భారతీయ జనతాపార్టీకి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల మధ్య ఇంతకాలం పరుష పదజాలాలకే పరిమితమైన వివాదం, ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధానికి సిద్దమైనట్లు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అయితే తెచ్చింది తామేనంటూ ప్రచారం చేసుకునే బిజెపి, రాష్ట్ర రాజధానిపై జాతీయ జంఢా ఎగురవేయాలన్న లక్ష్యంగా రాష్ట్రం ఏర్పడినప్పటినుండీ దూకుడుగానే వ్యవహరిస్తూ వొచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ప్రతీ కార్యాక్రమాన్ని వివాదస్పదం చేస్తూ, అధికార పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలు మొదలుకుని, నేటి కొరోనా వరకు రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడంలేదు. ఆ వివాదస్పద వ్యాఖ్యలే ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. దీంతో అధికార పార్టీకి చెందిన పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉదంతం ఇప్పుడు ఇరుపార్టీల మద్య హాట్ టాపిక్‌గా మారింది.
భారతీయ జనతాపార్టీ’ ఆత్మనిర్భర భారత్’ పేరిట కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు నిధులతోపాటు చికిత్సకు కావాల్సిన పరికరాలను కేటాయించింది. అయితే ఈ నిధులు, పరికరాల కేటాయింపు, వాటి వినియోగంపై ప్రతీ జిల్లాల్లో సీనియర్ బిజెపి నాయకులు ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ వరంగల్ అర్భన్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా బిజెపి, తెరాస కార్యకర్తల మద్య యుద్ద వాతావరణం చెలరేగింది. ఎంపి ఆరవింద్ తన పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాడిన పదాలు, టిఆర్ఎస్ నాయకులను విమర్శించిన తీరు ఆ పార్టీ వర్గాలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. కొరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ మొదటినుండి బిజెపితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. అయితే కొరోనా వైరస్ చికిత్సలకోసం రాష్ట్రానికి కేంద్రం అందించిన సహాయంపైనే బిజెపి ప్రధానంగా ఫోకస్ చేయడం టిఆర్ఎస్ను ఇరుకున పెట్టేదిగా మారింది. సుమారు ఏడువేల కోట్ల రూపాయలను కేంద్రం అందించినా రాష్ట్రం వాటిని సద్వినియోగం చేయలేదన్నది బిజెపి ఆరోపణ. దీనిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆపార్టీ డిమాండ్చేస్తోంది. అలాగే ప్రభుత్వ దవాఖానాల్లో కొరోనా బాదితులకు సరైన వైద్యం అందడంలేదంటూ, అందుకు నిరసన తెలియజేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో పలువురు బిజెపి కార్యకర్తలు కోఠిలోని కొరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఇటీవల ముట్టడించే ప్రయత్నంలో ఆయనతో పాటు, పలువురు బిజెపి కార్యకర్తలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఇప్పుడు తెలంగాణలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు రావడానికి ఇక్కడ పరీక్షల సంఖ్య పెంచకపోవడమేనని, సరిగా టెస్టులు చేస్తే కొరోనాను కట్టడి చేయవొచ్చన్నది వారి డిమాండ్. ఇందుకు డాక్టర్లు, సిబ్బంది సిద్దంగా ఉన్నా ప్రభుత్వం వసతులు కల్పించడంలేదన్నది వారి ఆరోపణ. అంతకు ముందు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర శాఖ జన్‌సంవాద్ వర్చువల్ ర్యాలీ సదర్భంగా కెసిఆర్‌ను తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.
తెలంగాణ కన్నా చిన్నరాష్ట్రాలు ఎక్కువ టెస్టులు చేస్తున్నా, రాష్ట్రం పట్టించుకోకపోవడంతో ఇక్కడ మరణాల రేటు ఎక్కువగా ఉన్నాయంటూ ఆయన చేసిన విమర్శ కూడా టిఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. తాజాగా అరవింద్ మాటలు టిఆర్ఎస్ను మరింత రెచ్చగొట్టాయి. హిందువుల రక్షణకోసం ప్రధాని మోదీ తెచ్చిన సిఏఏను వ్యతిరేకించి కెసిఆర్ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేక శక్తుల చేతుల్లో పెట్టాడని, ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీని తన పెద్దకొడుకుగా చూసుకుంటున్నాడంటూ అరవింద్ తీవ్రపదజాలాన్ని వాడారు. అలాగే 2023 తర్వాత నాయకత్వం వహిస్తున్న కెసిఆర్ కుటుంబ సభ్యులకు చంచల్‌గూడ జైలే గతని తెలిసే కోట్ల రూపాయలను వ్యయంచేసి ప్రత్యేక గదులను నిర్మించుకుంటున్నారంటూ ఆయన వెటకారం చేయడం టిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం నషాళానికెక్కింది. అన్నిటికీ మించి బిల్లా-రంగాలంటూ వరంగల్ నగరానికి చెందిన ఇద్దరు ఎంఎల్ఏలను పరోక్షంగా సంబోదిస్తూ , భూకబ్జాదారులంటూ పేర్కొనటం పరస్పర దాడులకు కారణంగా మారింది. దీంతో వరంగల్ హంటర్‌రోడ్డులోని బిజెపి కార్యాలయంపై, అరవింద్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో టిఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేస్తే, బిజెపి శ్రేణులు స్థానిక ఎంఎల్ఏ వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం పైన దాడి యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీ వర్గాలు ఈ విషయమై నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తుండడంతో రాష్ట్రంలో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. సంఖ్యాబలం తక్కువ కావడంతో ఇంతకాలం మెతకగా వ్యవహరించిన బిజెపి దూకుడు పెంచే దిశలో ఉందన్న విషయం దీనితో అర్థమవుతోంది. రాష్ట్రంలో కాషాయ జంఢా ఎగురవేయాలన్న లక్ష్యంగా ఇక అమీతుమీ తేల్చుకునేందుకు బిజెపి సిద్దపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే పాలనాపరమైన విమర్శలకన్నా, వ్యక్తిగతంగా కేసిఆర్, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించడం బిజెపికి ఎంతవరకు లాభిస్తుందన్నది చూడాల్సిఉంది.