Take a fresh look at your lifestyle.

సిద్ధిపేట ఘటనను సీరియస్‌గా తీసుకున్న బిజెపి నాయకత్వం

  • పూర్తి నివేదిక ఇవ్వాలని కిషన్‌రెడ్డి ఆదేశం
  • అమిత్‌ ‌షా ఆరా?
  • సిపి బదిలీతో సరిపెడతారా? ఉప ఎన్నిక వాయిదా వేస్తారా?

సిద్ధిపేటలో దుబ్బాక బై ఎలక్షన్‌ ‌బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు అత్తగారింట్లో పోలీసులు సోదాల పేరిట వ్యవహరించిన తీరును బిజెపి రాష్ట్ర నాయకత్వమే కాకుండా కేంద్ర నాయకత్వం కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు కనబడుతున్నది. బిజెపిలో రఘునందన్‌రావు అత్తగారింట్లో పోలీసులు డబ్బులున్నాయన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించడం…పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జి చేయడం, స్థానిక నాయకులు, నేతలతో పాటు మాజీ ఎంపిలు జితేందర్‌రెడ్డి, వివేక్‌ ‌వెంకటస్వామి వంటి సీనియర్‌ ‌నేతలను అరెస్టులు చేయడం…పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్‌ ‌పట్ల సిద్ధిపేట పోలీస్‌ ‌కమిషనర్‌ ‌జోయల్‌ ‌డేవిస్‌ ‌కొంత దురుసుగా, అమానుషంగా వ్యవహరించిన తదితర అంశాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సంబంధిత పోలీస్‌ అధికారులను పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారనీ సమాచారం. పార్టీ అధ్యక్షుడు, ఎంపి అని కూడా చూడకుండా బండి సంజయ్‌ను సిపి జోయల్‌ ‌పోలీస్‌ ‌వాహనంలోకి తోసేయడంతో బండి సంజయ్‌కు స్వల్పంగా గాయాలు కావడంతో ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా కూడా బండి సంజయ్‌కు ఫోన్‌ ‌చేసి పూర్తి వివరాలను ఆరా తీసినట్లు సమాచారం.

తన పట్ల దురుసుగా, అమార్యదకరంగా వ్యవహరించిన  సిపి జోయల్‌ను సస్పెండ్‌ ‌చేసే వరకు దీక్షను కొనసాగిస్తాననీ, పార్లమెంటులో ప్రివిలేజ్‌ ‌మోషన్‌ ఇస్తానంటూ ప్రతిన బూనిన బండి దీక్షకు దిగారు. ఇదిలా ఉంటే, సిద్ధిపేటలో చోటు చేసుకున్న ఘటనపై కిషన్‌రెడ్డి హుటాహుటిన సిద్దిపేటకు వొచ్చారు. ముందుగా రఘునందన్‌రావు అత్తగారింటికి వెళ్లి రఘునందన్‌రావు, ఆయన సతీమణి మంజులతో మిగతా కుటుంబ సభ్యులను పరామర్శించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇల్లంతా పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఇల్లంత పరిశీలించిన అనంతరం కిషన్‌రెడ్డి పోలీసుల తీరును ఖండించారు. జరిగిన దానిపై తనకు పూర్తి నివేదికను ఇవ్వాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కిషన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. సిద్ధిపేటలో జరిగిన ఘటనలను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారులకు చెబుతామన్న ఆయన…అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా…పెద్దఎత్తున డబ్బులు వెదజల్లుతున్నారని, అధికారులను చెప్పుచేతుల్లో ఉంచుకొని దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అసలేం జరిగిందో రిపోర్ట్ ఇవ్వాలని డిజిపిని ఆదేశించినట్లు తెలుస్తుంది.

అసలేం జరిగింది..?
సోమవారం రెవెన్యూ, పోలీసు అధికారులు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. రఘునందన్‌ ‌రావు మామ రాంగోపాల్‌రావు, మరో బంధువు అంజన్‌ ‌రావు ఇళ్లలో తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో అంజన్‌ ‌రావు ఇంట్లో రూ. 18.67 లక్షలను అధికారులు గుర్తించారు. అయితే బిజెపి అభ్యర్థి, అతని బంధువుల ఇళ్లలో పోలీసులే డబ్బులు పెట్టడానికి యత్నిస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించారు. ఈ సోదాలపై సమాచారం అందుకున్న బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు, ఆ పార్టీ శ్రేణులు సిద్ధిపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, రఘునందన్‌ ‌రావుకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరగడంతో రఘునందన్‌రావు సొమ్మసిల్లి కింద పడిపోయారు. రఘునందన్‌రావు మామ ఇంట్లో పోలీసులు సోదాల్లో డబ్బులు దొరకనప్పటికీ పోలీసులే డబ్బులు తెచ్చి రఘునందన్‌రావు మామ ఇంట్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ కానిస్టేబుల్‌ ‌చేతిలో సంచిలో ఉన్న డబ్బులను పసిగట్టిని పలువురు నేతలు, కార్యకర్తలు కానిస్టేబుల్‌ ‌నుంచి డబ్బులు లాక్కున్నారు.  దీంతో దాంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

మంగళవారం తొగుట మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న మంత్రి హరీష్‌ ‌రావు వాహనాన్ని మెట్టు వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులు
మంగళవారం తొగుట మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న మంత్రి హరీష్‌ ‌రావు వాహనాన్ని మెట్టు వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులు

సిపి ఏమన్నారంటే…
పోలీసు అధికారుల సోదాలపై సిద్దిపేట సీపీ జోయల్‌ ‌డేవిస్‌ ‌స్పష్టత ఇచ్చారు. నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం సిద్ధిపేటలో దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్‌ ‌రావు బంధువు సురభి అంజన్‌ ‌రావు ఇంట్లో సోదాలు చేశామన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో వోటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అంజన్‌ ‌రావు ఇల్లు కేంద్రంగా ఉదయం నుండి డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. దీంతో సిద్ధిపేట అర్బన్‌ ‌మండల మెజిస్ట్రేట్‌ ‌విజయ్‌ ‌సాగర్‌తో కలిసి సోదాలు చేశామన్నారు. తనిఖీల్లో సురభి అంజన్‌ ‌రావు ఇంటిలో రూ. 18. 67 లక్షలు దొరికాయన్నారు. అంజన్‌ ‌రావును ప్రశ్నించగా తన బావ మరిది జితేందర్‌ ‌రావు ఎన్నికల కోసం తన డ్రైవర్‌ ‌ద్వారా డబ్బు పంపించినట్లు చెప్పారన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులు, తహసీల్దార్‌ ‌వొస్తుండగా రఘునందన్‌ ‌రావు, అతని అనుచరులు అడ్డుకున్నారని సీపీ చెప్పారు. ఈ క్రమంలో సురభి అంజన్‌ ‌రావు ఇంటిలో స్వాధీనం చేసుకున్న డబ్బులలో నుంచి రూ. 5.87 లక్షలు ఎత్తుకెళ్లారన్నారు. డబ్బు ఎత్తుకెళ్లిన వారిపై కేసు నమోదు కేసు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. పోలీసు విధులకు, ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై సైతం కేసు నమోదు చేశామన్నారు. డబ్బు ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి అరెస్ట్ ‌చేస్తామన్నారు. అంజన్‌ ‌రావు ఇంటికి వెళ్లినప్పటి నుంచి జరిగిన సోదాలను పూర్తిగా రికార్డు చేశామన్నారు. బిజెపి నేతల ఫిర్యాదు మేరకు సిద్ధిపేట మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజనర్సు ఇంట్లో కూడా సోదాలు చేశామన్నారు. ఎన్నికల్లో ప్రశాంత వాతావరణానికి ఎవరు భంగం కలిగించినా..వోటర్లను డబ్బుతో ప్రలోభాలకు గురి చేయాలని చూసినా..చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సిపి జోయల్‌ ‌డేవిస్‌ ‌హెచ్చరించారు.

సిపి బదిలీతో సరిపెడతారా? ఉప ఎన్నిక వాయిదా వేస్తారా?
సిద్దిపేటలో సోమవారం మధ్యాహ్నం నుంచి జరుగుతున్న పరిణామాలతో ఏం జరగబోతుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసిన తరహాలోనే సిద్ధిపేట పోలీసు కమిషనర్‌ను కూడా బదిలీ చేస్తుందా? లేదంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను శాంతిభద్రతల సమస్య కింద చూపెట్టి ఉప ఎన్నికను వాయిదా వేస్తుందా? అనే చర్చ మొదలైంది. అధికార పార్టీకి కలెక్టర్‌ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు పరపతి వెంకట్రామరెడ్డిని బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం ఇప్పుడు సిద్ధిపేట వ్యవహారంలో ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరుగుతున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఏ రోజు ఏ నిర్ణయం వెలువడుతుందో అనే ఆసక్తి నెలకొంది. సిద్దిపేటలో పలువురి ఇండ్లలో సోదాలు చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్తున్న పోలీసులు ఆ డబ్బు బిజెపి పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావుకు సంబంధించినదని ధృవీకరించారు.

కానీ, పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని రఘునందన్‌ ‌రావు ఆరోపించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను మాత్రం బిజెపి రాష్ట్ర, కేంద్ర నాయకత్వం మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. బండి సంజయ్‌ ‌పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడే కాదూ, కరీంనగర్‌ ఎం‌పి కూడా. అధ్యక్షుడు, ఎంపి అని చూడకుండా సిపి జోయల్‌ ‌దురుసుగా వ్యవహరించిన తీరును పార్టీ నాయకత్వం సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ ‌నుంచి హుటాహుటిన సిద్ధిపేటకు రావడమే కాకుండా, హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా కూడా సిద్ధిపేటలో జరిగిన పరిణామాలపై బండికి ఫోన్‌ ‌చేసి ఆరా తీయడంతో పార్టీ జాతీయ నాయకత్వం కొంత సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసుల తీరుపై బిజెపి నేతలు ఎన్నికల కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మొత్తంగా సిద్ధిపేట ఎపిసోడ్‌తో కొన్ని మార్పులు జరగడం మాత్రం వాస్తవమనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply