Take a fresh look at your lifestyle.

కూలిన నిజమ్ రాజసం ..!

తెలంగాణ సాధించిన తర్వాత దాన్ని పునర్నిమించాల్సిన అవసరం ఎంత్తైనా ఉందని ఆనాటి ఉద్యమనాయకుడు, ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు సీమాంధ్ర నేతలనుండి వెక్కిరింపు విమర్శలుండేవి.. తెలంగాణ పునర్నిర్మాణమంటే ఉన్న భవలనాలకు కూల్చేసి తిరిగి కడుతారా అని. ఉద్దేశ్యం ఏమైనా ఇప్పుడు జరుగుతున్నదైతే అదే అనిపిస్తున్నది. పాత సచివాలయం ‌ ‌స్థానంలో కొత్తదాన్ని నిర్మించాలని రాష్ట్రం పుట్టినప్పటినుండి ముఖ్యమంత్రి చెబుతున్నమాట. అందుకు గత సంవత్సరమే ముహూర్తం నిర్ణయించినప్పటికీ ప్రతిపక్షాలు, కొందరు ప్రజాస్వామ్యవాదులు న్యాయస్థానం తలుపులు తట్టడంతో ఇగో ఇన్నాళ్ళకు దానికి ముహూర్తం కుదిరింది. ఎన్ని కేసులుపెట్టినా చివరకు న్యాయస్థానం మాత్రం రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయంలో తప్పులేదని తేల్చేసింది. రాష్ట్రంలో కొన్ని ప్రధాన కార్యాలయాలు, విశాలమైన దవాఖానల భవనాలకు కొరత ఉంది. నిజామ్ కాలంలో నిర్మించిన ప్రభుత్వ దవాఖానాలు కొన్ని కూలడానికి సిద్దంగా ఉన్నాయి. అలాంటి వాటికోసం ఈ పాత సచివాలయాన్ని ఉపయోగించవచ్చుకదా అని ప్రతిపక్షాలు గోలపెట్టినా ప్రభుత్వం ససేమిరా అని తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళన్నట్లుగా న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. ఇప్పుడున్న సచివాలయం పరిపాలనా కార్యకలాపాలకు ఏమాత్రం అనుకూలంగా లేదన్నది ప్రభుత్వ వాదన. పార్కింగ్‌ ‌స్థలం సరిగా లేకపోవడం, మీటింగ్‌ ‌హాల్స్ ‌సక్రమంగా లేకపోవడం లాంటి లోపాలను ప్రభుత్వం న్యాయస్థానం ముందుంచింది. ప్రధానంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత వివిధ దేశాలతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు బాగా పెరిగాయి. వివిధ దేశాలనుండి వొచ్చే అతిథులతో సమావేశాలు ఏర్పాటుచేయడం, వారికి ఆతిథ్యం ఇచ్చే సౌకర్యాలు ఈ భవనంలో లేకపోవడం ప్రధాన లోటుగా ప్రభుత్వం చెబుతున్నది. వివిధ బ్లాకుల సముదాయంగా ఉన్న ఈ భవనంలో పనిచేసే అధికారులు, సిబ్బంది ఒక చోటునుండి మరోచోటుకు ఫైళ్ళు మోసుకు వేళ్ళడం కష్టసాధ్యంగా ఉంది.

అనుకోని పరిస్థితిలో అగ్నిప్రమాదాలు ఏర్పడితే ఫైర్‌ ఇం‌జన్‌లు భవనం చుట్టూ తిరిగే పరిస్థితిలేదు. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా మరో నూతన భవనాన్ని నిర్మించ తలపెట్టినట్లు ప్రభుత్వం కోర్టు ముందుంచింది. ప్రభుత్వ వాదనకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో మంగళవారం తెల్లవారు ఝామునుండే భవనం కూల్చివేత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పాత సచివాలయ ప్రాంగణం సుమారు ఇరవై అయిదు ఎకరాల్లో నిజాంకాలంలో రూపుదిద్దుకుంది. హుస్సేన్‌ ‌సాగర్‌ ‌కనిపించేలా మొదట్లో చిన్న భవనంలో కొనసాగిన సచివాలయం కాలానుగుణంగా అదనంగా ఒక్కో బ్లాక్‌ ‌వెలిసింది. ఇతర ప్రభుత్వ కార్యాలయానికి మరి కొన్ని ఏండ్లపాటు పనికి వొచ్చే ఈ భవనసముదాయాన్ని కూల్చడం ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్లు తెలంగాణ ధనిక రాష్ట్రమయినప్పటికీ ఉపయుక్తంగా ఉన్న భవనాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చడం ఎంతవరకు సమంజసమన్న వాదనలు వినిపిస్తుండడంతో ప్రభుత్వం సచివాలయ నిర్మాణానికి ఇతర ప్రాంతాలను వెతికింది. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ ‌గ్రౌండ్‌, ‌జింఖానా గ్రౌండ్‌, ఎ‌ర్రగడ్డ ఛాతి హాస్పిటల్ , ఎర్రమంజిల్‌ ‌లాంటి ప్రాంతాలన్నీ ఇందుకోసం చుట్టబెట్టింది. చివరకు పాత సచివాలయమే కొత్త నిర్మాణానికి అనుకూలంగా భావించింది. దానికి తగినట్లు తాజాగా కోర్టు కూడా సచివాలయం ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిర్మించాలన్న విషయంతోపాటు, కూల్చివేత విషయంలో ప్రభుత్వ ఆలోచనలో తాము జోక్యం తీసుకోలేమని తేల్చేసింది. దీనితో అక్కడ పూర్తి పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది . సమీపంలోకి కనీసం మీడియాను కూడా రానివ్వడంలేదు. రెండు రోజుల్లోనే ఈ కూల్చివేతల పర్వం పూర్తి అవుతుందని అనధికారికంగా తెలుస్తున్నది. ప్రభుత్వం సుమారు అయిదు వందల కోట్లతో నిర్మించబోతున్న కొత్త సచివాలయానికి సంబందించిన నమోనా భవన చిత్రాన్ని కూడా చాలా రోజుల కిందనే బహిర్ఘతం చేసింది. చూపరులకు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ కొత్త భవనాన్ని ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఆరు అంతస్తుల తో అత్యంత ఆధునికంగా, అన్ని హంగులతో ఏడాది లోగానే నిర్మాణాన్ని పూర్తిచేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే సుమారు నూటా ముప్పై ఏళ్ళ గత చరిత్ర ఆనవాళ్ళు మాత్రం దీంతో అంతర్ధానమైపోతున్నాయి. 1889 నాటి సైఫాబాద్‌ ‌ప్యాలెసే పది బ్లాకులుగా విస్తరించిన నేటి పాత సచివాలయం కట్టడం. ఈ కూల్చివేతతో నాటి నిజామ్ కాలపు పురాతన కట్టడమేకాదు, నిజామ్ పాలననుండి విముక్తి పొందిన తర్వాత నాటినుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ముఖ్యమంత్రుల కాలంలో పరిపాలనా కేంద్రంగా బాసిల్లిన ఈ భవన సముదాయం భవిష్యత్‌లో ఎవరికీ కనిపించే అవకాశంలేదు.

Leave a Reply