Take a fresh look at your lifestyle.

ప్రారంభం-3

“న్యాయవాదులకు పైకి ఎగబాకడానికి ‘నిచ్చెనలు’ ఎక్కడా దొరకవు. ఒక యువ న్యాయవాది తన వృత్తి ప్రారంభించేటప్పుడు ఆహ్వానించే బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంభీరంగా సర్‌ అల్లాడి ఎంత అట్టడుగు నుంచి ప్రారంభించి శిఖరాలు అధిరోహించారో వివరిస్తారు. ఎవరికైనా పైకిపోయే అవకాశం ఉందంటాడు. కాని సమాజం ఒక అల్లాడిని గుర్తించి పైకి తీసుకుపోయే లోపల, ఎంతో మంది అల్లాడిలు విఫలమై ఉంటారు. నిచ్చెనలు దొరకక నిస్సహాయులయిపోయి ఉంటారు.”

కె జి కన్నబిరాన్‌ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ’24 గంటలు’ను 2005 నుంచి రెండు సంవత్సరాల పాటు ధారావాహికంగాప్రచురించి, పుస్తకంగా కూడ ప్రచురించిన ప్రజాతంత్ర ఆ జ్ఞాపకాలను సవినయంగా గుర్తు చేసుకుంటున్నది. సరిగ్గా అటువంటి పరిణామాలే మళ్లీమళ్లీ జరుగుతున్న ఈ చారిత్రక సందర్భంలో పదిహేను సంవత్సరాల కిందటి ఆ ధారావాహికను మళ్లీ ఒకసారి ప్రచురించాలని తలపెడుతున్నది. ‘వీక్షణం’ సంపాదకులు ఎన్‌ .‌వేణుగోపాల్‌ అక్షరీకరించిన కె జి కన్నబిరాన్‌ ‘24 ‌గంటలు..ఆత్మకథాత్మక సామాజిక చిత్రం’మళ్లీ ఒకసారి ధారావాహికగా ప్రజాతంత్ర పాఠకుల కోసం..

ఆ రోజుల్లో ప్లీడర్‌ ‌గుమాస్తాలు చాలా శక్తిమంతులుగా ఉండేవాళ్ళు. ప్లీడర్‌ను కలవాలో వద్దో వ్ళానిర్ణయించేవాళ్ళు. కొంతమంది ప్లీడర్‌ ‌గుమాస్తాలు ఎంత డాబుగా ఉంటారంటే వాళ్ళే ప్లీడరేమోనని కక్షిదార్లు అనుకుంటారు. ఆ గుమస్తాలకే తమ ప్లీడరు కార్యాలయం మీద పూర్తి అదుపు ఉంటుంది. ఏ ఫైలు ఎక్కడుందో, ఏ కేసు ఏ స్థాయిలో ఉందో సమస్త సమాచారం వాళ్ళ దగ్గరే ఉంటుంది. ప్లీడర్‌ ‌చెప్పినా చెప్పకపోయినా ఈ గుమస్తాలే రైల్వేస్టేషన్లో, బస్‌స్టాండ్లలో కాపువేసి కక్షిదార్లను కనిపెట్టి తమ ప్లీడర్‌ ‌దగ్గరికి తీసుకు వచ్చేవారు. ఒక మనిషిని చూడగానే అతను కక్షిదారో కాదో కనిపెట్టగలిగిన నేర్పు వారికి ఉండేది. మా మలయప్ప అయ్యర్‌ ‌కూడా అటువంటి గుమస్తానే. కాని రాజప్ప పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతూ ఎక్కువ కేసులు వస్తున్న రోజుల్లోనే ఆయన క్రికెట్‌ ‌కంట్రోల్‌ ‌బోర్డు కార్యదర్శి కావడంతో ఆఫీసు గందరగోళం అయింది. కక్షిదార్లను కలవడానికి రాజప్పకు సమయమే దొరికేది కాదు. మలయప్ప అయ్యర్‌కు గుర్రపు పందాల మోజు వల్ల ఆఫీసు దిగజారడం మరింత పెరిగింది.

