Take a fresh look at your lifestyle.

కాలుష్య కోరల్లో చిక్కిన దేశ రాజధాని

ప్రస్తుతం దిల్లీ నగరంతో పాటు పరిసర ప్రాం తాలు గాలి కాలుష్య మేఘాలతో మరోసారి కమ్ముకున్నాయని, ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని, ఇండ్లలో కూడా మాస్కులు ధరించాల్సిన అగత్యం ఏర్పడిందని, కేంద్రప్రభుత్వం సత్వరమే తగు కట్టడి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రిఫైనరీలు, పవర్‌ ‌ప్లాంట్లతో పాటు ముఖ్యంగా పంజాబ్‌, ‌హర్యానా రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం, శిలాజ ఇంధన వాహనాలు లాంటి మానవ ప్రమేయ కారణాలతో విడుదలైన దుమ్ము, ధూళితో పాటు పియం-2.5 ఘన మరియు ద్రవ రేణువులు గాలి కాలుష్యాన్ని కలుగజేసి దేశ రాజధానిని మరోసారి అతి ప్రమాదంలోకి నెట్టింది.
 నేటి దిల్లీ పరిస్థితులు :
ప్రస్తుతం దిల్లీ నగర గాలి కాలుష్యంలో ఏయిర్‌ ‌క్వాలిటీ ఇండెక్స్ ‌నోయిడాలో 529 పాయింట్లు, దిల్లీ యూనివర్సిటీ 475 పాయింట్లు, ఢిల్లీ వ్యాప్తంగా 431 పాయింట్లు దాటడంతో పాఠశాలలు మూసి వేయవలసిన ప్రమాదకర పరిస్థితులు వచ్చాయి. ఏయిర్‌ ‌క్వాలిటీ ఇండెక్స్ 0-50 ‌మధ్య ‘గుడ్‌’, 51-100 ‌మధ్య ‘సాటిస్‌ఫాక్టరీ’, 101-200 మధ్య ‘మాడరేట్‌’, 201-300 ‌మధ్య ఉన్నపుడు ’పూర్‌’, 301-400 ‌మధ్య ‘వెరీ పూర్‌’, 401-500 ‌తీవ్రమైన కాలుష్యంగా సూచిస్తారు. పియం10 కాలుష్యం 345, పియం2.5 కాలుష్యం 200 పాయింట్లకు పైగా పెరగడం పరిస్థితి తీవ్రతను వివరిస్తున్నది. పియం-2.5 కాలుషిత గాలిని పీల్చిన ప్రజలు రోజుకు 20 సిగరెట్లు తాగిన దానికి సమానమైన కాలుష్యానికి లోనవుతున్నారని, నేటి దిల్ల్లీ నగరవాసుల జీవితాలు గాల్లో దీపాలు అవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. దీనిని తట్టుకోవడానికి  ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించారు. పియం-2.5 గాలి కాలుష్యం వల్ల గుండె జబ్బులు, శ్వాసకోశ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరిగిందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలం గాలి కాలుష్య సమీప వాతావరణంలో జీవించిన వారిలో 15 శాతం మరణాలు అధికంగా జరిగాయని తేల్చారు.
కాలుష్య కోరల్లో దిల్లీ :
న్యూ దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో పియం-2.5 కణాల కాలుష్యం ఘనపు మీటరుకు 400 వరకు ఉంటున్నదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థేశించిన సురక్షిత విలువ 25 కన్న 12 రెట్లు ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిని బట్టి 2 కోట్ల దిల్ల్లీవాసులు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. దిల్ల్లీ మహానగరం నేడు గాలి కాలుష్య కోరల్లో చిక్కుకొని ఉంది. నేడు కొరోనా కేసుల నుంచి ఉపశమనం పొందుతున్న వేళ భారత్‌లో నేడు ఉత్తర భారతంలో పియం-2.5 గాలి కాలుష్యం పంజాలో చిక్కిన కారణంగా భవిష్యత్తు భయానకంగా తోస్తున్నది. దిల్లీలో శీతాకాలం నవంబర్‌ ‌నుంచి ఫిబ్రవరి వరకు గాలి కాలుష్యం అపరిమితంగా పెరగడం ప్రతి ఏట జరుగుతున్నది. గాలి కాలుష్యంతో శిశువుల్లో పలు ఊపిరితిత్తుల సమస్యలు, మెదడు ఎదుగుదలకు విఘాతం కలుగుతాయని అంచనా వేస్తున్నారు.
దిల్లీ కాలుష్యానికి కారణాలు :
ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యంతో దాదాపు 5 లక్షల నవజాత శిశువులు మరియు ఇండియాలో 1 లక్ష శిశువులు మరణించారని అంచనా వేశారు. నేడు దిల్లీలో ఈ దుస్థితికి కారణం ‘నేషనల్‌ ‌క్యాపిటల్‌ ‌టెర్రిటరీ’ పరిసర వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం, దీపావళి బాణాసంచాలు పేల్చడం, రోడ్డు సైడ్‌ ‌దుమ్ము ధూళి, గృహ నిర్మాణ పరిశ్రమ, వాహన మరియు పారిశ్రామిక ఉద్గారాల వల్ల విష వాయువులతో కూడిన గాలి కాలుష్యం అని తెలుస్తున్నది. దిల్లీ నగరంలోని మురికివాడల ప్రజలకు గాలి కాలుష్య దుష్ప్రభావం ఎక్కువగా పడడం విచారకరం. ఈ ప్రమాదకర గాలి కాలుష్యంతో జనులు దగ్గడం, తుమ్మడం అధికమైన కారణంగా కరోనా వారస్‌ ‌వ్యాప్తి వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. పియం-2.5 రేణువులు కలిగిన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని, ఏసీఈ-2 రెసెప్టార్లు అధికంగా ఉత్పత్తి అవుతూ, పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. బిపి, మధుమేహం, కరోనరీ వ్యాధులు మరియు అస్తమాలతో బాధ పడుతున్న ప్రజలకు గాలి కాలుష్యంతో వ్యాధినిరోధకశక్తి తగ్గి పోయి అతి ప్రమాదకరంగా మారనుంది. పియం-2.5 కాలుష్యంతో పాటు గాలిలో నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు మరియు ఓజోన్‌ ‌పరిమితులు పెరిగిన కారణంగా కోవిడ్‌-19 ‌కట్టడి కష్టం అవుతుందని హెచ్చరిస్తున్నారు.
కాలుష్యాన్ని కట్టడి చేసే మార్గాలు :
దిల్లీ కాలుష్యాన్ని నియంత్రించని యెడల ఈ శీతాకాలం ప్రజారోగ్యం గాలిలో దీపం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే అతి కాలుష్య 20 నగరాల్లో భారత్‌లోని దిల్లీతో పాటు దేశంలోని మరో 13 మహానగరాలు ఉండడంతో కోవిడ్‌-19 ‌రోగులకు ప్రాణాపాయం ఉందని గమనించాలి. అధిక ఓజోన్‌ ‌కాలుష్యంగల 10 ప్రపంచ దేశాల్లో ఇండియా కూడా ఉన్నది. దిల్లీలో గాలి కాలుష్యాన్ని అదుపు చేయని యెడల, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దాని కన్న 20 రెట్లు అధిక గాలి కాలుష్యం పెరగవచ్చని భయపడుతున్నారు. గాలి కాలుష్యాన్ని తగ్గించుటకు రైతులను చైతన్య పరిచి, వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం తక్షణమే ఆపివేసి, పంట వ్యర్థాలను ప్రస్తుతం ఈజిప్ట్‌లో జరుగుతున్న సిఓపి-27 సదస్సులో కాలుష్య కట్టడికి ప్రపంచ దేశాలు అమలు పరచవలసిన కర్తవ్యం తక్షణమే ప్రారంభించాలి. పొగమంచు ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వాహనాల రద్దీని కనిష్ట స్థాయికి తగ్గించాలి. ప్రమాదకరమైన కాలుష్యహేతు బాణాసంచాలు కాల్చడాన్ని నిషేధించాలి. దిల్ల్లీతో పాటు భారత్‌లోకి అనేక నగరాలు కాలుష్య కోరల్లో చిక్కి సతమతం అవుతున్నాయి. దేశ ప్రజలు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకొని, కాలుష్యా ప్రభావాన్ని తగ్గించే జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్య భారతాన్ని నిర్మించుటలో భాగస్వాములు అవుతారని ఆశిద్దాం.

image.png
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగరం, 9949700037

Leave a Reply