పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద సోమవారం ఉదయం కారు డివైడర్‌ను ఢీకొట్టి కల్వర్టులో పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు గాయపడ్డారు. హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన సివిల్ ఇంజనీర్ మంతెన రామకృష్ణ తన కుటుంబ సభ్యులతో మంచిర్యాల నుండి హైదరాబాదు వెళ్తుండగా కాట్నపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. టిఎస్-08-జిసి-5388 నెంబరు గల మారుతి బలెనో జెటా కారు మొదట డివైడర్‌ను ఢీకొట్టి కల్వర్టులో పడిపోయింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు లోపలే ఇరుక్కుపోయిన రామకృష్ణ కుటుంబ సభ్యులను రోడ్డుపై వెళ్ళుతున్న ప్రయాణికులు, స్థానికులు బయటకు తీశారు.
గాయపడినవారిని అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు డ్రైవింగ్ చేసిన రామకృష్ణ(43)కు ప్రమాదంలో కాలు విరిగింది. రామకృష్ణ భార్య స్వర్ణలత(38)కు కుడిచేయితో పాటు, ఎడమ కాలు విరిగింది. రామకృష్ణ సోదరి సిరిమల్ల శిరీష(32)కు భుజానికి తీవ్రంగా దెబ్బతగిలింది. రామకృష్ణ కూతురు స్పందన(14)కు కాలు విరిగింది. కుమారుడు అభిలాష్(9)తోపాటు, శిరీష పిల్లలు శ్రీనిధి(9), ఆరాధ్య(6)లకు స్వల్ఫ గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి ఎసిపి హబీబ్‌ఖాన్, ఐపీఎస్ అధికారి రూపేష్, సుల్తానాబాద్ ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.