Take a fresh look at your lifestyle.

గిల్లి కజ్జాలు

“ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య నడుస్తున్న కోల్డ్ ‌వార్‌ ‌మరో అడుగు ముందుకు వెళ్లింది. వచ్చే ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీకి లేఖ రాయటం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇలా ఉజ్జాయింపు సమయ ప్రకటన కూడా సహజంగా జరగదు. ఈ లేఖకు సీఎమ్‌ ‌నీలం సాహ్ని వెంటనే స్పందిస్తూ తిరుగు లేఖ రాశారు. కరోనా కేసులు కొనసాగుతున్నాయి, సెకెండ్‌ ‌వేవ్‌ ‌కరోనా వచ్చే ప్రమాదం ఉంది, ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దంగా లేదు, పునరాలోచించాలని లేఖలో ఆమె పేర్కొన్నారు.”

ఆంధ్రప్రదేశ్‌ ‌రాజకీయాల్లో మరో ఆసక్తికర ఎపిసోడ్‌ ‌కు తెర లేచింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య నడుస్తున్న కోల్డ్ ‌వార్‌ ‌మరో అడుగు ముందుకు వెళ్లింది. వచ్చే ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీకి లేఖ రాయటం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇలా ఉజ్జాయింపు సమయ ప్రకటన కూడా సహజంగా జరగదు. ఈ లేఖకు సీఎమ్‌ ‌నీలం సాహ్ని వెంటనే స్పందిస్తూ తిరుగు లేఖ రాశారు. కరోనా కేసులు కొనసాగుతున్నాయి, సెకెండ్‌ ‌వేవ్‌ ‌కరోనా వచ్చే ప్రమాదం ఉంది, ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దంగా లేదు, పునరాలోచించాలని లేఖలో ఆమె పేర్కొన్నారు.

గవర్నర్‌ ‌కు ఫిర్యాదు

సీఎస్‌ ‌నీలం సాహ్ని రాసిన లేఖను ఎన్నికల కమిషనర్‌ ‌నిమ్మగడ్డ రమేష్‌ ‌కుమార్‌ ‌సీరియస్‌ ‌గానే తీసుకున్నారు. తమను కించపరిచే వ్యవహార శైలిగా భావించారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించటం లేదని రాష్ట్ర గవర్నర్‌ ‌విశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ ‌కు నిమ్మగడ్డ స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. 45 నిమిషాల పాటు గవర్నర్‌ ‌తో నిమ్మగడ్డ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ప్రత్యేకించి కొడాలి నాని, పేర్ని నాని వంటి కొంత మంది మంత్రుల పై కూడా నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు, మంత్రుల విమర్శించిన వీడియో క్లిప్పులు అన్నీ గవర్నర్‌ ‌కు అందజేశారు. కొందరు మంత్రులు అధికారులను ఎస్‌ఈసీ పై ఉసిగొల్పుతున్నారని కూడా నిమ్మగడ్డ గవర్నర్‌ ‌దగ్గర ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఎపిసోడ్‌ ‌కు మరో ఆసక్తికర అంశం కూడా జత అయ్యింది. ఎస్‌ఈసీ కేవలం ఎన్నికలకు సంబంధించి లేఖ రాయటమే కాకుండా ఎన్నికల సన్నద్ధత కోసం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ‌కు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ‌ను ప్రభుత్వం అడ్డుకుంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేని నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని నీలం సాహ్ని తన లేఖలో తేల్చేశారు. దీనితో మరుసటి రోజు  ఉదయం పది గంటలకు మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించటానికి ఎస్‌ఈసీ సిద్ధమయ్యింది. ఇదే విషయాన్ని వివరిస్తూ సీఎస్‌ ‌కు లేఖ రాశారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోవటంతో రెండో వీడియో కాన్ఫరెన్స్ ‌కూడా రద్దయ్యింది.

