ఖమ్మం, ఆగస్టు 20 ప్రజాతంత్ర(ప్రతినిధి) : ఖమ్మం నగర ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు చేపట్టిన పనులతో పాటు పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను ఆగష్టు, సెప్టెంబర్ మాసంలోగా పూర్తి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణతో కలిసి సమీక్షించారు. పారిశుధ్యపనులు, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు, మినీ లకారం ట్యాంక్ బండ్ పనులు, ఎన్.ఎస్.పి కెనాల్ ప్లాంటేషన్, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు, వీధి వ్యాపారుల ప్రాంగణాల ఏర్పాటు ప్రధాన కూడళ్ళల్లో జంక్షన్ల నిర్మాణపు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లు, మిషన్ భగీరథ, ముఖ్యమంత్రి హామీ నిధులచే జరుగుతున్న సి.సి రోడ్లు, డ్రెయిన్లు, నూతన బస్ స్టాండ్, మున్సిపల్ కార్యాలయ భవసం గోళ్ళపాడు ఛానల్, హరితహారం, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు తదితర అశాలపై మంత్రి మున్సిపల్ పంచాయతీ రాజ్, ఆర్. అండ్.బి, విద్యుత్, మిషన్ భగీరథ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ ప్రజలకు ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీటిని అందించే మిషన్ భగీరథ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అక్టోబరు-2 గాంధీ జయంతి నుంచి ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా కావాలని మంత్రి అధికారులను, ఎల్ అండ్ టి సంస్థ బాధ్యులను ఆదేశించారు. ముఖ్యమంత్రి హామీ నిధుల నుండి 2016-17, 2017-18 సంవత్సరానికి గాను రెండువందల కోట్లు నగర పాలక సంస్థ మంజూరు కాబడినవని, నూతన ఆర్.టి.సి బస్టాండ్, మున్సిపల్ కార్యాలయ భవన పనులు మరింత వేగవంతం చేయాలని, కొత్త సంవత్సరం నాటికి నూతన ఆర్.టి.సి బస్టాండ్ ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు.
అదేవిధంగా ఎల్.ఆర్.ఎస్ నిధులు 55 కోట్లతో చేపట్టిన సి.సి.రోడ్లు, డ్రెయిన్ల పనుల్లో ఇంకనూ మిగిలి ఉన్న పనులన్నీ ఆగష్టు నెలాఖరు వరకు పూర్తి కావాలని, రీ-టెండర్లు పిలిచి పనులను సెప్టెంబరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నగరంలో పారిశుధ్య పనులను మరింత వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఉన్న 20 స్వచ్ఛ ఆటోలతో పాటు మరో 30 స్వేచ్ఛ ఆటలు నెలాఖరులోగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి డివిజన్ ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఫాగింగ్, స్ప్రేయింగ్ పనులు జరగాలని సూచించారు. లకారం మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనుల్లో మిగిలి ఉన్న అంతర్గత పనులతో ‘ పాటు మంకీ ఫుడ్ కోర్టును పూర్తి చేయాలన్నారు. హరితహారంలో భాగంగా నగరంలో విరివిగా చెట్లు నాటాలని కార్పొరేషన్ లో ప్రతి డివిజన్లో చెట్లు కనపడాలని మంత్రి అన్నారు. దీనితో పాటు ఎన్.ఎస్.పి కెనాల్ ప్లాంటేషన్ ను కూడా త్వరగా పూర్తి చేసి కెనాల్ గట్టుపై ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించే ఏర్పాట్లు చేయాలన్నారు. వీధివ్యాపారుల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాంగణాల పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, రోడ్లపై ఎక్కడా కూడా వీథి వ్యాపారులు లేకుండా ప్రాంగణాలలో వారికి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. నగరంలో గుర్తించిన 37 ప్రాంతాలలో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణాలలో భాగంగా ఇప్పటి వరకు 60 పూర్తయ్యాయని, పురోగతిలో ఉన్న 109 పబ్లిక్ టాయిలెట్లను నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. గాంధీచౌక్, తెలంగాణ తల్లి సర్కిల్, ఎన్.టి.ఆర్ సర్కిల్, నయాబజార్ కూడళ్ళల్లో గల జంక్షన్లకు లైటింగ్, ఫౌంటేన్, గ్రీనరీలతో మరింత ఆహ్లాదకరంగా తీర్చి దిద్దాలని మంత్రి సూచించారు. నగరంలోని ఫ్లయిఓవర్స్, క్రీడా ప్రాంగణాల ప్రహరీలు, ఇతర ప్రభుత్వ ప్రహారీలపై ‘‘స్త్రీట్ ఆర్టస్’’ వేయించాలని నగరంలోని ప్రతి డివిజన్లలో వీధి నామ ఫలకాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.
