Take a fresh look at your lifestyle.

ప్రారంభం-2

“ద్రవిడ కజగం ఉద్యమం ఆ తర్వాత ఏ రకంగా మారిపోయినా, దాని తొలిరోజులు ఉత్సాహభరితంగా ఉండేవి. అది ఎవరో ఒకరిద్దరు రెచ్చగొడితే ప్రారంభమైన ఉద్యమం కాదు. అది గొప్ప విశ్వాసాన్నీ, ఆశనూ ప్రేరేపించిన ఉద్యమం. నేను బ్రాహ్మణుడిగా పుట్టినప్పటికీ, ఆ కారణం వల్ల పచ్చయప్ప కాలేజిలో బి.ఎ.లో సీటు సంపాదించలేకపోయి నప్పటికీ, ఆ బ్రాహ్మణ వ్యతిరేక, ద్రవిడ ఉద్యమాన్ని తమిళ సమాజ అభ్యున్నతి కోసం సాగుతున్న ఉద్యమంగా గుర్తించాను. అది నిజంగా తమిళ జాతి పునరుజ్జీవన ఉద్యమం. బ్రాహ్మణేతర కులాల మధ్యతరగతి వ్యక్తులు అధికార స్థానాలకు రావడం ఆ ఉద్యమం లేకపోతే జరిగి ఉండేది కాదు.”

మరొక ప్రభావం పచ్చయప్ప కళాశాలలో, మద్రాసులో ఉండిన వాతావరణం. ఇంటర్మీడియట్‌ ‌పచ్చయప్ప కళాశాలలో పూర్తిచేసిన తర్వాత వివేకానంద కాలేజ్‌లో బిఎ (ఆనర్స్) ఎకనామిక్స్, ‌పాలిటిక్స్, ఇండస్ట్రియల్‌ ‌లేబర్‌ ‌ప్రాబ్లమ్స్ ‌ప్రధానాంశాలుగా చేశాను. ఆ నాలుగైదు సంవత్సరాలు మద్రాసు రాజకీయ వాతావరణం చాలా వేడిగా, వాడిగా ఉండేది. కాలేజిలో చదువుకోవలసినది ఎక్కువగా ఉండేది కాదు. విద్యార్థులకు కళాశాలలో వ్యక్తృత్వ పోటీలు తప్పనిసరిగా ఉండేవి. పచ్చయప్ప కాలేజిలో ద్రవిడ ఉద్యమం చాలా బలంగా ఉండేది. పెరియార్‌ ఇవిఆర్‌ ‌రామస్వామి నాయకర్‌ ‌ప్రభావం చాలా ఉండేది. కాలేజిలోనూ, బయట పట్టణంలోనూ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, ఆ భావాలు ప్రబలంగా ఉండేవి. భారత సమాజం ఒక బహుళ సమాజమని, దీన్ని ఏదో ఒక పరిమితిలో పెట్టడం అసాధ్యమని మొట్టమొదటి హెచ్చరిక ద్రవిడ కజగం ఉద్యమమే. అది భారత స్వాతంత్య్రం ఎదుర్కొన్న మొట్టమొదటి సవాల్‌.

‌మా పచ్చయప్ప కాలేజిలో తమిళ అధ్యాపకుడిగా ఉండిన అంబు అళగన్‌ ‌ద్రవిడ ఉద్యమ నాయకుడు. మా కాలేజి ద్రవిడ కజగం విద్యార్థి ఉద్యమ కేంద్రం. పెరియార్‌ ఉపన్యాసాలు ప్రజల్ని ఉర్రూతలూగిస్తుండేవి. ఆయన గొప్ప ప్రచారకుడు. ఆత్మగౌరవ ఉద్యమం, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల ప్రభావం వీధుల్లో కనబడుతుండేది. మద్రాసు వీధు ల్లోని బ్రాహ్మణ భోజన హోటళ్ళ ముందు, ‘బ్రాహ్మణ’ పదం తొలగించమని ప్రదర్శనలు జరుగుతుండేవి. బ్రాహ్మణ పదాన్ని తొలగించి శాకాహార అని చేరుస్తుండే వాళ్ళు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అది హాస్యాస్పదంగా, విషాదకరంగా అనిపిస్తుంది. ‘బ్రాహ్మణ’ నుంచి ‘శాకాహార’ కు మార్చడం కన్న తీవ్రమైన సమస్యలు లేవా అనిపిస్తుంది.

