Take a fresh look at your lifestyle.

తెలంగాణా ఉద్యమాల సమాహారం భావి తరాలకు స్ఫూర్తిదాయకం

చరిత్రలో ప్రాధాన్యత గల అంశాలు మరుగున పడిపోకుండా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలే తప్ప విబేధాలకు కారణం కారాదు. స్వాతంత్య్రానికి ముందు,స్వాతంత్య్రానికి తర్వాత కూడా తెలంగాణ ప్రజలు పడిన కష్టాల గురించి, భూమి కోసం భుక్తి కోసం, నిజమైన స్వాతంత్య్రం కోసం వారు పడిన తపన, చేసిన ఉద్యమాలు చరిత్రను తీవ్రంగా ప్రభావితం చేసాయి.  నాటి నిజాం నవాబు ఏలుబడిలో రజాకార్ల సహాయంతో  ఖాసింరజ్వీ  దురహంకారంతో కొనసాగిన దమన కాండకు స్వస్తి వాక్యం పలికి, స్వేచ్ఛను పొందిన హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనమైనది. తెలంగాణా విలీనమైనదా? విమోచనమైనదా అనే వివాదాలకు స్వస్తి చెప్పి తెలంగాణ ప్రజలను, వారి ఉద్యమాలను గుర్తించి, మరుగున పడిపోయిన ఉద్యమకారుల చరిత్రను గ్రంథస్థం చేసి భావి తరాలకు అందించాలి. చేసిన త్యాగాలకు విలువ లేకుండా చేయడం తగదు. తెలంగాణాకు సంబంధించిన ఏ చిన్న చారిత్రక కార్యక్రమం జరిగినా వాటికి రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకునే వారికి దూరంగా ఉండాలి.
తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి పలుకులకు వాస్తవ రూపం కల్పించాలి.విలీనం, విమోచనం వంటి పదాల మధ్య  నెలకొన్న రాజకీయ సందిగ్ధతకు, మాటల  యుద్ధానికి తెరదించాలి. సంవత్సరంలో ప్రతీ నెలలో ఎవరో ఒక మహనీయుడు, ఉద్యమకారుడు, తెలంగాణ గడ్డపై జన్మించిన సందర్భాలను గుర్తు చేసుకోవాలి.తెలంగాణ ప్రజల కోసం ప్రజల  గొంతుకై గర్జించిన త్యాగధనుల చరిత్రను  స్ఫూర్తిగా తీసుకోవాలి.తెలంగాణ ప్రజలకు నాటి నిజాం నవాబు పాలన నుండి,రాజకార్ల నుండి స్వేచ్ఛ లభించిన శుభసందర్భాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలి.
భారతదేశంలోని ప్రతీ రాష్ట్రం, ప్రతీ ప్రాంతం ఏదో ఒక ప్రత్యేకతతో చరిత్రలో  ఉన్నతమైన స్థానం సంపాదించుకున్నాయి. దేశంలోని అన్ని  భాషాసంస్కృతులు విశిష్ఠమైనవే.అన్ని ప్రాంతాల సాంస్కృతిక వారసత్వాన్ని, చరిత్రను గుర్తించి గౌరవించడంలోనే మన విజ్ఞత ప్రదర్శించబడుతుంది. గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని, నాటి పోరాటాలను, త్యాగాలను స్మరించుకోవడం మన కనీస బాధ్యత.భారత దేశం సుదీర్ఘ కాలం పరపీడనలో మగ్గి పోయింది.బ్రిటీషు పాలన లోను, సంస్థానాధీశుల ఏలుబడిలోను భారత దేశంలోని ప్రజలు ఎంతగానో నలిగి పోయారు.అయితే అన్నింటికంటే ఎక్కువగా  అణచి వేతకు గురైన ప్రాంతం “తెలంగాణ” అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. స్వాతంత్య్రానికి ముందు,స్వాతంత్య్రం తర్వాత కూడా తెలంగాణా ప్రజలు అనేక కష్టానష్టాలకు గురైనారు.ఎన్నో అరాచకాలు అణచివేతలు,హత్యలు అత్యాచారాల తర్వాత  ఎన్నో మహోద్యమాల ఫలితంగా  ఎట్టకేలకు తెలంగాణ అన్ని నిర్భంధనాల నుండి  విముక్తి పొంది, స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది.తెలంగాణ విమోచనకు ఎన్నో ఉద్యమాలు నడిపి,తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన తెలంగాణా వీరయోధుల నిరుపమాన త్యాగాల సమాహార ఫలాలను  తెలంగాణా ప్రజలకు అందించాలి. తెలంగాణా ఉద్యమ నేపథ్యాన్ని యావత్ భారత జాతి  అవగతం చేసుకోవాలి.

పోతన ఘంటం,రుద్రమదేవి శౌర్యం తెలంగాణ నేలను పులకరింప చేసింది. దాశరథి కలం తెలంగాణ స్వరాన్ని ఇనుమడింపచేసింది. సురవరం ప్రతాపరెడ్డి ఉద్యమ స్ఫూర్తి ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనింప చేసింది. కాళోజీ కవిత్వం నిజాం దమననీతిని దునుమాడింది. కొమరం భీమ్ ప్రాణత్యాగం తెలంగాణ గడ్డను పునీతం చేసింది.చాకలి ఐలమ్మ భూమి,భుక్తి పోరాటం జనవాహినిలో చైతన్యం రగిలించింది. షోయబుల్లా ఖాన్ రక్తతర్పణం రజాకార్ల గుండెలను హడలెత్తించింది.

