Take a fresh look at your lifestyle.

కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు దారుణం

జడ్జిలు ఫిర్యాదు చేసినా పోలీసులు, సిబిఐ పట్టించుకోదా?
గనులు, మాఫియా ఉన్న చోట్ల జడ్జిలకు ప్రత్యేక రక్షణ కల్పించాలి
జార్ఖండ్‌ ‌జడ్జి హత్యపై అధికారుల తీరుపై సుప్రీమ్‌ ‌కోర్టు సిజె రమణ అసహనం
పూర్తి బాధ్యతతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ప్రకటన

సంచలనం రేపిన జార్ఖండ్‌ ‌జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ ‌హత్య కేసులో సుమోటో విచారణను సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం శుక్రవారం చేపట్టిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపరిచే ట్రెండ్‌ ‌చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జడ్జిలు ఫిర్యాదు చేసినా పోలీసులు, సీబీఐ స్పందించడం లేదని, పట్టించుకోవడం లేదని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రమణ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు ఐబీ, సీబీఐ సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. జార్ఖండ్‌ ‌జడ్జి హత్య వ్యవహారమే ఒక ఉదాహరణ అని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. అంతేకాదు పూర్తి బాధ్యతతోనే తానీ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు. గనుల మాఫియా ఉన్న ప్రాంతంలో జడ్జిలకు, వారి నివాస ప్రాంతాలకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. న్యాయవ్యవస్థలో దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన దగ్గర ఉందన్నారు.

న్యాయమూర్తుల రక్షణపై కొన్ని రాష్ట్రాలు కౌంటర్లు దాఖలు చేశాయనీ, మిగతా రాష్ట్రాలు కూడా స్టేటస్‌ ‌రిపోర్టులు దాఖలు చేయాలని ఎన్వీ రమణ ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేశారు. కాగా ధన్‌బాద్‌కు చెందిన జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ది అనుమానాస్పద మృతిగా, తరువాత రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగానే భావించారు. కానీ సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో అసలు నిజం వెలుగులోకి వొచ్చింది. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను ఢీకొట్టి హత్య చేసినట్లుగా తేలింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు పుట్టించింది. దీంతో ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీమ్‌ ‌కోర్టు బార్‌ అసోసిసేషన్‌ ‌చీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేసింది. న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించింది. ఈ వ్యవహరాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీమ్‌ ‌జార్ఖండ్‌ ‌డీజీపీ నుంచి వివరణ కోరిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ..దర్యాప్తు సంస్థల తీరును తప్పుపట్టారు.

తమకు ప్రాణహాని ఉందంటూ న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినా సీబీఐ సహా వివిధ దర్యాప్తు సంస్థలు స్పందిచడం లేదని, వారికి ఏమాత్రం సాయపడటం లేదని సీజేఐ విమర్శించారు. ‘సీబీఐ తన తీరు మార్చుకోవడం లేదు. న్యాయమూర్తులు తమకు బెదిరింపులు వొస్తున్నాయంటూ సీబీఐకి, ఐబీకి ఫిర్యాదు చేస్తే వారు సరిగా స్పందించడం లేదు. కనీసం వారికి ఎలాంటి సాయం కూడా అందించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశంపై మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉన్నది’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. అదేవిధంగా జడ్జి హత్య కేసుకు సంబంధించి పోలీసులు సమర్పించిన చార్జిషీట్‌పై కూడా సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఇలాంటి చార్జిషీట్‌ను ఇప్పటివరకు చూడలేదని వ్యాఖ్యా నించారు.

చార్జిషీట్‌లో బలమైన సాక్ష్యాలను నమోదు చేయలేదని విమర్శించారు. పోలీసులు చార్జిషీట్‌ ‌రూపొందించిన తీరుపై తనకు అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. నిందితులకు బెయిల్‌ ‌లభించేందుకు వీలుపడేలా చార్జిషీట్‌ ‌రూపొందించినట్లుగా కనిపిస్తుందన్నారు. గత నెల 28న జార్ఖండ్‌లో ధన్‌బాద్‌ అడిషనల్‌ ‌సెషన్స్ ‌జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ ‌దారుణహత్యకు గురయ్యారు. మార్నింగ్‌ ‌వాక్‌కు వెళ్లిన ఆయనను ప్రత్యర్థులు వ్యాన్‌తో తొక్కించి చంపేశారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీమ్‌ ‌కోర్టుకు తాజాగా సీబీఐకి నోటిసులు జారీచేసింది. జడ్జి హత్య కేసుకు సంబంధించి కోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించాలని ఆ నోటీసులలో ఆదేశించింది. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థల తీరుపై విమర్శలు గుప్పించిన సీజేఐ రమణ.. కేసు తదుపరి విచారణను వొచ్చే సోమవారానికి వాయిదా వేశారు.

Leave a Reply