కక్షిదార్లకు ప్లీడర్‌ ‌దొరకకపోవడమనేది మామూలు విషయమే. తమ కేసు నిర్లక్ష్యం చేస్తున్నాడనో, డబ్బు విషయంలో సరిగ్గా లేడనో ఏ కక్షిదారూ తమ ప్లీడర్‌ ‌మీద కోపం తెచ్చుకోడు. నిజం చెప్పాలంటే ప్లీడరుకూ కక్షిదారుకూ ఉండే సంబంధం అనైతిక సంబంధం. కక్షిదారు తీసుకు వచ్చిన వ్యాజ్యం ఎటువంటిదో ఎప్పుడూ తీర్పు చెప్పగూడదని, తటస్థంగా ఉండాలని ప్లీడరు నేర్చుకునే మొదటి పాఠం. ఒక సాంకేతిక నిపుణిడిలాగ న్యాయవాది కూడా వ్యాజ్యంతో నిరపేక్షంగా వ్యవహరించాలి. కనుక ఒక వ్యాజ్యం తీసుకోవడంలో నీతి-అవినీతి ప్రశ్న లేదు. తాను చేపడుతున్న వ్యాజ్యపు న్యాయాన్యాయాల గురించి న్యాయవాది ఆలోచించగూడదు. అంటే న్యాయవాది తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ద్వంద్వ స్వభావంతో చూడగలగాలి. ఒక ప్రపంచం తన కక్షిదారుల, వారి వ్యాజ్యాల ప్రపంచం. రెండో ప్రపంచం న్యాయవాది వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. అతనికి తన కుటుంబంతో, న్యాయవాదులు కాని మిత్రులతో, నచ్చిన ప్రాపంచిక దృక్పథంతో సంబంధం ఉన్నది. న్యాయవాదికి పేరు ప్రఖ్యాతులు పెరిగిన కొద్దీ ఈ రెండు ప్రపంచాలలో సొంత ప్రపంచం కుంచించుకు పోతూ ఉంటుంది. కక్షిదారుల ప్రపంచం విస్తరిస్తూ ఉంటుంది.

స్వేచ్ఛాయుత పోటీ ప్రపంచంలో ప్రత్యర్థి కన్న ఒక మాట ఎక్కువ అనడమే ప్రమాణమైన చోట న్యాయవాది భీకరమైన పోటీలోకి దిగిపోతాడు. తొలిరోజుల్లోనైతే న్యాయవాదులు తమ జ్ఞానంతో, పాండిత్యంతో, వాగ్దాటితో ప్రత్యర్థుల మీద పైచేయి సాధించేవారు. అందువల్లనే ఆ కాలం ప్రతిభావంతులైన న్యాయవాదు లెందరినో తయారు చేసింది. ఈ ప్రతిభతోనే వారికి ఆత్మసంతృప్తి దొరికేది. ఇప్పటిలాగ సంపాదనాపేక్ష అంతగా ఉండేదికాదు. నిజం చెప్పాలంటే న్యాయవాదులు వెచ్చించే శ్రమకూ, ఖర్చుపెట్టే కాలానికీ వారి సంపాదనకూ ఎప్పుడూ పొంతన ఉండేది కాదు. న్యాయవాదులకు పైకి ఎగబాకడానికి ‘నిచ్చెనలు’ ఎక్కడా దొరకవు. ఒక యువ న్యాయవాది తన వృత్తి ప్రారంభించేటప్పుడు ఆహ్వానించే బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంభీరంగా సర్‌ అల్లాడి ఎంత అట్టడుగు నుంచి ప్రారంభించి శిఖరాలు అధిరోహించారో వివరిస్తారు. ఎవరికైనా పైకిపోయే అవకాశం ఉందంటాడు. కాని సమాజం ఒక అల్లాడిని గుర్తించి పైకి తీసుకుపోయే లోపల, ఎంతో మంది అల్లాడిలు విఫలమై ఉంటారు. నిచ్చెనలు దొరకక నిస్సహాయులయిపోయి ఉంటారు.

న్యాయవాద వృత్తిలోని వాస్తవ జీవితానికీ, ఆ వృత్తి ఔన్నత్యం గురించిన గంభీర ప్రవచనాలకూ మధ్య అంతరం నేను న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన క్షణమే నాకు అర్థమైంది. జీవితంలో అనుసరించక తప్పని ఈ ద్వంద్వ ప్రవృత్తి వల్లనే న్యాయవాదులు కుహనా జీవితం జీవిస్తుంటారనుకుంటాను. అలాంటి ఆలోచనలతో 1953లో నేను న్యాయశాస్త్ర విద్య పూర్తిచేసి, 1954 నవంబర్‌ ‌చివరిలో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా చేరాను. అప్పటి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.వి.రాజమన్నార్‌ ‌నేతృత్వంలోని ఫస్ట్ ‌కోర్టులో నన్ను మా రాజప్ప న్యాయవాదిగా నమోదు చేయించాడు. ఇక్కడ మద్రాసు హైకోర్టు గురించి ఒక విషయం చెప్పాలి. మద్రాసు హైకోర్టు బ్రిటిష్‌ ‌చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం ఏర్పడిన హైకోర్టులలో ఒకటి. భారత రాజ్యాంగం రూపొందించిన ఐదు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా మద్రాసు హైకోర్టు బ్రిటిష్‌ ‌ప్రభుత్వ లెటర్స్ ‌పేటెంట్‌ ‌ప్రకారమే నడుస్తోంది. ఇవాళ్టికి కూడా చీఫ్‌ ‌జస్టిస్‌ అధికారాలకు మూలం 1919 భారత ప్రభుత్వ చట్టమే. అలా మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తిలో ప్రవేశించానో లేదో ఒక విషాదం సంభవించింది. 1955 జనవరి 31న నాగపూర్‌ ‌దగ్గర జరిగిన విమాన ప్రమాదంలో మా రాజప్ప మరణించాడు. అంతకుముందు రోజు సాయంకాలం మౌంట్‌ ‌రోడ్‌లోని డక్కన్‌ ఎయిర్‌వేస్‌ ‌కార్యాలయం దగ్గర నేనాయనను వదిలేశాను. మర్నాడు ఉదయమే ఆ విమాన సంస్థ కార్యాలయం నుంచి నాకు ఫోన్‌ ‌చేసి నాగపూర్‌ ‌దగ్గర గాలిలోకి ఎగురుతుండగా విమానం కూలిపోయిందని, ఒక్కరు కూడా బతకలేదని చెప్పారు. ఆజానుబాహుడుగా ఉండే మా రాజప్ప మృతదేహాన్ని ఐదున్నర అడుగుల శవపేటికలో తీసుకొచ్చారు. ఎఎస్‌కె అయ్యంగార్‌ ఆ ‌మృతదేహాన్ని గుర్తించి తీసుకొచ్చాడు.

రాజప్ప మృతితో న్యాయవాద వృత్తిలో నేను అనాథనయిపోయాను. అప్పటికి నేను వృత్తిలోకి ప్రవేశించి కొద్దికాలమే అయినందువల్ల రాజప్ప దగ్గర ఉన్న కేసు లన్నిటినీ నేను కొనసాగించలేకపోయాను. ఆయనకు అప్పగించిన కేసులను ఈ కొత్త కుర్ర న్యాయవాదికి అప్పగించడానికి కక్షిదారులకు నమ్మకం చాలలేదు. కనుక నేను ఒక్కొక్కటిగా ఆ కేసులను వదిలించుకోవడం, రాజప్ప అద్దెకు తీసుకున్న కార్యాలయాన్ని ఖాళీ చేయడం లాంటి పనుల్లో మునిగిపోయాను. చాలా తరచుగా కటిక పేదరికం అనుభవించాను. బీచ్‌ ‌రోడ్‌ ‌మీదుగా మైలాపూర్‌ ‌దాకా రోజూ నడిచి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. ఆ నడకలో ట్రిప్లికేన్‌ ‌దాకా ఒక స్నేహితుడు తోడు వచ్చేవాడు. అలా నడక సాగిస్తున్న రోజుల్లోనే మాకు ఒక వృద్ధుడు స్నేహితుడయ్యాడు. ఆయన న్యాయశాస్త్రం చదివానని, చదువుకునే రోజుల్లో ప్రతిభావంతుడైన విద్యార్థిగా ఉండేవాడినని, కాని న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకో లేకపోయానని చెప్పేవాడు. ఇప్పుడు బీచ్‌లోనే బతుకు సాగిస్తున్నాను గనుక ఇక ఇబ్బందేమీ లేదని అనేవాడు. ఆ ముసలాయన కూడా ట్రిప్లికేన్‌ ‌బీచ్‌ ‌దాకా మాతో వచ్చేవాడు. రోగిష్టి భార్యకు వైద్యం చేయించడానికి తన దగ్గర డబ్బులు లేవని, కొడుకును పెంచలేక మరెవరికో దత్తతకు ఇచ్చానని, కూతురిని సేవాసదన్‌లో చేర్చానని చెప్పేవాడు. ఒక ఉదయం వేళ అతని శవాన్ని బీచ్‌లో చూడకపోతే మేమా కథలు నమ్మి ఉండేవాళ్ళం కాదు.
-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply