- దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలతో టిఆర్ఎస్ పని అయిపోయింది
- అబద్దాలలో కేసీఆర్ నెంబర్ వన్…
- బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు, ఎంపీ బండి సంజయ్
నర్సంపేట, మార్చి 5, (ప్రజాతంత్ర విలేకరి) : 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. శుక్రవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన నర్సంపేటకు వచ్చారు. ఈ సందర్బంగా నియోజకవర్గ బీజేపీ నాయకులు బైకులతో ర్యాలీ తీసి ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. నర్సంపేట పట్టణ ప్రధాన వీదులలో భారీ ర్యాలీతో ఆయన ప్రచారం చేశారు. అనంతరం నెక్కొండ రోడ్డులో రెడ్డి ఫంక్షన్ హాల్లో నర్సంపేట మాజీ శాసనసభ్యులు, బిజెపి రాష్ట్ర నాయకులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో టిఆర్ఎస్ పని అయిపోయిందని ఆయన అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని, ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్‌గా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రెండు స్థానాలలో ఓడిపోతామనే భయం బెంగ కేసీఆర్‌కు పట్టుకుందని అన్నారు. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కష్టపడతానని తెలిపి, మాట తప్పితే మెడమీద నా తలకాయ్ ఉండదు అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ నోరు విప్పితే అన్ని పచ్చి అబద్ధాలేనని అన్నారు. అబద్దాలాడటంలో తండ్రిని మించిన తనయుడిగా కేటీఆర్ తయారయ్యాడన్నారు. కేసీఆర్ కమీషన్లు దండుకుని దండిగా సంపాదించుకున్నాడన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ తొలి సీఎం దళితుడికి ఇస్తానన్నా ఆయన ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.
ఇంటికో ఉద్యోగం అని ఆయన ఇంటికే ఉద్యోగాలు ఇచ్చుకుని, ఉద్యోగాల ఊసే ఎత్తడంలేదన్నారు. నిరుద్యోగ నిరుద్యోగ భృతి లేకుండా పోయిందన్నారు. ఎంతో కష్టపడి కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో యువతను అయోమయానికి గురి చేసి వారి జీవితాలతో ఆడుకోవడం కేసీఆర్ కే చెల్లిందన్నారు. తెలంగాణకు కాపలా కుక్క లాగా ఉంటానని చెప్పి కుక్కల అవమానపరిచిన ఘనత కేసీఆర్‌కే చెల్లిందన్నారు. కేంద్రం నిధులు ఇస్తే తెలంగాణ పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. రేషన్ బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూపాయిపై కేంద్రం 29 రూపాయలు చెల్లిస్తున్నారన్నారు. రైతు భవనాలకు, హరితహారం మొక్కలకు, గ్రామాలకు, మున్సిపాలిటీలకు కేంద్రమే నిధులు ఇస్తుందని ఆయన తెలిపారు. టీఆరెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపేనని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వైపు ప్రజల మొగ్గు కనిపిస్తోందని ఆయన అన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తీర్పు ఇస్తే దొరల, గడీల పాలనకు చరమగీతం పాడినట్లేనని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తే శాసన మండలిలో ఆయన గొంతు వినిపిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గరికపాటి మోహన్‌రావు, ఎడ్ల అశోక్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీదర్, జాటోత్ హుస్సేన్‌నాయక్, పెద్దిరెడ్డి, బాల్నే జగన్, సంతోష్ నాయక్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.