Take a fresh look at your lifestyle.

గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్న బిజెపి

  • బెదిరింపులకు భయపడేది లేదు
  • వొచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దే
  • ఇడి కేసుల తీరుపై మండిపడ్డ సిఎల్‌పి నేత భట్టి, పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌
  • ‌కేంద్రం తీరుపై భగ్గుమన్న కాంగ్రెస్‌…‌హైదరాబాద్‌లో పార్టీ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తుందని, బిజెపి బెదిరింపులకు భయపడేది లేదని సీఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క హెచ్చరించారు. గతంలో ఇందిరాగాంధీని జైలుకు పంపిస్తే ఏం జరిగిందో ప్రజలకు తెలుసునని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం జోలికి వొస్తే బీజేపీని తరిమికొడతామని భట్టి హెచ్చరించారు. ఇది అంతంకాదు..ఆరంభం మాత్రమేనని, ఎన్ని పోరాటాలకైనా కాంగ్రెస్‌ ‌సిద్ధంగా వుంటుందన్నారు. రాహుల్‌, ‌సోనియాలపై ఈగ వాలనివ్వమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భాజపా తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. దేశంలో కాంగ్రెస్‌ ‌బలపడుతుందనే భయంతోనే భాజపా కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. హైదరాబాద్‌ ‌బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌…‌భాజపాపై తనదైన శైలిలో ఫైర్‌ అయ్యారు.

ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు లేకుండానే సోనియా, రాహుల్‌ ‌గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. రాహుల్‌గాంధీని ఈడీ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ.. హైదరాబాద్‌ ‌బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం తప్పు చేసిందంటే ప్రజలు నమ్మరని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందిరాగాంధీని 1979లో జైలుకు పంపిస్తే దేశం మొత్తం మద్దతుగా నిలిచి 1980లో కాంగ్రెస్‌ను గెలిపించారని వివరించారు. 2024లో మళ్లీ అదే రిపీట్‌ ‌కాబోతుందన్నారు. ఈడీ, సీబీఐలు గాంధీ కుటుంబాన్ని ఏం చేయలేవన్నారు. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌లో సుప్రీమ్‌ ‌కోర్టు కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదని తేల్చిందని… దానితో పాటు 2017లో ఈడీ కూడా అవకతవకలు లేవని తేల్చిందని తెలిపారు. 1937లో నెహ్రూ నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రికను స్థాపించారు. సర్దార్‌ ‌పటేల్‌ ‌కూడా నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రిక ఏర్పాటులో భాగం పంచుకున్నారు. స్వాంతంత్రోద్యమంలో ప్రజల్లో ఐక్యత పెంచేందుకే నేషనల్‌ ‌హెరాల్డ్ ‌స్థాపించారు. నెహ్రూ కుటుంబం ఎన్నో నష్టాలకు ఓర్చి నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రికను నడిపించింది. పత్రిక నష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ రూ.90 కోట్లు ఇచ్చి ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది. భాజపా కుట్రలను వివరిస్తున్నందుకు నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రికపై కేసు వేయించారు.

నేషనల్‌ ‌హెరాల్డ్‌లో ఎలాంటి నగదు బదిలీ జరగలేదని ఈడీ 2017లోనే తేల్చింది. భాజపా పాలనలో పేదల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. మోదీ సర్కార్‌ ‌నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దేశ సమగ్రతను కాపాడాలంటే ఒక్క కాంగ్రెస్‌ ‌తోనే సాధ్యం అన్నారు. రాహుల్‌ ‌గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా.. ప్రజల కోసం త్యాగం చేశారని తెలిపారు. రాహుల్‌ ‌గాంధీ ఫ్యామిలీకి డబ్బే కావాలంటే .. దేశ కాంగ్రెస్‌ ‌కార్యకర్తలే చందాలేసుకుని గాంధీ కుటుంబాన్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నిజంగానే గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరంలేదని.. ప్రజాసేవనే వారు కోరుకునేదన్నారు. రాహుల్‌కు 50లక్షలు కాదు..5వేల కోట్లు కావాలన్నా 24గంటల్లో కాంగ్రెస్‌ అభిమానులు ఇవ్వగలరని.. గాంధీ కుటుంబానికి ఆస్తులు, పదవులు అక్కరలేదన్నారు. అన్ని రాష్ట్రాలలోను ఈడీ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతున్నామని చెప్పారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిది అన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హయాంలో విఫరీతంగా ధరలు పెరుగుతున్నాయని, పెట్రో మంట, గ్యాస్‌ ‌గుబులు, నిత్యావసర ధరలు చెప్పుకుంటూ పోతే అన్నీ పెరుగుతూ వచ్చాయని రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు.

977లో ఇందిరా గాంధీని అవమానిస్తే ..1980లో జరిగిన ఎన్నికలో అద్భుతమైన మెజారిటీతో గెలిచిన ఇందిరా గాంధీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యారని తెలిపారు. ఇవాళ తేదీ గుర్తుపెట్టుకోవాలని 13-జూన్‌-2022‌న రాహుల్‌ ‌గాంధీని అవమానించారని, ఇందుకు వొచ్చే ఎన్నికల్లో ప్రజలు వోట్లతో సమాధానం చెబుతారని చెప్పారు. 1980లో కూడా ఇందిరా గాంధీపై కేసు పెడితే.. తర్వాత వొచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలొకి వొచ్చిందని..జూన్‌ 23‌న సోనియా ఈడీ కార్యాలయంలో అడుగుపెడితే మోడీ పునాదులు కదుల్తాయ్‌ అన్నారు. గాంధీ కుటుంబం వి•ద ఈగ వాలినా రాజకీయంగా బతికి బట్టకట్టలేరని.. తెలంగాణ కల సాకారం చేసిన దేవత సోనియా అన్నారు. తెలంగాణ తల్లి సోనియాను ఈడీ ఆఫీస్‌కు పిలుస్తే ఉరుకుంటామా..గాంధీ వారసులం కాబట్టి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ సంఘటనతో కాంగ్రెస్‌కు సానుభూతి పెరుగుతుందని, అధికారంలోని వొచ్చాక ఎవ్వరినీ వదలమన్నారు. సోనియాగాంధీని అవమానించిన వారికి తగిన బద్ది చెబుతామని రేవంత్‌ ‌రెడ్డి హెచ్చరించారు.

కేంద్రం తీరుపై భగ్గుమన్న కాంగ్రెస్‌…‌ హైదరాబాద్‌లో పార్టీ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ
కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌భారీ ర్యాలీ చేపట్టింది. సోమవారం కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ) విచారించిన నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ నెక్లెస్‌ ‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన బషీర్‌బాగ్‌కి చేరుకుంది. అక్కడి ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ‌నేతలు రోడ్డుపైనే బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ ‌స్తంభించిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. సీపీ కార్యాలయం నుంచి అసెంబ్లీ వైపు ట్రాఫిక్‌ ‌పూర్తిగా స్తంభించింది. ఈ నిరసన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. మరోవైపు ర్యాలీ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించారు. ఖైరతాబాద్‌ ‌కూడలి, ఖైరతాబాద్‌ ‌ఫ్లై ఓవర్‌, ‌చింతల్‌ ‌బస్తీ, లక్డీకపూల్‌, ‌బషీర్‌బాగ్‌, ‌తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ ‌కూడలి, అంబేడ్కర్‌ ‌విగ్రహం, ఎన్టీఆర్‌ ‌మార్గ్, ‌లిబర్టీ జంక్షన్‌, ‌సచివాలయ మార్గాల్లో వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

Leave a Reply