Take a fresh look at your lifestyle.

ఉవ్వెత్తున ఎగిసిన నల్ల ఆకాశం

”చరిత్ర లోకి వెళితే అమెరికా పునాదులే జాతీ వివక్ష మీద ఏర్పడ్డాయి. బానిస మార్కెట్‌ అత్యంత అమానవీయంగా, హేయంగా సాగేది అగ్రరాజ్యంలో. ఆఫ్రికా ఖండం నుంచి నీగ్రోలను సంతలో పశువులెక్కన కొని తమ వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేయించుకునే వారు. కాల్సన్‌ వైట్‌హెడ్‌ రాసిన “అండర్‌ గ్రౌండ్‌ రైల్‌ రోడ్‌” వంటి పుస్తకాలు నాటి అమెరికా సమాజ దాష్టికాన్ని కళ్ళకు కడతాయి. ఆ మూలాల ఆనవాళ్ళే ఇటువంటి ఉదంతాలు. సమాజంలో కంటికి కనిపించని పొరల్లో పేరుకుపోయిన వివక్ష, నిరాశ, నిస్పృహలు, ఆర్ధిక, సామాజిక అసమానతలు ఇవాళ నిరసన గళాల్లో వ్యక్తం అవుతున్నాయి..”

rehanaకరోనా కల్లోలాన్ని దాటి ఇప్పుడు చర్చ అంతా అగ్ర రాజ్యం గురించే. అక్కడి పునాదుల్లో పేరుకుపోయిన జాత్యహంకారం గురించే. ఆఫ్రో అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ పై పోలీసు దాష్టికం, హత్యతో యావత్‌ అమెరికాలో నిరసన ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఇంత జరుగుతున్న ప్రపంచాధినేతగా తనకు తాను భావించే ట్రంప్‌…పుండు పై కారం చల్లే ట్వీట్లు, స్టేట్‌మెంట్లు ఇస్తూనే ఉన్నారు. అగ్గికి స్వయంగా మరింత ఆజ్యం పోస్తూనే ఉన్నారు. పోలీసు చేతిలో ఓ వ్యక్తి మరణిస్తే అమెరికా ఎందుకు శ్వేత సౌధాన్ని సైతం చుట్టేసిన స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.? శాంతి భద్రతలు కాపాడాల్సిన అధ్యక్షుడే ఎందుకు రెచ్చగొడుతున్నాడు? రెండిటికి లోతైన కారణాలే ఉన్నాయి.
తెల్ల అహంకారానికి మరో నల్లమేఘం ఆవిరి..
అగ్రరాజ్యం అమెరికా కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఆర్ధిక, ఆరోగ్య సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. తాజా గణాంకాల ప్రకారం ఆ దేశంలో సుమారు 18లక్షల 80 వేల పై చిలుకు మంది వైరస్‌ బారిన పడ్డారు. ఏకంగా లక్షకు పైగా కరోనాకు బలయ్యారు. పిట్టల్లా రాలుతున్న బాధితుల్ని సమాధి చేయటానికి కూడా చోటు లేని స్థితి అమెరికాది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు ఈ గడ్డపైనే. ఓ వైపు దేశ పరిస్థితి ఇలా ఉంటే…జాత్యాంహకార ఉదంతంతో గత వారం రోజుల నుంచి అమెరికా అట్టుడుకుతోంది. కరోన సోకుతుందనే భయంగాని, ఆలోచన గాని ఉండే పరిస్థితి ఆందోళనకారుల్లో లేదు. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం అన్నట్లు తెల్లతోలు అహంకారాన్ని, ప్రభుత్వ విధానాన్ని తమలో దాగిన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్, చికాగో, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెలస్ తదితర 40కు పైగా నగరాల్లో నిరసనకారులు ఘర్షణలకు దిగారు. చాలా చోట్ల నిరసన హింస రూపం  తీసుకుంది. షాపుల లూటీలు, భవనాలు, వాహనాల దహనాలు జరుగుతున్నాయి.
        మినియాపోలిస్‌లో మే 25 సాయంత్రం కప్ ఫుడ్స్ అనే ఓ షాపులో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ ఆఫ్రో అమెరికన్‌ సిగరెట్ ప్యాకెట్ కొనటానికి వెళ్ళాడు. అయితే అతను ఇచ్చిన 20 డాలర్ల నోటు నకిలీది అని అనుమానించిన షాపు ఉద్యోగి ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంత వరకు తప్పుపట్టడానికి ఏమీ లేదు. పోలీసులు వచ్చి అతన్ని విచారించి, వివరాలు తీసుకుని వెళ్లిపోయి ఉంటే…ఇవాళ ఈ చర్చే వచ్చి ఉండేది కాదు. కాని అలా జరగలేదు. ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకునే క్రమంలో డెరెక్ షావిన్ అనే ఓ తెల్ల జాతి పోలీస్ అధికారి కింద పడిపోయిన జార్జ్‌ మెడను తన మోకాలితో నొక్కి పెట్టాడు. జార్జ్‌ పారిపోయేందుకు లేదా ఎదిరించేందుకు ప్రయత్నించలేదని అక్కడ రికార్డ్‌ చేసిన వీడియోను బట్టి అర్థమవుతుంది. “ప్లీజ్‌…నాకు ఊపిరి ఆడటం లేదు” అంటున్న జార్జ్‌ దైన్యాన్ని వినే పరిస్థితిలో పోలీసధికారి లేడు.
