- కొత్తగా 3.47 లక్షల రోజువారీ కొత్త కేసులు..703 మృతి
- ఐదేళ్లలోపు పిల్లలకు మాస్కు అసవరం లేదు
- కొత్తగా మార్గదర్శకాలు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూ దిల్లీ, జనవరి 21 : దేశంలో కొరోనా మహమ్మారి పంజా విసురుతోనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. కొత్తగా 3 లక్షల 47 వేల 254 కొరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో కొరోనా వైరస్ బారిన పడిన వారిలో 703 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 20 లక్షలు దాటాయి. ఇక ఐదేళ్లలోపు పిల్లలకు మాస్కులు అవసరం లేదని కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 5.23 శాతం కాగా..కొరోనా నుంచి రికవరీ అయిన వారి రేటు ప్రస్తుతం 93.50శాతానికి చేరింది. దేశంలో కొరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 20,18,825గా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 160.43 కోట్ల టీకా డోస్‌లు అందించబడ్డాయి. 9,692 మొత్తం ఒమిక్రాన్ కేసులు ఇప్పటివరకు కనుగొనబడ్డాయి. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కొరోనా పరీక్షలు 71.15 కోట్లు కాగా..తాజాగా 24 గంటల్లో 19,35,912 పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. గురువారం ఒక్కరోజులో 2 లక్షల 51 వేల 777 మంది కొరోనాను జయించి కోలుకున్నారు.
మరో వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వాలు ముమ్మరం చేశాయి. గురువారం ఒక్కరోజే 70 లక్షల 49 వేల 779 డోసులు అందించారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 160 కోట్ల 43 లక్షల 70 వేల 484కు చేరింది. కోవిడ్ టెస్టుల పాజిటివిటీ రేటు 17.94 శాతానికి పెరిగింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నది. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,692కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతుంది. గురువారం ఒక్కరోజే 70,49,779 డోసులు ఇచ్చారు. ఇండియాలో ఇప్పటి వరకు 1,60,43,70,484 డోసులు వేశారు. గురువారం రోజు దేశవ్యాప్తంగా 19,35,912 కొరోనా టెస్టులు నిర్వహించగా..మొత్తం పరీక్షల సంఖ్య 71.15 కోట్లకు చేరింది. దేశంలో ఓ వైపు కొరనా వైరస్ కేసులు మళ్ళీ భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ టెర్రర్ పుట్టిస్తుంది. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కొరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రత ..క్లినికల్ డ్రగ్స్‌తో చికిత్స విధానం గురించి కేంద్ర ప్రభుత్వంకొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
చిన్న పిల్లలు, 18 ఏళ్లలోపు యువతీయువకుల కోసం కోవిడ్-19కు చికిత్స విధానంలో సవరించిన సమగ్ర మార్గదర్శకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఐదేళ్లులోపు వయసు ఉన్న పిల్లలకు మాస్క్‌లు సిఫార్సు చేయడం లేదని కూడా పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా యునిసెఫ్ రిలీజ్ చేసిన మార్గదర్శకాలలో చిన్న పిల్లలు మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే తల్లిదండ్రుల పర్యవేక్షణలో 6 ఏళ్ల నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలు సురక్షితంగా, సరైన పద్ధతిలో మాస్క్‌లను ఉపయోగించవచ్చని పేర్కొంది. 12 ఏళ్లు పైబడిన వారు పెద్దల మాదిరిగానే మాస్క్‌లు ధరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల, ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య నిపుణుల బృందం మార్గదర్శకాలను సమీక్షించింది.
ఒమిక్రాన్ వేరియంట్ల వల్ల వొచ్చే వ్యాధి తీవ్రతను ఇతర దేశాలలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం చూస్తే..వ్యాధి తీవ్రత తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ మహమ్మారి సులభంగా ఒకరి నుంచి మరొకరి వ్యాపించే గుణం ఉన్నందున తగిన పర్యవేక్షణ అవసరమని తెలిపింది. ఒమిక్రాన్ సంక్రమణ కేసులు లక్షణాలు లేనివి, తేలికపాటి లక్షణలు కలవి.. తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్నవి ఇలా మూడు రకాలుగా వర్గీకరించారు. అంతేకాదు వీటికి చికిత్సా విధానాని కూడా వెల్లడించారు. లక్షణం లేనివారిలో లేదా తేలికపాటి లక్షణాలు గల కేసులలో చికిత్స కోసం ‘యాంటీమైక్రోబయాల్స్ లేదా ప్రొఫిలాక్సిస్’ సిఫారసు చేయడం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తీవ్రమైన లక్షణాలు ఉన్న సందర్భాల్లో..అంటే వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉన్నదనే అనుమానం ఉంటే తప్ప యాంటీ మైక్రోబయాల్స్ ఇవ్వకూడదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చికిత్స కోసం ఉపయోగించే స్టెరాయిడ్లను సరైన సమయంలో, సరైన మోతాదులో సరైన వ్యవధిలో ఉపయోగించాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాదు ఈ మార్గదర్శకాలను మరింత సమీక్షించి, కొత్త లక్షణాలు, చికిత్స లభ్యత ఆధారంగా మరిన్ని విషయాలను త్వరలో ప్రకటిస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.