Take a fresh look at your lifestyle.

దిల్లీ అల్లర్లకు .. కేంద్రానిదే బాధ్యత

  • అప్రజాస్వామిక చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం
  • మహిళలు, ట్రాన్స్‌జెండర్స్ ‌సంస్థల జేఏసీ

అప్రజాస్వామిక చట్టాలని వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని సామాజిక కార్యకర్త సజయ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య బస్త్తీలు, గల్లీలు, స్కూళ్లు, మసీదులు, దర్గాల్లో జరిగిన మతహింస, ఆస్తి విధ్వంసం వంటి దారుణాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉమెన్‌ అం‌డ్‌ ‌ట్రాన్స్‌జెండర్‌ ఆర్గనైజేషన్‌ ‌జాయింట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ, దళిత్‌ ఉమెన్స్ ‌కలెక్టివ్‌, ‌హైదరాబాద్‌ ‌ముస్లిం ఉమెన్‌ ‌ఫోరం, హైదరాబాద్‌ ఉమెన్స్ అలయన్స్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన మతపరమైన హింస బాధితులకు సంఘీభావంగా రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్బంగా సజయ హాజరై మాట్లాడుతూ స్వంత కుటుంబ సభ్యులని పోగొట్టుకున్న కుటుంబాలకి ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ అమానవీయమైన, గర్హనీయమైన హింసని ఖండిస్తున్నామన్నారు. కళ్ళ ముందు జరుగుతున్న హింసను మూడు రోజుల పాటు ఏమీ చెయ్యకుండా ఊరుకున్న కేంద్ర ప్రభుత్వమే ఈ దారుణాలకు పూర్తి బాధ్యత వహించాలని మండిపడ్డారు. అన్యాయమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని శాంతియుతంగా షాహిన్‌ ‌బాగ్‌ ‌లో వ్యతిరేకిస్తున్న ముస్లిం స్త్రీలని ఢిల్లీ ఎన్నికల ముందు పాలక పార్టీకి చెందిన అనేక మంది నాయకులు మాటలతో, బెదిరింపులతో అనేక రకాలుగా దాడులు చేసి వారు దేశద్రోహులని రెచ్చగొట్టి ప్రసంగాలు చేశారన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశంమొత్తంలో విద్యార్థులు, ఇతర ప్రజాస్వామ్య వాదులు నిరసనలు చేస్తూ దేశ ఉన్నత న్యాయస్థానంలో 60కి పైగా పిటిషన్లు వేశారని పేర్కొన్నారు. అస్సాంలో జాతీయ పౌర జాబితా గురించి, పౌరసత్వ చట్ట సవరణ గురించి, దాని కోసం జరుపుతున్న కొత్త జనాభా పట్టిక గురించి చదివిన వారెవరయినా సరే నిరసనల్లో పాల్గొనటం తప్పదన్నారు.

ఈ మూడు చట్ట సవరణల కలయిక దేశంలో లౌకిక సమాజాన్ని నెలకొల్పటానికి జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు గండి కొడుతుందన్నారు. ప్రోగ్రెసివ్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌(‌పీఓడబ్ల్యూ) అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ దేశ రాజ్యాంగం అన్యాయమైన చట్టాలని వ్యతిరేకించి నిరసన హక్కుని మనందరికి ప్రసాదించినప్పటికి పాలించే రాజకీయ నాయకులకి ఈ హక్కు అసంబద్ధమైనదిగా కనపడుతోందన్నారు. నిరసనకారులు జాతీయ జెండాని, జాతీయ గీతాన్ని, రాజ్యాంగ పీఠికని, రాజ్యాంగాన్ని ఆసరా చేసుకున్నప్పటికీ అధికారంలో వున్న వాళ్లు, మన రాష్ట్రంతో సహా వారి పట్ల అసహనంతో, అవమానకరంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రజలు తమ హక్కుల గురించి, రాజ్యాంగం గురించి తెలుసుకుంటే తమ మాట వినరని పాలకుల భయం అని అన్నారు. నిరసనలకు ఇంత మంది ముస్లిం స్త్రీలు రోడ్ల మీద కొచ్చి దేశ లౌకికతకి కొత్త అర్థాన్ని ఇస్తుంటే ప్రభుత్వాలకి కలుగుతున్న భయమే మతహింసకి కారణమన్నారు. గణతంత్ర రాజ్యాన్ని తమదిగా చేసుకుంటున్న నిరసనలని విధ్వంసం ద్వారా నాశనం చేసి మన మనస్సులో తామంటే భయం పుట్టించటమే వారి ప్రధాన ఉద్దేశమని అన్నారు. భారత దేశ గణతంత్ర స్వరూపానికి అసలు వారసులయిన తాము పేద ప్రజలపై మత పరమయిన హింస ద్వారా భయోత్పాతాన్ని సృష్టించే ప్రయత్నాల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Leave a Reply