Take a fresh look at your lifestyle.

పాలకుల వాదనలో డొల్లని బయట పెట్టిన కేంద్ర బడ్జెట్

“రైతుల ప్రయోజనాలకే కొత్త చట్టాలు అని నొక్కి వక్కాణిస్తున్న ప్రభుత్వం మొన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. వ్యవసాయం ఇతర అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవిస్తున్న (2011 జనాభా లెక్కల ప్రకారం 54.6 శాతం) గ్రామీణ ప్రజల ప్రయోజనం కోసం బడ్జెట్లో ఎక్కడా ఏమీ కేటాయించపోగా ఇంతకు ముందు అరకొరగా వున్న వాటిని కూడా తగ్గించారు. 2020- 21 జాతీయ స్థూల ఉత్పత్తిలో 19.9 శాతం వాటా ఈ రంగాలదే. మరి ఇంత జనాభాకి కేటాయింపులు ఏ శాతంలో జరగాల్సి వుంటుంది? మొత్తం బడ్జెట్ లో వ్యవసాయానికి 10 శాతం పైన కేటాయిస్తేనే వ్యవసాయ సంక్షోభం నుంచి కనీసం ఒడ్డున పడగలుగుతామని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. గత సంవత్సరం 5.1 శాతం వున్న కేటాయింపుని ఈ సంవత్సరం 4.3 శాతానికి తగ్గించడం అంటే వీరి “రైతు ప్రయోజన వాదం”లో పరమార్థం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.”

k sajaya sankethamపదునైన బ్లేడుల్లాంటి ఇనుప వైరులు చుట్టలు చుట్టలుగా రహదారిని మూసేస్తూ నిరంతరం కనిపిస్తున్నాయి. రోడ్లకి అడ్డంగా తవ్విన కందకాలు, వాహనాలు రాకుండా పాతుతున్న పదునైన మేకుల కంచెలు; పెద్ద పెద్ద పైపులతో వదలటానికి సిద్ధంగా నీళ్ళతో నింపి వున్న ట్యాంకర్లు; అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియకూడదని ఇంటర్నెట్ సౌకర్యాన్ని బంద్ చేయటం; మంచినీళ్ళు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాలను ఆపేయించటానికి ప్రయత్నించటం; తలనుంచీ కాళ్ల వరకూ కూడా పకడ్బందీగా వున్న ఆహార్యంతో, లాఠీలు, కేన్ గార్డులు పట్టుకుని ఎప్పుడు దాడిచేద్దామా అని చూస్తూ భీతావహం కలిగించే పారా మిలిటరీ, పోలీసు బలగాలు. ఇదీ దేశ రాజధాని డిల్లీ సరిహద్దుల్లో నెలకొని వున్న పరిస్థితి! రైతుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు సాగుతున్న ప్రభుత్వ పెరేడ్. ‘జై కిసాన్’ అనటం అంటే ఈ కేంద్రప్రభుత్వ దృష్టిలో పెద్ద కుట్ర సిద్దాంతం. వారి గురించి ఎవరు మాట్లాడినా అరెస్టుల పర్వానికి తెరతీసింది. రైతుల పక్షాన నిలబడిన పాత్రికేయులను అరెస్టు చేస్తూ, పత్రికలు, టీవీ ఛానెళ్ళపై ఆంక్షలు విధిస్తూ బెదిరిస్తోంది.

 

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండున్నర నెలలుగా గడ్డకట్టించే చలిలో దేశ రాజధాని డిల్లీ సరిహద్దుల్లో లక్షలాదిమంది రైతులు చేస్తున్న ఉద్యమంపై రోజురోజుకీ ప్రభుత్వ నిర్బంధం ఏ విధంగా పెరుగుతోందో అర్థంచేసుకోవటానికి పైన వివరించిన అంశాలు చాలు. ప్రభుత్వం వైపు నుంచీ ఏకపక్షంగా ఒకటే ఆవు కథ నడుస్తోంది. ‘రైతుల ప్రయోజనాల కోసమే చట్టాలు చేశామని, చర్చలకు తలుపులు తెరిచామని, రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నామని, వాళ్లే పట్టించుకోవటం లేదని, డిల్లీ బోర్డర్ లలో టెంట్లు వేసుకుని కూర్చున్నది రైతులు కాదని, వాళ్ళు దళారీలని, వాళ్ళు చెప్పేవి వినకండి’ అన్నదే పాలకుల వాదన! ఏ టివీ చర్చలో చూసినా గానీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాట్లాడే ప్రతి ఒక్కరూ చెప్పేది ఇదే కథ.

