Take a fresh look at your lifestyle.

బాల కార్మిక వ్యవస్థ అంతమే మన పంతం కావాలి

‘‘మనమంతా బానిసలం, గానుగలం, పీనుగులం! వెనుక దగా, ముందు దగా, కుడి యెడమల దగా, దగా…..’’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు బాల కార్మికుల విషయంలో ఇప్పటికీ నిజమేననిపిస్తాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 16 కోట్ల మందికి పైగా పిల్లలు వ్యవసాయం, సేవలు మరియు పరిశ్రమలు మొదలైన రంగాలలో ఇంకనూ బాల కార్మికులుగా మగ్గి పోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతీ ఏటా జూన్‌ ‌నెల 12 నాడు ప్రపంచ వ్యాప్తంగా పాటించే ‘‘ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం’’ ( వరల్డ్ ‌డే అగైనెస్ట్ ‌ఛైల్డ్ ‌లేబర్‌ ) ‌గురించి తెలుసుకోవడం సందర్భోచితం.

ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థను రూపు మాపడంపై దృష్టి సారిస్తూ బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడానికి అవసరమయ్యే చర్యలు మరియు కృషి యొక్క ఆవశ్యకతను ప్రపంచ ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశంతో ఈ ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ. ఎల్‌. ఓ) ‌స్థాపించింది. ఐ.ఎల్‌.ఓ ‌వారి వద్ద ఉన్న సమాచారం ప్రకారం 2000 నుండి 2016 సంవత్సరాల మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య 38 శాతం తగ్గినట్లుగానూ, గత ఇరవై సంవత్సరాల్లో దాదాపు 100 మిలియన్ల సంఖ్యలో పిల్లలు బాల కార్మిక వ్యవస్థ నుండి విముక్తి పొందినట్లుగానూ తెలుస్తున్నది. కానీ 2016 నుండి 2020 మధ్య కాలంలో జరిగిన అధ్యయనాల ఆధారంగా ఐ. ఎల్‌. ఓ ‌మరియు యూనిసెఫ్‌ ‌సంస్థలు సంయుక్తంగా జూన్‌ 10, 2021 ‌నాడు తొలి సారిగా బాల కార్మికులపై విడుదల చేసిన ‘‘ఛైల్డ్ ‌లేబర్‌: ‌గ్లోబల్‌ ఎస్టిమేట్స్ 2020, ‌ట్రెండ్స్ అం‌డ్‌ ‌ద రోడ్‌ ‌ఫార్వర్డ్’’ అనే రిపోర్టు ద్వారా ఎన్నో దిగ్భ్రాంతి కలిగించే చేదు నిజాలెన్నో వెలుగులోకి వచ్చాయి.

ఈ తాజా ప్రపంచ అంచనాలు 2020 సంవత్సరం ప్రారంభం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 160 మిలియన్ల సంఖ్యలో 5-17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ( బాలికలు: 63 మి. , బాలురు: 97 మి.) బాల కార్మికులుగా ఉన్నట్లుగానూ, ప్రపంచంలోని ప్రతీ పది మంది పిల్లల్లో ఒకరు బాల కార్మికులేననీ మరియు 79 మిలియన్ల సంఖ్యలో అనగా దాదాపు సగం మంది బాల కార్మికులు వారి ఆరోగ్యం, భద్రత మరియు నైతిక వికాసాన్ని ప్రత్యక్షంగా దెబ్బ తీసే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తున్నట్లు తెలియజేస్తున్నాయి. నగరాల్లోని బాల కార్మికుల సంఖ్య (37.3 మి.)కు సుమారు మూడు రెట్ల (122.7 మి.) సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల్లో బాల కార్మికులున్నట్లుగా కూడా గమనించవచ్చు. వయస్సుల వారీగా గమనిస్తే 5-11 సంవత్సరాల పిల్లలు 89.3 మిలియన్లు, 12-14 సంవత్సరాల పిల్లలు 35.6 మిలియన్లు మరియు 15-17 సంవత్సరాల పిల్లలు 35 మిలియన్ల మంది ఉన్నట్లు బోధపడుతుంది. రంగాల వారీగా చూస్తే 70 % పిల్లలు వ్యవసాయం, 19.7% పిల్లలు సర్వీసులు మరియు 10.3 % పిల్లలు పరిశ్రమల్లో బాల కార్మికులుగా బతుకులీడుస్తున్న వైనం కనిపిస్తుంది. కోవిడ్‌-19 ‌సంక్షోభం వల్ల ఆదాయాలు తగ్గి పేదరికం పెరిగిపోతున్న కారణంగా మరో 8.9 మిలియన్ల మంది పిల్లలు 2022 సంవత్సరాంతానికి బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉందని, తక్షణమే తగిన సామాజిక భద్రతా చర్యలు చేపడితే తప్ప ఈ ముప్పు నుండి తప్పించుకోలేమనీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఐ. ఎల్‌. ఓ ఇతోధిక కృషి చేస్తున్నది. ఐ. ఎల్‌. ఓ ‌మినిమం ఏజ్‌ ‌కన్వెన్షన్‌, 1973 (‌నంబరు 138) ద్వారా పని లేదా ఉద్యోగంలో చేరే పిల్లలకు కనీస వయస్సు నిర్ణయించేటట్లుగా మరియు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే దిశగా జాతీయ విధానాలు రూపొందించుకొనేట్లుగా సభ్య దేశాలను నిర్దేశించింది. 1992 సంవత్సరంలో ‘ఇంటర్నేషనల్‌ ‌ప్రోగ్రాం ఆన్‌ ‌ద ఎలిమినేషన్‌ ఆఫ్‌ ‌ఛైల్డ్ ‌హుడ్‌ (ఐ. ‌పి. ఇ. సి) ‘ అనే కార్యక్రమాన్ని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై ఐ. ఎల్‌. ఓ ‌ప్రారంభించింది. ఐ. ఎల్‌. ఓ ‌వర్సట్ ‌ఫార్మస్ ఆఫ్‌ ‌ఛైల్డ్ ‌లేబర్‌ ‌కన్వెన్షన్‌, 1999 (‌నంబరు 182) ద్వారా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పిల్లలు పని చేయకుండా ఉండేందుకు తగు మార్గ దర్శకత్వం కల్పించింది. 2015 సంవత్సరంలో ప్రపంచ నేతలచే ఆమోదించ బడిన సస్టేయినబుల్‌ ‌డెవలప్మెంట్‌ ‌గోల్స్ (ఎస్‌.‌డి.జి) లో బాల కార్మిక వ్యవస్థను 2025 సంవత్సరంలోగా అన్ని రూపాల్లోనూ అంతం చేయాలనేది ఒక లక్ష్యంగా ఉండటం గమనార్హం. 2021 సంవత్సరాన్ని ‘‘బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా అంతర్జాతీయ సంవత్సరం’’గా పాటించాలని ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.

భారత దేశంలో నెలకొన్న వివిధ రకాల అసమానతలు, విద్యా అవకాశాలు అందరికీ అందుబాటులో లేకపోవడం, భిన్నమైన సంప్రదాయాలు, సంస్కృతులు మరియు తదితర కారణాల వల్ల మన దేశంలో కూడా బాల కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పుకోవచ్చు. 2011 సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం, భారత దేశంలో 5 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లల సంఖ్య 25.96 కోట్లు కాగా వారిలో సుమారు కోటి మందికి పైగా పిల్లలు బాల కార్మికులుగా పని చేస్తున్నారనేది చేదు నిజం. వీరిలో 60 లక్షలకు పైగా వ్యవసాయం, 5 లక్షలకు పైగా గృహ సంబంధిత పనులు మరియు 36 లక్షలకు పైగా పిల్లలు ఇతర పనులు చేస్తున్నారని అంచనా. భారత దేశంలోని బాల కార్మికుల్లో సగానికి పైగా ( దాదాపు 55%) ఉత్తరప్రదేశ్‌,‌బీహార్‌,‌రాజస్థాన్‌, ‌మహారాష్ట్ర మరియు మధ్య ప్రదేశ్‌ ‌రాష్ట్రాలకు చెందిన వారే. అంతేకాదు దాదాపు 4.27 కోట్ల మంది పిల్లల బాల్యం పాఠశాల విద్యకు నోచుకోనేలేదు. కాకపోతే భారత దేశంలో 2001 సంవత్సరంతో పోల్చితే 2011 సంవత్సరం నాటికి బాల కార్మికుల సంఖ్యలో 26 లక్షల మంది తగ్గుదల నమోదు కావడం ముదావహం. ఒక వైపు ఈ తగ్గుదల గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తే, నగర ప్రాంతాలలో మాత్రం బాల కార్మికుల సంఖ్య పెరిగిన విషయం గమనార్హం.

అంతర్జాతీయ కార్మిక సంస్థ అనుభవం ద్వారా తేలిందేమిటంటే స్థిరమైన ఆర్థికాభివృద్ధి, కార్మిక ప్రమాణాలపై ఆదరణ, ఉత్తమమైన పని, సార్వత్రిక విద్య, సామాజిక భద్రత మరియు బాలల అవసరాలు, హక్కులకు సరైన గుర్తింపు తదితర చర్యలు సకాలంలో తీసుకుని బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించవచ్చునని. మన దేశంలో కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎంతో కృషి జరిగినట్లుగా తెలుస్తున్నది. ఐ. ఎల్‌. ఓ ‌కన్వెన్షన్ల (నంబరు 138 మరియు 182 ) స్ఫూర్తిని ప్రతిబింబించే ‘ది రైట్‌ ‌టు ఎడ్యుకేషన్‌ ‌యాక్ట్, 2009’ ‌మరియు ‘ఛైల్డ్ ‌లేబర్‌ అమెండ్మెంట్‌ (‌ప్రొహిబిషన్‌ • ‌రెగ్యులేషన్‌) ‌యాక్ట్, 2016’ ‌లాంటి చట్టాలు మన దేశంలో ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారు.ఐక్య రాజ్య సమితి ప్రస్తుత 2021 సంవత్సరాన్ని ‘‘బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా అంతర్జాతీయ సంవత్సరం’’గా పాటించాలని ప్రకటించిన దరిమిలా మరియు ఈ సంవత్సరం ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని ‘‘బాల కార్మిక వ్యవస్థను ఇపుడే అంతం చేద్దాం (యాక్ట్ ‌నౌ: ఎండ్‌ ‌ఛైల్డ్ ‌లేబర్‌)’’ అనే ఇతివృత్తం ఆధారంగా జరుపుకుంటున్న తరుణంలో భారత దేశంతో పాటు ప్రపంచంలోని బాలలందరికీ తగిన విద్యా అవకాశాలు అందుబాటులోకి రావాలని, వారందరికీ సరైన రీతిలో సామాజిక భద్రత కల్పించబడాలని, తద్వారా ప్రపంచ శాంతి పరిఢవిల్లాలని ఆశిస్తూ బాల కార్మిక వ్యవస్థ అంతమే మన పంతమని ఈ సందర్భంగా నినదిద్దాం.
– మోహన్‌ ‌లింగబత్తుల
9398522294

Leave a Reply