Take a fresh look at your lifestyle.

ఎల్‌ఆర్‌ఎస్‌ ‌పేరుతో ప్రజలపై భారం

కొరోనాతో కష్టాల్లో ఉంటే వసూళ్లా
కాంగ్రెస్‌ ‌నేత పొన్నం ప్రభాకర్‌ ‌మండిపాటు
‌రాష్ట్రంలోగ్రామీణ , పట్టణ ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లు, అందులోని ప్లాట్ల క్రమబద్ధీకరణ చేయడానికి లేఅవుట్‌ ‌రెగ్యులరైజేషన్‌ ‌స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌) ‌పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసి ప్రజల్లో ఆందోళనకు కారణమయ్యిందని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌ ‌విమర్శించారు. దీంతో ప్రస్తుతమున్న అనుమతుల్లేని లేఅవుట్‌ ‌వెంచర్లన్నీ తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల అనధికార ప్లాట్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ 16 లక్షల మంది అప్ల్లై చేసుకుంటే వచ్చే ఫీజుతోనే సుమారు రూ.160 కోట్ల ఆదాయం వస్తుంది. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు 2021 జనవరి 31 వరకూ ఎల్‌ఆర్‌ఎస్‌ ‌ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకున్నట్లయితే 16 లక్షల ప్లాట్లకు గాను ఒక్కో దానికి సుమారు రూ.50 వేల చొప్పున వేసుకున్నా, రూ. 8వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశముంది. ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతోంది.

అసలే కొరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన దయనీయమైన స్థితిలో ఉన్న ప్రజలపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ‌తీసుకొచ్చి నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. లాక్‌డౌన్‌ ‌సమయంలో ప్రజలను ఆదుకోవడానికి కొంత నగదు ఇచ్చి బియ్యం పంపిణీ చేయడంతో పాటు, ఇంటి అద్దెలను సైతం కట్టొద్దని చెప్పిన ముఖ్యమంత్రి నేడు వేల కోట్ల రూపాయలు ఎల్‌ఆర్‌ఎస్‌ ‌పేరుతో వసూలు చేయడానికి పూనుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. పరోక్షంగా ప్రజలను ప్రభుత్వం బెదిరించి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టంగానే కన్పిస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏర్పడ్డాక 2015లో ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకొచ్చింది. అక్రమ లేఅవుట్లు, అనధికార ప్లాట్లు క్రమబద్ధీకరించు కోవాలని సూచించింది.

ఆ సమయంలో దరఖాస్తు రూపంలో రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు. ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించకుండానే మూలన పడేశారు. తిరిగి నేడు మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్‌ ‌చేయించుకోవాలంటూ కొత్త జీవో తేవడంతో గతంలో కట్టిన డీడీల మాటేమిటని ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడే దమ్ము లేకనే పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఆరేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ ఎందుకు అనుమతి లేని ప్లాట్లు, లేఅవుట్లకు రిజిస్ట్రేషన్‌ ‌చేయనిచ్చారని ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏకపక్షంగా ఆర్థికభారం మోపడం తగదని,. తక్షణమే జీవో 131, 135లను రద్దుచేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply