Take a fresh look at your lifestyle.

చాందసవాదుల కరాళ నృత్యం

ప్రాణాలొడ్డి నొప్పులుతీసి
జన్మనిచ్చిన ఆమె
నోటివెంట తొలిపలుకులు
నేర్చిన వారే ఆమెకు
చదువు అనవసరమని తీర్మానిస్తున్నారు

ఆమెకు ప్రమాదం తమనుంచే అయినా
స్వయం నియంత్రణ కాదు సరికదా
పరిష్కారం ‘‘పరదా’’ వేయించటమేనని
ప్రమాద కారకులు ప్రతిన బూనుతున్నారు

తన స్తన్యం తాగి తనువులు పెంచి
పశుబలాన్ని ప్రయోగించి తనవైన
అన్నిటిపైన ఆక్రమణ కొనసాగించి
ఆమెను అబలని ప్రవచిస్తున్నారు

తను పంచిన ప్రేమామృతమును గ్రోలి
నులి వెచ్చని తన ఒడిలో కరిగి
తన చల్లని ఆలన పాలనలో పెరిగి
ఆమె పాలనకు పనికిరాదని ప్రేలుతున్నారు

రెండు అండాశయాలు ఒక గర్భాశయం
ఉన్నందువల్ల ఆమె చాలా అవకాశాలకు
అనర్హురాలని ఆ గర్భాశయంలోంచి
పుట్టుకొచ్చిన సగం మంది అంటున్నారు.

– టి. హరికృష్ణ, జిల్లా అధ్యక్షులు
మానవ హక్కుల వేదిక, ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా
సెల్‌: 9494037288

Leave a Reply