Take a fresh look at your lifestyle.

రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కేంద్రం అడ్డుపుల్లలు

  • ఆదాయంలో రూ.40 వేల కోట్లకు గండి
  • అసెంబ్లీ వేదికగా నిలదీయాలని సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం
  • డిసెంబర్‌లో వారం పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లకు మంత్రులు హరీష్‌ ‌రావు, ప్రశాంత్‌ ‌రెడ్డిలకు ఆదేశం

డిసెంబర్‌ ‌నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో చర్చిస్తారు. ప్రధానంగా ఆర్థికంగా కేంద్రం చర్యలను ప్రజలకు తెలిసేలా చర్చిస్తారు. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనవసరపు ఆంక్షలు విధిస్తుందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. దీనివల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో రూ.40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటు చేసుకుందని చెప్పారు. ఇటువంటి చర్యల ద్వారా తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తుందన్నారు. ఇప్పటికే జిఎస్టీ బకాయలు సరిగా అందించడం లేదు. అలాగే అనేకానేక అంశాల్లో రాష్ట్ర వాటాలను చెల్లించడం లేదు. జిఎస్టీ వసూళ్లు సజావుగా సాగుతున్నా రాష్ట్రవాటా మాత్రం జమకావడం లేదు. ఇక విభజన సమస్యలపైనా 8 ఏళ్లుగా నాన్చుతున్నారు. ఇత్యాది అంశాలపై ప్రధాని మోదీ సర్కార్‌ ‌వైఖరిపై అసెంబ్లీ వేదికగా నిలదీయాలని సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో కొనసాగుతున్న ఈడీ, ఐటీ దాడులను సమావేశాల్లో కేసీఆర్‌ ‌నిలదీసే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం తమ అధీనంలోని దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలో వరుస దాడులతో బెంబేలెత్తిస్తుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఎదురుదాడికి సిద్ధమవుతుంది. ఇందుకోసం రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులను లక్ష్యంగా చేసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే అవినీతి నిరోధక బృందాన్ని (ఏసీబీని) ఇందుకు అస్త్రంగా వాడుకోనుంది. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం అందినా, ఎవరి నుంచైనా లంచం డిమాండ్‌ ‌చేసినట్లుగానీ, లంచం తీసుకున్నట్లుగానీ ఫిర్యాదులు అందినా.. ఆ ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద నేరుగా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టనుంది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం రాష్ట్ర ఏసీబీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టేందుకు అవకాశం ఉండటంతో.. దాని ఆధారంగా ఎదురుదాడికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. మొత్తంగా కేంద్రం పక్షపాత ధోరణిపై కెసిఆర్‌ ఆ‌గ్రహంగా ఉన్నారు. అనేకానేక అంశాల్లో అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్‌ ‌నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డిని సీఎం ఆదేశించారు.

Leave a Reply