ఎంతో మంది రచయితలు,ఉద్యమకారులు, వివిధ రంగాలకు చెందిన మేథావులు ఒక్కటై నిజాం పాలనలో,రజాకార్ల  దమన కాండలో రోదిస్తున్న  ప్రజలకు అండగా నిలబడ్డారు. తెలంగాణ గొంతు వినిపించారు. బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి,రావి నారాయణ రెడ్డి,జమలా పురం కేశవరావు,పులిజాల వెంకటరావు,తదితర ప్రముఖులు ఉద్యమాన్ని ఉధృతం చేసారు. హైదరాబాద్ సంస్థానాన్ని ఏలుతున్న అసఫ్ జాహీ పాలకుల్లో చివరివాడైన ఏడవ నిజాం నవాబు మీర్  ఉస్మాన్ అలీఖాన్ పై అలుపెరుగని  పోరాటం చేసారు.ఎన్నో తిరుగుబాట్లు,సాయుధ పోరాటాల ఫలితంగా తెలంగాణ విమోచన జరిగింది. కన్నడ,మరాఠా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 16 జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి. 1947 ఆగష్టు 14  వ తేదీన భారత దేశంలో రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యపు కోటలు బద్దలయ్యాయి. ఆగష్టు 15 వ తేదీన భారతీయుల జీవితాల్లో నిజమైన ఉషః కాంతులు ప్రసరించాయి. హైదరాబాద్ సంస్థానంలో మాత్రం అమావాస్య చీకట్లు తొలగి పోలేదు.నిజాం నవాబు కనుసన్నల్లో ఖాసింరజ్వీ సారథ్యంలో రజాకార్ల అరాచకానికి అమాయక ప్రజల  ధన,మాన,ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం సంస్థానంలోని ప్రజలు పరపీడనలో మగ్గి పోయారు.ఎన్నో  వీరోచిత పోరాటాలు,ఎన్నో కమ్యూనిస్టు ఉద్యమాలు,సాయుధ పోరాటాలు తెలంగాణ వ్యాప్తంగా జరిగాయి. కాళోజీ నారాయణ రావు,దాశరథి రంగాచార్య, షోయబుల్లాఖాన్,రావి నారాయణ రెడ్డి వంటి వారు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చారు.”ఖాసిం రజ్వీ” నిజాం నవాబుకు లక్షలాది మంది ప్రైవేటు సైన్యంతో  సహాయం చేస్తూ,రజాకార్లతో ప్రజలపై అకృత్యాలు సాగించాడు. అరాచక వాదుల మద మణిచే క్రమంలో విప్లవ వీరుడై, నైజాం సర్కారుఫై  గర్జించిన కొమరం భీమ్ హతుడయ్యాడు.భారత్‌లో హైదరాబాద్‌ను విలీనం చేయాలంటూ ఉద్యమించిన  షోయబుల్లాఖాన్ ను రజాకార్లు అంతమొందించారు. ఒక వైపు ప్రజల ఆర్తనాదాలు, ఒక వైపు రజాకార్ల అరాచకాలు,మరోవైపు నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటాలతో హైదరాబాద్ సంస్థానం అట్టుడికి పోయింది.  రజాకార్లకు ఎదురుపడిన ప్రజలను గుర్రాలతో తొక్కించి హతమార్చడం, భర్తల ముందే భార్యలను చెరబట్టడం, భార్యల ముందే భర్తలను పాశవికంగా హత్య చేయడం, పసి పిల్లలను సైతం పైకెగరేసి, నేలపై నిలబెట్టిన కత్తికి బలి చేయడం, గ్రామీణ ప్రాంతాలపై పడి దోచుకోవడం, పైశాచికంగా జనాన్ని హింసించి,చంపడం  నిజాం కాలంలో కొనసాగిన  అకృత్యాలకు పరాకాష్ఠ.
అప్పటి నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో విలీనం చేయడానికి సంకల్పించడంతో అప్పటి భారత ప్రభుత్వం “ఆపరేషన్ పోలో” పేరుతో సైనిక చర్య తీసుకుని, 1948 లో  హైదరాబాద్ ను  భారత దేశంలో విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి ఎం.కె.వెల్లోడి,బూర్గుల రామకృష్ణారావులు ముఖ్యమంత్రులు గా పని చేసారు. మద్రాసు రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడిన తెలుగు వారు స్వరాష్ట్ర సాధనకు ఉపక్రమించారు. పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగంతో మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలు విడిపోయి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1953 లో  ఆంధ్రరాష్ట్రం అవతరించింది. రాష్ట్రాల పునర్వవస్థీకరణ చట్టం ద్వారా ఆంధ్ర,హైదరాబాద్ రాష్టాల్లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విలీనం చేసి, హైదరాబాదు రాజధానిగా 1956 నవంబర్ 1 వ తేదిన ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. అయితే తెలంగాణ ప్రజలు తమ అస్థిత్వం కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసారు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో అనేక మంది ఉద్యమకారులు అమరులైనారు.అనేక దశాబ్దాల పోరాట ఫలితంగా ఎట్టకేలకు జూన్ 2 వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.  హైదరాబాద్ నగరం దేశం లోని వివిధ ప్రాంతాల ప్రజలతో విశ్వనగరంలా ఆవిర్భవించింది. నిజాం నవాబు నుండి విముక్తి పొంది స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన చారిత్రక నేపథ్యాన్ని విస్మరించరాదు.  చారిత్రక సంఘటనలను  చరిత్ర పుస్తకాల్లో పదిల పరచాలి. ఉద్యమ వీరుల త్యాగాలను స్మరించుకోవాలి. రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన  ఉద్యమాల్లో  పాల్గొని, నేటి ప్రపంచానికి తెలియకుండా తెరమరుగైన వీరుల చరిత్రను బహిర్గతం చేయాలి.

image.png
– సుంకవల్లి సత్తిరాజు

                  తూ.గో.జిల్లా, ఆం.ప్ర
మొ:9704903463

Leave a Reply