Take a fresh look at your lifestyle.

నాటి సినీ నటుడు నేటి వార్‌ ‌హీరో – ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేసిన రెడ్‌ ఆర్మీ వీరుడు సైమన్‌ ‌మనుమడు, రియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్, ‌సైబర్‌ ‌మాట్రిక్స్ ‌కంప్యూటర్‌ ‌హార్డ్ ‌వేర్‌ ‌విభాగంలో ప్రొఫెసర్‌ ఒలక్సాండర్‌ ‌జెలెన్‌స్కీ, తల్లి ఇంజనీర్‌ ‌రైమ్మ జెలెన్‌స్కీల కుమారుడైన ఉక్కెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నేడు ప్రపంచ మానవాళి ముందు వార్‌ ‌హీరోగా నిలుస్తూ, ప్రశంసలు పొందుతున్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా మూడేళ్ల క్రితం నటుడిగా అత్యంత ప్రజాదరణతో నేరుగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రముఖ హాస్య నటుడు, కథానాయకుడైన 44-ఏండ్ల ‘ఒలోడెమిర్‌ ‌జెలెన్‌స్కీ‘ చూపుతున్న అద్వితీయ నాయకత్వ లక్షణాలను చూసి ప్రపంచమే ఆశ్చర్య ఆనందాలను వ్యక్తం చేస్తూ బాసటగా నిలుస్తున్నది.

గత నాలుగు రోజులుగా యుద్ధోన్మాది రష్యా నియంత వ్లాదమిర్‌ ‌పుతిన్‌ ‌దుశ్చర్యలకు కకావికలం అవుతున్న ఉక్రేయిన్‌ ‌సైనికుల్లో, ప్రజల్లో ధైర్యం నూరిపోయడానికి ఒక వీర సైనికుడిగా ప్రాణాలను సహితం కూడా లెక్కచేయకుండా ఉక్రెయిన్‌ ‌సైన్యంతో కలిసి ముందడుగు వేస్తున్న జెలెన్‌స్కీ చూపిస్తున్న ధైర్యసాహసాలను ప్రస్తుతించకుండా ఉండలేం. ఏకపక్షంగా రష్యా ప్రకటించిన భీకర యుద్ధంతో ఉక్రెయిన్‌ ‌సైన్యంతో పాటు సామాన్య జనం కూడా వందల్లో చనిపోవడం, వేలల్లో గాయపడడాన్ని ప్రత్యక్షంగా సామాజిక మాద్యమాల్లో వీడియోలను, ఫోటోలను వీక్షిస్తున్న విశ్వ జనులు పుతిన్‌ ‌దుశ్చర్యలను ఖండిస్తున్నారు. హిట్లర్‌ను తలపిస్తూ, మూడవ ప్రపంచ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్న బలమైన పుతిన్‌ ‌సైన్యానికి ధీటైన సమాధానమిస్తున్న ఉక్రెయిన్‌ ‌జవాన్లు, ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నంలో భాగంగా అధ్యక్షుడు జెలెన్‌స్కీ టీవీ, సామాజిక మాద్యమాల్లో తరుచుగా ప్రసంగించడం, వీడియోలు విడుదల చేయడం, సైనికుడిలా యుద్ధక్షేత్రంలో యూనిఫారమ్‌ ‌ధరించి ముందు నడవడం లాంటి చర్యలు జెలెన్‌స్కీ వ్యక్తిత్వానికి, అధ్యక్షుడిగా పని తీరుకు, దేశాన్ని ఏకతాటిపై నిలుపే నాయకత్వ లక్షణాలకు పట్టం కడుతున్నాయి.

25 జనవరి 1978న జన్మించిన ‘ఒలోడెమిర్‌ ‌జెలెన్‌స్కీ’ ఎనిమిది సినిమాల్లో ప్రముఖ నటుడు/హీరో/కమెడియన్‌గా, మూడు టీవీ సీరియల్స్‌లో సమర్థవంతంగా నటిస్తూ, మెప్పిస్తూ ఉక్రెనియన్‌ ‌ప్రజల మనసులు దోచుకున్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా 2018లో రాజకీయరంగ ప్రవేశం చేసిన జెలెన్‌స్కీ నేరుగా 2019లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా ఎన్నికై ప్రజల మన్ననలు పొందుతున్నారు. రష్యన్‌, ఉ‌క్రెనియన్‌, ఇం‌గ్లీష్‌ ‌ధారళంగా మాట్లాడగలిగే జెలెన్‌స్కీ ప్రజల అపూర్వ ఆదరాభిమానాల్ని చూరగొన్నారు. ఆగ్నేయ ఉక్రెయిన్‌ ‌ప్రాంతంలో పెరిగి పెద్ద వాడైన జెలెన్‌స్కీ ‘కేవ్‌ ‌నేషనల్‌ ఎకనమిక్‌ ‌యూనివర్సిటీ’ నుంచి న్యాయ పట్టా పొందారు. ఉన్నత విద్య అనంతరం సినిమా, కార్టూన్‌ ‌ఫిలిమ్స్ ‌నిర్మాతగా, టీవీ కార్యక్రమాల ద్వారా నటుడుగా, ప్రముఖ హాస్య/కథానాయకుడిగా పేరు తెచ్చుకుంటూ ‘సర్వెంట్‌ ఆఫ్‌ ‌ది పీపుల్‌’ ‌టీవీ సీరియల్‌ ‌ద్వారా 2015 నుంచి 2019 వరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడి పాత్రలో నటించి ప్రజల మన్ననలు చూరగొన్నారు.

టీవీ సీరియల్‌ ‌ద్వారా లభించిన ప్రజాభిమానంతో మార్చి 2018లో రాజకీయ పార్టీ పెట్టారు. 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో నిలబడి ప్రత్యర్థి ‘పొరొషెన్కో’ని ఓడించి అధ్యక్షుడిగా ఎన్నికైనారు. అధ్యక్షుడిగా ఎన్నికైన జెలెన్‌స్కీ అవినీతి రహిత పాలన, కరోనా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఆర్థిక ఆటుపోట్లను అధిగమించడం, ప్రజా ప్రతినిధుల అవినీతిని కట్టడి చేయడంలో సఫలమవుతున్న వేళ, రష్యా యుద్ధభేరితో వణుకుతున్న ఉక్రెయిన్‌ ‌ప్రజలను మానసికంగా సన్నద్దం చేయడంలో జెలెన్‌స్కీ అసాధారణ విజయం సాధిస్తున్నారు. రష్యా ధాటికి కకావికలం అవుతున్న ఉక్రెయిన్‌ ‌భయానక స్థితికి జడవక జెలెన్‌స్కీ చూపుతున్న పోరాట పటిమను చూసి ప్రపంచం నివ్వెర పోవడం, హర్షం వ్యక్తం చేయడం, ప్రస్తుతించడం చూస్తున్నాం. నేడు ప్రపంచ దేశాల దృష్టిలో పుతిన్‌ ‌దుర్మార్గుడైన విలన్‌గా నిలిసిన వేళ, జెలెన్‌స్కీ మాత్రం యుద్ధ హీరోగా ప్రపంచ మానవాళి అభిమానం పొందుతున్నారు.

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రష్యా అమానవీయ చర్యను ఖండిస్తున్న అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు సానుభూతి పలుకులు మాత్రమే పలకడం, చేతల్లో వెనకడుగు వేయడంతో ఉక్రెయిన్‌లో అపార ఆస్తి, ప్రాణనష్టం నమోదు కావడం విచారకరం. యూయస్‌, ‌యూకే, కెనడా, ఫ్రాన్స్, ‌పోలాండ్‌, ‌నెథర్‌లాండ్‌, ‌టర్కీ, చెక్‌ ‌రిపబ్లిక్‌ ‌లాంటి నాటో దేశాలు తమ వెంట నిలిచి రష్యాకు బుద్ది చెబుతాయనుకున్న ఉక్రెయిన్‌ ‌ప్రజలు, సైన్యం ఏకాకిలా యుద్ధాన్ని ప్రతిఘటించే ప్రయత్నాలు చేయడంలో జెలెన్‌స్కీ పాత్ర అద్వితీయమని తెలుస్తున్నది. రష్యా యుద్ధోన్మాది పుతిన్‌ ‌ముందు ప్రథమ ప్రత్యర్థిగా నిలబడిన జెలెన్‌స్కీ ధైర్యం, సాహసం, ఆత్మ విశ్వాసం కొనియాడదగినదిగా ప్రస్తుతించ బడుతున్నది. ఉక్రెయిన్‌ ‌రాజధాని కేవ్‌తో పాటు పలు నగరాలపై బాంబుల వర్షం కురుస్తున్న వేళ జెలెన్‌స్కీ పారిపోవచ్చని జరిగిన దుప్ప్రచారానికి తెర దించుతూ, నగరవీధుల్లో సైన్యంతో కలిసి నడవడం ఆదర్శ నాయకత్వ లక్షణంగా కొనియాడ బడుతున్నది. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా నాటో కూటమి దేశాలు రష్యా పట్ల ఆంక్షలు మాత్రమేవిధించినా చేతులు దులుపు కోవడం సరికాదని, రష్యా మానసిక రోగి, యుద్ధోన్మాది పుతిన్‌కు తగిన ధీటైన బుద్ది చెప్పాలని ప్రపంచ మానవాళి కోరుకుంటున్నది. ‘పిల్లిని గదిలో బంధించి కొడితే సింహంలా గర్జించి మీద పడుతుందనే‘ సామెత నేడు ఉక్రెయిన్‌కు సరిగ్గా సరిపోతున్నది. రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న ఉక్రెయిన్‌ ‌విన్నపం సఫలమైతే త్వరలో రష్యాతో సంప్రదింపులతో సానుకూల ఫలితాలు రావాలని, యుద్ధానికి చరమగీతం పలకాలని, ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని కోరుకుందాం.

– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కెన్‌బెరా, ఆస్ట్రేలియా – 9949700037

Leave a Reply