Take a fresh look at your lifestyle.

రాష్ట్రాలు ఎంత ఉత్పత్తి చేస్తే అంత కేంద్రం సేకరించదు

  • ధాన్యం సేకరణలో అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది
  • సభ్యుల ప్రశ్నకు లోక్‌ ‌సభలో కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌వ్రాతపూర్వక సమాధానం

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 23 : ధాన్యం సేకరణకు సంబంధించి అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుందని, రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో కేంద్రం కొనుగోలు చేయలేదని కేంద్ర మంత్రి పియూష్‌ ‌గోయల్‌ ‌కుండ బద్దలు కొట్టారు. లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు పీయూష్‌ ‌గోయల్‌, ‌సాధ్వి నిరంజన్‌ ‌జ్యోతి రాతపూర్వక సమాధానం ఇస్తూ…కనీస మద్దతు ధర, డిమాండ్‌, ‌సరఫరా, మార్కెట్లో ఉన్న ధరలు, ఇతర పరిస్థితులు ఆధారంగానే ధాన్యం సేకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఫుడ్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాతో చర్చించిన తర్వాతనే ధాన్యం కొనుగోలు అంశం మీద కేంద్రం నిర్ణయం తీసుకోగలదని వారు స్పష్టం చేసారు. రాష్ట్రాల నుంచి సేకరించిన ధాన్యం తిరిగి రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని కూడా మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు. ఒకవైపు కేంద్రం ఖరాకండిగా రాష్ట్రాలు ఆశించినంత ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం సభలో చెప్పగా..మరోవైపు కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ను పార్లమెంట్‌ ‌లాబీల్లో తెలంగాణ ఎంపీలు కలిశారు.

తెలంగాణ మంత్రులకు అపాయింట్‌మెంట్‌ ‌కావాలని అడిగారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయమై చర్చించేందుకు మంత్రులు దిల్లీకి వొచ్చారని వారిని కలవాలని విజ్ఞప్తి చేసారు. అందుకు కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ఒప్పుకుని నేడు వారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలకు కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌బుధవారం ఉదయం 11:45కి పార్లమెంట్‌లోని తన ఛాంబర్‌లో కలవమని చెప్పారు. నేడు రాష్ట్ర మంత్రులు ఎంపీలతో భేటీకానున్న పీయూష్‌ ‌గోయల్‌ ‌మంగళవారమే సభలో రాష్ట్రాలు అడిగినంత ధాన్యం కొనుగోలు చేయమని స్పష్టం చేసిన నేపథ్యంలో నేటి సమావేశం ఎంత ఫలప్రదం కానున్నదో ఊహించవచ్చు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో చర్చించేందుకు దిల్లీ చేరుకున్న రాష్ట్ర మంత్రులు నిరంజన్‌ ‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ‌ప్రశాంత్‌ ‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎం‌పీలు నేటి సమావేశం కోసం కావలసిన సమాచారంతో సిద్ధమయ్యారు.

Leave a Reply