అంతకు మించి చెప్పటానికి ఎవరి దగ్గరా ఇంక వేరే సమాచారం ఏమీ వుండదు, వున్నా చెప్పరు. ఎదుటివాళ్ళు చెప్పేది వినాలన్న సోయి కూడా కనీసం వుండదు. పేరుకి చర్చలు, ఇంకో పక్క దుర్మార్గమైన ఇలాంటి నిందాపూర్వక వ్యాఖ్యలు. ‘రైతులే కాదు వారికి మద్ధతునిచ్చేవారు కూడా తీవ్రవాదులే’ అనే కంగనమ్మలు కూడా నిర్లజ్జగా వదరుతూనే వున్నారు. ఆవిడ పెట్టుకున్న కళ్ళద్దాలలోంచి ఏమీ కనిపించదు కాబట్టి అందరికీ వాస్తవాలు కనిపించకుండా పోతాయా? పంజాబ్ మహిళా రైతులు విసిరిన సవాలుకి మాత్రం ఆమె నుంచీ ఉలుకూపలుకూ వుండదు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధ రూపాలను ప్రయోగిస్తే దానిపై వ్యతిరేకత అంతే స్థాయిలో ఎల్లలు దాటి వెళుతుంది అనడానికి మంచి ఉదాహరణ దాదాపు పదికోట్లకు పైగా అభిమానులున్న అంతర్జాతీయ పాప్ కళాకారిణి రిహన్నా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘మనమెందుకు భారతీయ రైతుల ఉద్యమం గురించి మాట్లాడటం లేదు’ అని సూటిగా ప్రశ్నించడమే. దీనితో అనేకమంది అంతర్జాతీయ కళాకారులు, సెలెబ్రిటీలు భారత రైతాంగ ఉద్యమానికి తమ మద్దతుని తెలుపుతూ ప్రకటనలు చేస్తున్నారు.

 

రైతుల ప్రయోజనాలకే కొత్త చట్టాలు అని నొక్కి వక్కాణిస్తున్న ప్రభుత్వం మొన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. వ్యవసాయం ఇతర అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవిస్తున్న (2011 జనాభా లెక్కల ప్రకారం 54.6 శాతం) గ్రామీణ ప్రజల ప్రయోజనం కోసం బడ్జెట్లో ఎక్కడా ఏమీ కేటాయించపోగా ఇంతకు ముందు అరకొరగా వున్న వాటిని కూడా తగ్గించారు. 2020- 21 జాతీయ స్థూల ఉత్పత్తిలో 19.9 శాతం వాటా ఈ రంగాలదే. మరి ఇంత జనాభాకి కేటాయింపులు ఏ శాతంలో జరగాల్సి వుంటుంది? మొత్తం బడ్జెట్ లో వ్యవసాయానికి 10 శాతం పైన కేటాయిస్తేనే వ్యవసాయ సంక్షోభం నుంచి కనీసం ఒడ్డున పడగలుగుతామని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. గత సంవత్సరం 5.1 శాతం వున్న కేటాయింపుని ఈ సంవత్సరం 4.3 శాతానికి తగ్గించడం అంటే వీరి “రైతు ప్రయోజన వాదం”లో పరమార్థం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

 

ఏ గ్రామానికైనా వెళ్లినా అక్కడవుండే చిన్న- సన్నకారు, మహిళా రైతులతో మాట్లాడితే ముందుగా చెప్పే అంశం  వ్యవసాయ పెట్టుబడులకు ఎదురయ్యే ఆటంకాలు. జాతీయ బ్యాంకులు ఇవ్వవు, ఇచ్చినా ఆ రుణాలు సమయానికి అందవు, రుణ మాఫీ అనే నినాదాలు వీరి ఇంటి గుమ్మం వరకూ రావు. అదును- పదును తప్పితే వ్యవసాయంలో కుదరదు కాబట్టి ఆ సమయానికి ప్రయివేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చి పనులు కొనసాగిస్తారు. ఇది చర్వితచరణం. ఈ అప్పులే పెరిగి పెరిగి చివరికి వారు ఆత్మహత్యలు చేసుకునే వైపుగా నెడతాయి. మరి బ్యాంకులు ఇచ్చే రుణాలు ఎవరి ఖాతాల్లోకి వెళుతున్నాయి? అంటే వ్యవసాయం చేయకుండా యాజమాన్య హక్కులను అనుభవించే ఆధిపత్య వర్గాలవారికే వ్యవస్థాగత రుణాలు, ప్రభుత్వం ప్రకటించే భరోసా పథకాలూ అందుతున్నాయి. అత్యధిక శాతం రుణాలు అవసరమైన వాస్తవ సాగుదారులకి అందటం లేదు. వాస్తవ సాగుదారులందరూ కౌలురైతులుగా వున్నారు. వీరికి ఏ విధమైన పెట్టుబడి మద్ధతు వుండటం లేదనేది అనేక పరిశోధనల్లో తేలిన విషయం. భూమి దున్నకం నుంచి విత్తనాలు, నీరు, నారు, నాట్లు, ఎరువులు, పురుగు మందులు, కోత, కూలీలు- ఇలా పంటని మార్కెట్ కి చేర్చేవరకూ కూడా పెట్టుబడి అవసరం చాలా ఎక్కువగా వుంటుంది. కాలం కలిసి వస్తుందో లేదో.. పంటకు మార్కెట్లో మద్ధతు ధర లబిస్తుందో లేదో అనే గుంజాటన గుండెల్లో సలుపుతూనే వుంటుంది.