అప్పుడే జాతీయ సైన్స్ ‌కాంగ్రెస్‌ను ప్రారంభించడానికి నెహ్రూ మద్రాసు వచ్చాడు. ఆయనకు నిరసనగా పెద్దఎత్తున నల్లజెండాల ప్రదర్శన జరిగింది. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, హిందీ వ్యతిరేకతను కూడా వ్యక్తం చేసింది. స్టేషన్లలో హిందీ బోర్డుల మీద తారు పూసేవాళ్ళు. హిందీని జాతీయ భాషగా అంగీకరించబోమని తమిళ ప్రజలు ధిక్కార ప్రకటన చేశారు. హిందీ వ్యతిరేకత ఉత్తరాది నాయకుల పట్ల వ్యతిరేకత గా పరిణమించింది. సాధారణంగా ఓపెన్‌ ‌టాప్‌ ‌జీపులో తిరిగే నెహ్రూ మద్రాసులో ఆ అలవాటు మానుకున్నాడు. ద్రవిడ కజగం ఉద్యమం ఆ తర్వాత ఏ రకంగా మారిపోయినా, దాని తొలిరోజులు ఉత్సాహభరితంగా ఉండేవి. అది ఎవరో ఒకరిద్దరు రెచ్చగొడితే ప్రారంభమైన ఉద్యమం కాదు. అది గొప్ప విశ్వాసాన్నీ, ఆశనూ ప్రేరేపించిన ఉద్యమం. నేను బ్రాహ్మణుడిగా పుట్టినప్పటికీ, ఆ కారణం వల్ల పచ్చయప్ప కాలేజిలో బి.ఎ.లో సీటు సంపాదించలేకపోయి నప్పటికీ, ఆ బ్రాహ్మణ వ్యతిరేక, ద్రవిడ ఉద్యమాన్ని తమిళ సమాజ అభ్యున్నతి కోసం సాగుతున్న ఉద్యమంగా గుర్తించాను. అది నిజంగా తమిళ జాతి పునరుజ్జీవన ఉద్యమం. బ్రాహ్మణేతర కులాల మధ్యతరగతి వ్యక్తులు అధికార స్థానాలకు రావడం ఆ ఉద్యమం లేకపోతే జరిగి ఉండేది కాదు.

అది ఒక వెల్లువలా సాగిన ఉద్యమం. అప్పటికే చాల ప్రముఖుడైన కామరాజ్‌ ‌నాడార్‌ను అనామకుడైన ఒక న్యాయశాస్త్ర విద్యార్థి ఓడించగలిగాడంటే ఆ ఉద్యమ ప్రభావం తెలుసుకోవచ్చు. ఈ సామాజిక ఉద్యమాల, సాహిత్య అధ్యయనపు ప్రభావాలకు తోడు మా అన్న రాజప్ప ప్రభావం కూడా నా మీద బలంగానే పడిందనుకుంటాను. ఆయన న్యాయవాద వృత్తిలో పైకి ఎదగడం, నేను కూడ న్యాయశాస్త్రం చదివి ఆయనతో పాటే కలిసి పని చేయాలని ఆయన కోరుకోవడం కూడ నేనిట్లా మారడానికి పునాదిగా పనిచేసి ఉంటాయి. రాజప్ప చాల అననుకూలమైన పరిస్థితులలో న్యాయవాదిగా తనను తాను తీర్చిదిద్దు కున్నాడు. నేను న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకునే నాటికి ఆయనకు న్యాయవాదిగా మంచి పేరు వచ్చింది. ఆ రోజుల్లోనే నాలుగంకెల సంపాదనకు చేరాడాయన. అప్పుడు నాలుగంకెల సంపాదన సాధించడమంటే సంపన్నవర్గంలో చేరినట్టే. అప్పుడే ఆయన కారు కొనుక్కున్నాడు. సొంత గ్రంథాలయం నిర్మించుకోవడం మొదలుపెట్టాడు. ప్రతి న్యాయవాదీ ఈ రెండు విజయాలూ సాధించాలని కోరుకునేవాడారోజుల్లో. ఆస్తి లేకుండా, కుటుంబ నేపథ్యం లేకుండా న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన వాళ్ళెవరికైనా అవి రెండూ సాధించడానికి పదేళ్ళ కఠోర శ్రమ అవసరమయ్యేది.

నేను చదువుల్లో ఎప్పుడూ సగటు విద్యార్థిగానే ఉండేవాణ్ణి గనుక నేనేదో గొప్ప చదువులు చదువుతాననే ఆశ నాకెప్పుడూ లేదు. అర్థశాస్త్రంలో నేను ఎంఎ పూర్తి చేశాక పోటీ పరీక్షలకు హాజరయి ఐఎఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ ‌లాంటి సర్వీసులలోకి వెళ్ళడమో, బర్మాషెల్‌, ఎస్సో, కాల్టెక్స్ ‌వంటి ఆయిల్‌ ‌కంపెనీలలో చేరడమో లేదా న్యాయశాస్త్రం చదువుకుని న్యాయవాదిగా మారడమో అనే అవకాశాలే ఉన్నాయి. అయితే లా కాలేజిల్లో సీట్లు చాలా సులభంగా దొరికేవి గనుక అదొక్కటే వీలయిన పనిగా కనిపించింది. ఇటు న్యాయశాస్త్రం చదువుతూనే అటు పోటీ పరీక్షలు రాయొచ్చుననుకోండి, కానీ నేనాపని చేసి ఇంటర్వ్యూలో ఫెయిలయిపోయాను. వ్యక్తిత్వ పరీక్ష అనబడేదానిలో సున్న మార్కులు తెచ్చుకోవడం అనే అసాధారణమైన ప్రతిభ కనబరిచాను నేను. నా వ్యక్తిత్వాన్ని అంత కచ్చితమైన గణితశాస్త్ర ప్రమాణంతో కొలవడం నన్నిప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. అలా నేను న్యాయశాస్త్రంలో చేరి మా రాజప్పను సంతోషపెట్టాను.

నేను న్యాయశాస్త్రం చదివిన రెండు సంవత్సరాలూ నా విద్యార్థి జీవితంలోకెల్లా సుఖంగా గడిచాయి. చాలా తరచుగా మిత్రులకు కాఫీ టిఫిన్‌లు ఇప్పించగలుగుతుండే వాణ్ణి. పుస్తకాలు కొనుక్కోవడానికి, స్నేహితులతో సినిమాలకు వెళ్ళడానికి కూడా చేతిలో డబ్బులు ఆడుతుండేవి. న్యాయవాద వృత్తితో పాటు రాజప్పకు క్రికెట్‌ అన్నా, క్రికెట్‌ ‌రాజకీయాలన్నా చాలా ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో ఎ డివిజన్‌ ‌లీగ్‌ ‌టీమ్‌గా ప్రఖ్యాతిగాంచిన ట్రిప్లికేన్‌ ‌క్రికెట్‌ ‌క్లబ్‌లో ఆయన సభ్యుడుగా ఉండేవాడు. టెస్ట్ ‌క్రికెటర్లు ఎం.జె.గోపాలన్‌, ‌సి.ఆర్‌.‌రంగాచారి కూడ ఆ టీమ్‌లో ఆడేవారు. నా న్యాయశాస్త్ర విద్య అయిపోయే సమయానికి రాజప్ప ఈ క్రికెట్‌ ‌రాజకీయాలలో పైపైకి ఎదిగి భారత క్రికెట్‌ ‌కంట్రోల్‌ ‌బోర్డ్ ‌కార్యదర్శి అయ్యాడు. ఆ పదవిలో ఉండడ మంటే న్యాయవాద వృత్తిని వదిలేసి సాయంకాలాలన్నీ క్రికెట్‌ ‌బోర్డు పనుల్లో గడపడమో, ఎక్కువ రోజులు ప్రయాణాలు చేయడమో అవసరమయ్యేది. అప్పటికి ఆయన న్యాయవాద కార్యాలయంలో టి.అర్జునన్‌ అనే ఒకే ఒక్క జూనియర్‌ ఉండేవాడు గాని ఆయన పెద్దగా వాదనలు చేయగలిగేవడు కాదు. ఏదో ఒక రకంగా ఆఫీసును నిభాయించ గలిగేవాడు గాని, రాజప్ప దగ్గర గుమాస్తాగా ఉండిన మలయప్ప అయ్యర్‌ను అదుపులో పెట్టగలిగేవాడు కాదు.

Leave a Reply