ఈ లోపు టీడీపీ కూడా తెర మీదకు వచ్చింది. దమ్ము ధైర్యం ఉంటే ఎస్‌ఈసీ చెప్పిన సమయం ఫిబ్రవరి నాటికి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రావాలని టీడీపీ సవాలు విసిరింది. వైసీపీ నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నట్లే నిమ్మగడ్డ రమేష్‌ ‌కుమార్‌ ‌వేసే ప్రతి అడుగు వెనుక, లేదా ముందు టీడీపీ గళం జత అవుతోంది. ఇదే అధికార పక్షానికి ఆయుధంగా మారుతోంది. దీనికి తగినట్లే కొడాలి నాని వంటి కొంత మంది మంత్రులు నిమ్మగడ్డను ఒక రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న అధికారిలా కాకుండా టీడీపీ కార్యకర్త స్థాయికి దిగజార్చి మాట్లాడటం కూడా జరుగుతోంది. తాజా పరిణామాలతో మరోసారి కోర్టు తలుపు తట్టడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ‌రెడీ అవుతున్నారు. ఇటు మంత్రులు నిమ్మగడ్డ హైకోర్టుకు అయినా వెళ్లొచ్చు, హయాత్‌ (‌పార్క్ ‌హయాత్‌ ఉదంతం నేపథ్యంలో)కు అయినా వెళ్లొచ్చు…ఆయనకు ఆ స్వేచ్ఛ ఉందని సెటైర్లు వేస్తున్నారు.

ఇక ప్రస్తావించాల్సిన మరో అంశం ఏమిటంటే కరోనా కేసులు దాగుడుమూతలు.  ఫిబ్రవరి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాననే సంకేతాలు ఇచ్చిన లేఖలో నిమ్మగడ్డ రమేష్‌ ‌కుమార్‌ ఆ ‌రోజు నమోదైన కరోనా కేసుల సంఖ్యను ప్రత్యేకించి లేఖలో రాశారు. రోజుకు పది వేల కేసుల నుంచి 753 కేసులకు సంఖ్య తగ్గిందని.  ఈ 753 సంఖ్యకు కూడా ప్రాతిపదిక ఏది అని అడిగితే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక రోజు మాత్రమే వెయ్యి లోపు నమోదై తర్వాతి నుంచి మళ్లీ వెయ్యి దాటిన సంఖ్య నమోదవుతోంది. అదే సమయంలో  స్థానిక సంస్థల ఎన్నికల రద్దు నిర్ణయాన్ని ఏకపక్షంగా నిమ్మగడ్డ తీసుకున్నప్పుడు కేసుల సంఖ్య ఇప్పటితో పోల్చితే నామమాత్రం. మరోవైపు సెకెండ్‌ ‌వేవ్‌ ‌సంకేతాలు ఇప్పటికే అందుతున్నాయి. ఢిల్లీ అలెర్ట్ అయ్యింది. యూరప్‌ ‌దేశాలు లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటిస్తున్నాయి. కాబట్టి కరోనా లేదని, రాదని ధీమాగా ఎవరూ చెప్పే పరిస్థితి లేదు.

రాష్ట్ర ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య జరుగుతున్న ఘర్షణ ఒక్క మాటలో చెప్పాలంటే ఇగో క్లాష్‌. ‌రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వంలో భాగమే. రాజకీయ పార్టీలు, నాయకులు, వారి సిద్ధాంతాల పట్ల వ్యక్తిగతంగా ఆకర్షణ, ఆసక్తి ఉన్నా…విధి నిర్వహణ దగ్గరకు వచ్చేసరికి కొంత నిష్పక్షపాత వైఖరి అనేది ఎవరికైనా అవసరం. ప్రభుత్వ యంత్రాంగం సహకరించకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. కాబట్టి ఇరు వర్గాల మధ్య సయోధ్య, సమన్వయం రానంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు చర్చకు ముడి సరుకు మాత్రమే అవుతాయి.

Leave a Reply