పార్కుల అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం ఉన్న పార్కులతో పాటు నూతన పార్కులను ఏర్పాటు చేయాలని, పార్కులలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేయాలని, ప్రతి డివిజన్లో అవకాశాన్ని బట్టి ఒక పబ్లిక్ జిమ్ ఉండాలని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. నగరంలో నూతన బస్ సెల్టర్ల ఏర్పాటుకు గుర్తించిన ప్రదేశాలలో ఆధునిక బస్ షెల్లర్లు ఏర్పాటు చేస్తున్నామని, పోలీసు, రవాణా, ఆర్.అండ్ బి శాఖ అధికారులు గుర్తించిన ప్రదేశాలలో నూతన బస్ షెల్టర్లకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. గోళ్ళపాడు చానల్ పనులను, సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను సెప్టెంబర్ లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. నగరపాలక సంస్థ సాధారణ నిధుల ద్వారా చేపట్టిన మిగులు పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని, 109 పనులకు గాను 58 పూర్తికాగా మరో 34 పనులు పురోగతిలో ఉన్నాయని పురోగతిలో ఉన్న వాటితో పాటు పెండింగ్ పన్ను నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ఖమ్మం నగరాభివృద్ధికి కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పనులను పూర్తి చేసి నగరాన్ని సుందరనగరంగా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించి రాష్ట్రంలోనే ఖమ్మం నగరాన్ని మోడల్ నగరంగా ఉంచాలన్నారు.కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రవర్యుల ఆదేశాలు, సూచనలతో పాటు నగర మేయర్, సుడా చైర్మన్ సహాకారంతో నగరాభివృద్ధి పనులు చేపట్టామని, పురోగతిలో ఉన్న పనులతో పాటు పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. మిషన్ భగీరథ, పబ్లిక్ టాయిలెట్లు, పార్కుల అభివృద్ధి, మినీ లకారం ట్యాంక్ బండ్ పనులు, గోళ్ళపాడు చానల్, ఆర్.టి.సి బస్ స్టాండ్, మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి మంత్రివర్యుల సూచనల మేరకు నిర్దేశిత కాలంలో పూర్తి చేస్తామని తెలిపారు.ఖమ్మం నగరపాలక సంస్థచే కొనసాగుతున్న అభివృద్ధి పనులు. పారిశుధ్య పనులు, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు, వీధి వ్యాపారుల గుర్తింపు, రుణాలు మంజూరు, ఎల్.ఆర్.ఎస్. ముఖ్యమంత్రి హామీ నిధుల పనుల పురోగతిని నగర పాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి వివరించారు. సమీక్షలో నగర మేయర్ డా పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదనరావు, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరీ, ఆర్. డబ్ల్యూ, ఎస్ పర్యవేక్షక ఇంజనీరు కె.శ్రీనివాస్ రోడ్లు, భవనాలు, పంచాయితీరాజ్, నీటి పారుదల శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, జి.వి.చంద్రమౌళి నర్సింహారావు, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రవీణ, ఆర్.టి.సి రీజినల్ మేనేజర్ కృష్ణమూర్తి, ముఖ్య ప్రణాళిక అధికారి కె.శ్రీరామ్, విద్యుత్ శాఖ ఎస్.ఇ రమేష్, ఆర్.డి.ఓ రవీంద్రనాథ్, అర్బన్ తహశీల్దారు శ్రీనివాసరావు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు రంగారావు, ధరణీ కుమార్, కృష్ణారెడ్డి, ఇ.ఇ. కృష్ణలాల్, ఎల్. అండ్ టీ ప్రాజెక్టు ఇంజనీరు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.