కాలం కలిసిరాక ఎక్కువ వర్షాలు పడటమో లేదా అసలు వర్షాలే పడక పంట మొత్తం చేలోనే ఎండిపోవటమో జరిగితే ఆ నష్టాన్ని పూడ్చే భీమా సదుపాయం లేదా దానిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే వ్యవస్థలు అందుబాటులో వుండవు. వీటన్నితోపాటు భూమి యజమానులకు ఇవ్వాల్సిన కౌలు మొత్తం, కుటుంబ పోషణ, ఆరోగ్యం, పిల్లల చదువు, పెళ్లిళ్ళు.. ఇంకా ఇతర అన్ని ఖర్చులు ఆ పంటమీద వచ్చే ఆదాయంతోనే నడిపించాలి. ఈ నేపథ్యంలో అర్హులైన సాగుదారులందరికీ వ్యవస్థాగత రుణ సదుపాయం అందించాలి, పండిన పంటలకు కనీస మద్ధతు ధర (గిట్టుబాటు ధర అనే అంశాన్ని ఎప్పుడో మర్చిపోయాం!) ప్రకటించాలి అనే మాట అంటే అది దేశ ద్రోహం కింద చూడబడుతుంది ఈ ప్రభుత్వాల దృష్టిలో!

మరో విషయం, వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలకు సలహా- సంప్రదింపుల వ్యవస్థ గ్రామస్థాయిలో వుండదు. మండలంలో పేరుకి వ్యవసాయ విస్తరణ అధికారులు వున్నా గానీ రైతులకు వ్యవసాయంలో వచ్చే రోజువారీ సమస్యలకు వారందించే మద్ధతు నామమాత్రం. నేల స్వభావాన్ని బట్టి వాటికి తగిన పంటలు వేయాలన్న అవగాహనను పెంచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రభుత్వాలు చేపట్టకపోతే రైతులు ఎంతో నష్టపోవడమే కాదు, నేలసారం పూర్తిగా తగ్గిపోతుంది. ఉదాహరణకు పాత మెదక్ జిల్లాలో గత కొన్ని దశాబ్దాలుగా నెలకొని వున్న వాతావరణ పరిస్థితులు, అక్కడ పండిస్తున్న పంటల సరళితో తగ్గిపోతున్న నేలసారం వంటివాటిలో బొక్కలు ఆర్చుకుపోయే (బోన్ డ్రై) పరిస్థితులు నెలకొన్నాయని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. ఈ పరిస్థితిని అధిగమించటానికి, నేలసారాన్ని పెంచటానికి మార్కెట్ ఆధారిత రసాయన ఎరువుల వాడకంలోకి జారుకోవడంతో వాణిజ్య పంటలు దాటి ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించటానికి అవసరమైన విధానపర, సామాజిక, మార్కెట్ మద్ధతులు రైతులకు లభించవు.

వ్యవసాయ రంగానికి కేటాయించిన పూర్తి బడ్జెట్ అంశాలను గమనిస్తే విధాన నిర్ణయాలేవీ కూడా ఈ దేశ ఆహారభద్రతను కాపాడటంలో తమ శ్రమని ధారపోస్తూ, న్యాయంగా రావాల్సిన ఆదాయాన్ని కోల్పోతున్న చిన్న- సన్నకారు, ఆదివాసీ, మహిళా రైతులకు ఏ మాత్రం మద్దతుగా లేవు. సర్వం కార్పొరేట్ల మాయం చేయటం కోసం వేసిన ఇంకో అడుగే ఈ బడ్జెట్. రైతుల ప్రయోజనం కోసమే ఈ చట్టాలు తెచ్చామనే ప్రభుత్వ వాదన మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ తో పూర్తిగా వీగిపోయింది. బడ్జెట్ ని వందశాతం ఆహ్వానించిన కార్పొరేట్ల ఆనందం చూస్తేనే ఇవి ఏ స్థాయిలో వారికి ఎంత లాభం చేకూర్చబోతున్నాయో అర్థంచేసుకోవచ్చు. రైతులకు రెట్టింపు ఆదాయం అనేది కేవలం ఎన్నికల నినాదం మాత్రమే అని పదేపదే రుజువవుతోంది.

Leave a Reply