ఆ వేడుకోలే జార్జ్‌ చివరి మాటలయ్యాయి. 8 నిమిషాల 46 సెకన్ల పాటు షావిన్ తన మోకాలితో ఫ్లాయిడ్ మెడను నొక్కిపట్టి ఉంచాడని విచారణలో తేలింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో రాగానే ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. అమెరికా నిప్పుల కుంపటి అయ్యింది. ఒక్క అమెరికా ఏమిటి ఇవాళ ప్రపంచం అంతా జాతి దురంహకారానికి నిరసనగా గళం విప్పుతోంది.
అమెరికాలో నల్లవాళ్ల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించిన ఉదంతం ఇది మొదటిది కాదు, చివరిది అనుకోవటానికీ లేదు. కరోనా కేసులు, మరణాల బాధితుల్లో సైతం మూడింట రెండంతలు నల్లవాళ్లే అని కొన్ని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. చరిత్ర లోకి వెళితే అమెరికా పునాదులే జాతీ వివక్ష మీద ఏర్పడ్డాయి. బానిస మార్కెట్‌ అత్యంత అమానవీయంగా, హేయంగా సాగేది అగ్రరాజ్యంలో. ఆఫ్రికా ఖండం నుంచి నీగ్రోలను సంతలో పశువులెక్కన కొని తమ వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేయించుకునే వారు. కాల్సన్‌ వైట్‌హెడ్‌ రాసిన “అండర్‌ గ్రౌండ్‌ రైల్‌ రోడ్‌” వంటి పుస్తకాలు నాటి అమెరికా సమాజ దాష్టికాన్ని కళ్ళకు కడతాయి. ఆ మూలాల ఆనవాళ్ళే ఇటువంటి ఉదంతాలు. సమాజంలో కంటికి కనిపించని పొరల్లో పేరుకుపోయిన వివక్ష, నిరాశ, నిస్పృహలు, ఆర్ధిక, సామాజిక అసమానతలు ఇవాళ నిరసన గళాల్లో వ్యక్తం అవుతున్నాయి.
చితి మంటలతో చలి కాచుకుంటున్నారా?
 ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగితే వారిని నయానో, భయానో సముదాయించే ప్రయత్నం చేస్తాయి ప్రభుత్వాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పోలీసులు టియర్‌ గ్యాస్‌లు, వాటర్‌ స్ప్రేయర్స్ వంటివి ప్రయోగించటం కూడా కొంత వరకు సాధారణమే. అంతే కాని నిరసనకారులతో ప్రభుత్వాలు, నాయకులు కయ్యానికి కాలుదువ్వరు. వాళ్ళు మరింత విధ్వంసానికి పాల్పడే విధంగా రెచ్చగొట్టరు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సరిగ్గా ఇదే చేస్తున్నారు. ట్రంప్‌ తీరు, విచిత్రమైన వ్యక్తిత్వం ప్రపంచానికి కొత్త కాదు. కాని తాజా ఉదంతం పరాకాష్ట. అల్లర్లను అణచటానికి సైన్యాన్ని రంగంలోకి దింపుతానని హెచ్చరించారు. మరో అడుగు ముందుకు వేసి నిరసనకారులను ఏకంగా స్థానిక ఉగ్రవాదులనే ముద్ర వేశారు. వీడియో సాక్షిగా ఓ తెల్ల పోలీసు నల్లజాతీయుడి పీకమణిచి అందరి ముందే హత్య చేస్తే తప్పు ఒప్పుకుని దేశానికి క్షమాపణ కోరాల్సిన పరిస్థితిలో లూటీ చేస్తే కాల్చేస్తాం అని హెచ్చరించటం వెనుక ట్రంప్‌ తెంపరి తెనం మాత్రమే ఉందని అనుకోవటానికి లేదు. చితి మంటలతో చలి కాచుకునే నిఖార్సైన రాజకీయ నాయకుడి ఛాయ కూడా కనిపిస్తుంది. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. కరోనా విషయంలో చేతులెత్తేసి ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న ట్రంప్‌కు జాతుల వైరం ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో జాతీయత, దేశ భక్తి పేరుతో వర్గాల మధ్య దూరం పెంచటం, విబేధాలు ఎగదోయటం మనకు అనుభవమే. 2016లో జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపుకు బాసటగా నిలిచిన వారిలో వైట్‌ అమెరికన్లే సింహభాగం. ఆఫ్రికా అమెరికన్ ఓట్లు ట్రంప్‌కు అనుకున్న స్థాయిలో పడలేదు. ఇప్పుడు రంగులను వేరు చేయటం ద్వారా తన ఓటు బ్యాంకును కన్సాలిడేట్‌ చేసుకోవటం ట్రంప్‌ వ్యూహం కాదని అనుకోవటానికి లేదు.
అలా కూడా జరుగుతుంది:
అవును కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు అనిపిస్తుంది ఇలా కూడా జరుగుతుందా అని. తన మాటలు, ఆంక్షలు, హుంకారాలతో ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్నట్లు అనిపించే శ్వేత సౌధ అధిపతి ట్రంప్ కొంత సమయం ప్రాణ భయంతో గడిపారు. వేలాది మంది నిరసనకారులు వైట్‌హౌస్‌ దగ్గర విధ్వంసానికి దిగితే అధ్యక్షుడు తన సౌధం అడుగున ఉండే బంకర్‌లో కుటుంబంతో సహా వెళ్లి దాక్కుకున్నారు. ఆయన అక్కడ గడిపిన గంట సమయంలో సద్దాం హుస్సేన్‌, ము-అమ్మర్‌-గడాఫి గుర్తుకు వచ్చి ఉంటారా?.

Leave a Reply