Take a fresh look at your lifestyle.

పరిహారం కోసం కేంద్రమే రుణం తీసుకోవాలి

కొరోనా మహమ్మారిపై పోరులో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తారుమారు అయింది. పన్నుల వసూళ్ళు బాగా పడిపోవడం ఒక కారణం కాగా, ఉన్న నిధులను కొరోనా నివారణ కార్యక్రమాలకు ఖర్చు చేయడం రెండో కారణం. ఈ విషయం కేంద్రానికి తెలుసు. అయినప్పటికీ, వస్తు, సేవా పన్ను (జిఎస్టి) పరిహారాన్ని ఇవ్వలేమనీ, రాష్ట్రాలు రుణాలు తీసుకుంటే ఇప్పిస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఒక లేఖ రాస్తూ ఇది ఎట్టి పరిస్థితులలోనూ ఆమోద యోగ్యం కాదనీ , కొరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన కేంద్రమే రాష్ట్రాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని కోరారు.అంతేకాకుండా, ఏ రాష్ట్రానికా రాష్ట్రం రుణాలు తీసుకోవడం కన్నా, కేంద్రమే రుణాన్ని తీసుకుని రాష్ట్రాలకు పరిహారాన్ని చెల్లించాలని కోరారు.సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా కేంద్రం తగిన ప్రత్యామ్నాయాన్ని అన్వేషించాలే తప్ప ఈ భారాన్ని రాష్ట్రాల మీద విడిచి పెట్టడం సమంజసం కాదని అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా సరిగ్గా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. సిఎస్టీ ని రద్దు చేసే సమయంలో పూర్తి పరిహారాన్ని చెల్లిస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇవ్వజూపగా, రాష్ట్రాలు తిరస్కరించాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత జిఎస్ టి పరిహారం పై రాష్ట్రాలతో పలు దఫాలు చర్చలు జరిగాయి. నష్టాన్ని పూడ్చడానికి రెండు నెలలకోసారి పరిహారాన్ని చెల్లించేందుకు అంగీకరించి కేంద్రం చట్టంలోఇందుకు సంబంధించిన నిబంధన చే ర్చింది.అయినప్పటికీ జిఎస్ టి పరిహారం విషయంలో కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నది.

అయితే, ఇందుకు కొరోనాయే కారణమని కేంద్ర మంత్రి చెబుతున్నారు.అది కూడా నిజమే, కానీ, ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రాలను ఆదుకోవడానికి ఏం చేయాలనేది కేంద్రమే ఆలోచించాలి. రాష్ట్రాలను మీ పాట్లు మీరు పడండి అనడం ఎంత మాత్రం సమంజసం కాదు. రాష్ట్రాలు అప్పులు తెచ్చుకోవాలన్న కేంద్ర మంత్రి సూచనపై మొదట అభ్యంతరం తెలిపింది కేరళ. పశ్చిమ బెంగాల్ కూడా ఈ విషయంలో అభ్యంతరం తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రానికి వత్తాసు పలికే రీతిలో మాట్లాడాయి. ఏమైనా సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్దమన్న కేసీఆర్ వాదనతో చాలా రాష్ట్రాలు ఏకీభవిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి రాష్ట్రానికి జిఎస్టీ పరిహారం అందలేదనీ, కొరోనా కారణ గా తెలంగాణలో 83 శాతం ఆదాయం పడిపోయింది, చెల్లింపుల భారం పెరిగి పోవడంతో వేస్ అండ్ మీన్స్, మార్కెట్ బారోయింగ్స్ ద్వారా గట్టెక్కాల్సి వొచ్చింది. ఈ పరిస్థితులలో కేంద్రం ఆదుకోకపోతే రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.కేంద్ర మంత్రి రాష్ట్రాల ముందు ఉంచిన ప్రతిపాదనల్లో మొదటిది తక్కువ వడ్డీకి ఆర్బీఐ నుంచి రుణాలు ఇప్పించడం, 2.5 లక్షల కోట్ల రూపియిల నిధిని ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా రాష్ట్రాలకు అందుబాటులో ఉంచడం. ఈ రెండు ప్రతిపాదనలపై రాష్ట్రాలు వ్యక్తం చేసిన సందేహాలకు కేంద్రం సమాధానమివ్వాల్సి ఉంది. కొరోనా వల్ల తమకు వొచ్చే ఆదాయం బాగా పడిపోయిందని కేంద్ర మంత్రి చెబుతున్నారు. కొరోనా అన్ని దేశాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. అయినప్పటికీ పారిశ్రామిక,వాణిజ్య రంగాలను ఆదుకోవడానికి ఆయా దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలను చెపడుతున్నారు. మన దేశంలో కూడా అటువంటి ప్రత్యేక కార్యక్రమాలను అమలు జేసే విషయంలో కేంద్రం శ్రద్ధ తీసుకోవాలే తప్ప రాష్ట్రాలపైనే ఆ భారాన్ని విడిచి పెట్టడం సమంజసం కాదు. జిఎస్ టి ద్వారా ఏడాది మొత్తంలో మూడు లక్షల కోట్లు వసూలు కావల్సి ఉండగా,ఈ ఏడాది 65 వేల కోట్ల రూపాయిలు మించి వసూలు అయ్యే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది.ఈ నేపధ్యంలో 2 లక్షల 35 వేల కోట్ల రూపాయిల లోటును ఎలా భర్తీ చేయాలో తెలియక కేంద్రం సతమతం అవుతోంది. కొరోనా లాక్ డౌన్ సమయాల్లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీల కోసం ఇప్పటికే లక్షల కోట్లను కేటాయించడం జరిగింది.
అలా ఇచ్చిన సొమ్మును కూడా రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకోవాలన్నది కేంద్రం అభిప్రాయం కావచ్చు., కానీ, అది సాధ్యం కాని పని . ఒక్క జిఎస్టీ విషయంలోనే కాకుండా విద్యుత్, గ్యాస్, వినిమయ, సేవారంగాల్లో గత ఏడాది 8.8 శాతం వృద్ది రేటు నమోదు కాగా,ఈ ఏడాది అది 7 శాతానికి పడిపోయింది. వాణిజ్యం, హోటల్, సేవారంగాల్లో కూడా వృద్ది రేటు గత ఏడాది కన్నా ఈ ఏడాది బాగా క్షీణించింది.ఈ నేపధ్యంలో కేంద్రానికి కూడా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కనిపించడం లేదు. అందుకే, రాష్ట్రాలను మీ దారి చూసుకోండన్నట్టుగా స్పష్టం చేసిందని భావించవచ్చు. స్వతంత్ర భారత దేశంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఉత్పన్నం కాలేదు. వాణిజ్య, కార్పొరేట్ రంగాలు కూడా కొరోనా కారణంగా బాగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ సాయం కోసం అవి కూడా ఎదురు చూస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రమే ఏదో ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి. ఈ విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి రాష్ట్రాలు అమలు జేస్తున్న సంక్షేమ కార్యక్రమాల భారం వేల కోట్లు దాటుతోంది. వీటికోసం అవి ఇప్పటికే దొరికిన చోటల్లా రుణాలు సేకరించాయి. ఈ తరుణంలో సొంతంగా వనరులు సమకూర్చుకోవడం సాద్యం కాదని రాష్ట్రాలు మొర పెట్టుకుంటున్నాయి. కేంద్రం , రాష్ట్రాలు సమష్టిగా ఆలోచించి ప్రత్యామ్నాయా మార్గాలను అన్వేషించి ఈ గండం నుంచి గట్టెక్కేట్టు చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply