- ఎంపిక విధానం కూడా అర్థం కావడం లేదు
- చేసిన సిఫార్సుల్లో కొన్నింటినే ఆమోదించడంపై సుప్రీమ్ కోర్టు అసహనం
- మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని గుర్తించాలి
- చీఫ్ జస్టిస్ రమణ అసంతృప్తి
- ట్రైబ్యునల్ ఖాళీల భర్తీపై ధర్మాసనం తీవ్ర ఆక్షేపణ
ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ వ్యవహారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్వి రమణ మరోమారు తప్పుపట్టారు. దీనిపై బుధవారం సుప్రీమ్ కోర్టులో విచారణ సందర్భంగా ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఖాళీల భర్తీ, సభ్యుల ఎంపిక విధానం కూడా అర్థం కావడంలేదని, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. ఖాళీలు భర్తీ చేయడం కోసం రెండేళ్లు సమయం తీసుకున్నారని, ఆలస్యానికి కొరోనా సహా అనేక కారణాలు చెబుతున్నారని ఎన్వి రమణ అన్నారు. రూల్ ఆఫ్ లా..రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు.
ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సుప్రీమ్ కోర్టు తీవ్రంగా మండిపడింది. తాము చేసిన సిఫార్సుల నుంచి కొంత మందిని మాత్రమే తీసుకోవడంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వారాల్లో ట్రిబ్యునల్ నియామకాలు మొత్తం పూర్తవ్వాలని, ఎవరినైనా నియమించకపోతే కారణం చెప్పాలని ఆదేశించింది. మనది ప్రజాస్వామ్య దేశం. వి•రు కచ్చితంగా చట్టాన్ని అనుసరించాల్సిందే అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ఒక ఏడాది పనిచేయడానికి జ్యుడీషియరీ నుంచి ఎవరైనా వొస్తారా? అని ప్రశ్నించారు. ట్రైబ్యునళ్లలో భర్తీ ఆలస్యంతో ఖాళీల సంఖ్య పెరుగుతుందన్నారు. ట్రైబ్యునళ్ల ఖాళీల భర్తీలో ప్రతిసారీ ఇలాగే ప్రవర్తిస్తున్నారని ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. ధిక్కరణ పిటిషన్ విచారణ వేళ ఏదో ఒకటి చెప్పడం అలవాటైందన్నారు. దీంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వారంలో కౌంటర్ వేస్తామని ఏజీ చెప్పారు. అయితే కౌంటర్ దాఖలు సమస్యకు పరిష్కారం కాదని ఎన్వి రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నియామకాలు చేపట్టడం ఒక్కటే పరిష్కారమన్నారు. సమస్యలు అందరికీ తెలుసునని, కావాల్సింది పరిష్కారమన్నారు. ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నామని, మరికొంత ఓపిక పట్టగలమని అన్నారు. కోర్టు ఉత్తర్వులు రాకముందే నియామకాలు చేపడితే అందరికీ మంచిదన్నారు. రెండువారాల్లో స్పష్టత ఇవ్వకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఎన్వి రమణ పేర్కొన్నారు. జాతీయ గిరిజన కమిషన్ నియామకంలో ఇలాగే వ్యవహరించారని సిజె అన్నారు. డిఆర్టిలో కేసుల విషయంలో ఏపీ, తెలంగాణ కోల్‌కతా వెళ్లాల్సి వొస్తుందని, కోల్‌కతాలో కూడా శాశ్వత సభ్యులు లేరని అన్నారు. జబల్పూర్ నుంచి ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాగే చేస్తే..సమస్యల పరిష్కారం ఎప్పటికి సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. అటార్నీ కోరిన విధంగా రెండు వారాలు వాయిదా వేస్తామని చెప్పారు.
‘ప్రభుత్వం అడిగినందుకే మేము కోవిడ్ పరిస్థితుల్లోనూ దేశమంతా తిరిగి 544 మందిని ఇంటర్వ్యూ చేశాం. అందులో నుంచి 11 మంది జ్యూడీషియల్ సభ్యులు, 10 మంది టెక్నికల్ సభ్యుల పేర్లు ఇచ్చాం. ఇంతమందిలో కొందరినే నియమించారు. మిగతా వాళ్ల పేర్లను వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నియామకాలు చూశాను. మేము ఎక్కువ సిఫార్సులు చేశాం. కానీ అందులో నుంచి కొందరినే నియమించారు. ఇదేం ఎంపిక? ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లోనూ అలాగే చేశారు. వి• నిర్ణయాలు చాలా అసంతృప్తి కలిగించాయి’ అని రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. కొన్ని సిఫార్సులను వొదిలేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. దీనికి రమణ తీవ్రంగా స్పందించారు. ‘ఇది చాలా దురదృష్టకరం. మేము దేశమంతా తిరిగి ఇంటర్వ్యూలు చేశాము. మా టైమ్ వేస్ట్ చేసినట్లేనా? ప్రభుత్వం కోరితేనే కదా మేము చేసింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీజేఐతో పాటు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర్ రావ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతుంది. ప్రభుత్వానిదే తుది నిర్ణయమైతే సెలక్షన్ కమిటీకి ఉన్న విలువేంటని జస్టిస్ నాగేశ్వర్ రావ్ ప్రశ్నించారు.