిందని, కానీ నిబంధనలను ఉల్లంఘిస్తూ పార్లమెంటులో వ్యవసాయ చట్టాలను మోడీ సర్కార్ పాస్ చేసిందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

అంతకుముందు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లేందుకు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకొని బస్సుల్లో ఎక్కించి తరలించారు. పోలీసులు అనుమతించకపోవటంతో కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు మాత్రమే రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతితో సమావేశం తరువాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రస్తుత వ్యవసాయ చట్టాల వలన మిలియన్ల కొద్ది రైతులు జీవనోపాధిని కోల్పోతారని చెబుతూ ఈ చట్టాలు కేవలం నలుగురైదుగురు వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉండేలా రూపొందించబడ్డాయని అన్నారు. ‘‘ప్రధాని మోడీ అసమర్థుడు, అతనికి ఏమీ తెలియదు. అతను అసమర్థ వ్యక్తి, మిత్రులు అయిన పెట్టుబడిదారుల మాట మాత్రమే వింటాడు.
వారు చెప్పేది మోడీ చేస్తారు’’ యువత మరియు ఈ దేశ ప్రజలందరూ ఈ విషయం తెలుపుకాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ‘వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని కేంద్రం చట్టాలు తీసుకువొస్తే..ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దు రహదారులపై నవంబర్ నెల చివరి నుండి వేలాది మంది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాల వల్ల తమకు అందుతున్న కనీస ఆదాయాలను తాము కోల్పోతామని, పెద్ద వ్యాపారాల ద్వారా దోపిడీకి గురవుతామని, రైతులు భయపడుతున్నారు. నేడు రైతులు మరియు కార్మికులు ఐక్యంగా ఉన్నారు. ఎప్పటిలాగే, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడే పని చేస్తే వారిని దేశ ద్రోహులు..ఉగ్రవాదులు అని ముద్ర వేస్తున్నారు. ఇది దురదృష్టకరం. ప్రజల గొంతులను మోడీ నొక్కుతున్నారు’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.