Take a fresh look at your lifestyle.

ఇం‌కెన్నాళ్లు ఖాలీగా కళల సౌధాలు

ఇందిరమ్మ ఇళ్ల పేర అగ్గిపెట్టి లాంటి గూళ్ళు కాదు .. పేదలు ఆత్మగౌరవంతో నివసించేలా మా ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇస్తుంది. తాము నిర్మించిన ఇళ్లను చూసి యావత్‌ ‌దేశం అబ్బుర పడుతుందంటూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రకటించి ఏడేళ్లు గడిచింది. ఆయన ప్రకటించిన మేరకు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే, అనుకున్న స్థాయిలో కాకున్నా 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. గృహప్రవేశానికి సిద్దంగా ఉన్నాయి. కానీ, వాటిని లబ్ధిదారులకు కేటాయించే దిశగా ప్రభుత్వం మాత్రం అడుగులు వేయడం లేదు. దీంతో, వాటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారంతా, కళ్ళలో వత్తులేసుకున్నారు. ఎపుడెపుడు ఎంపిక చేసి అందిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఏదైనా కారణంతో వారం, పది రోజులు ఇంటికి తాళం వేసి వెళితేనే తిరిగి వచ్చాక శుభ్రం చేసుకునేందుకు రెండు, మూడు రోజులు పడుతుంది. ఇక ఏళ్ల తరబడి ఖాలీ గా ఉంచితే, శుభ్రం చేయడమే కాదు రంగులు వేసి ఆధునీకరించడం కూడా మరో సమస్యగా మారుతుంది. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో వెచ్చించి నిర్మించిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్లు రాష్ట్రంలో మూడు, నాలుగేళ్ళుగా ఖాలీ గానే ఉంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఇళ్లు అధ్వానంగా మారే ప్రమాదం ఉందని గృహ నిర్మాణ శాఖాధికారులు పేర్కొంటున్నా, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది.

వాస్తవానికి ఏడాది క్రితం లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు రూపొందించాలని గృహ నిర్మాణ , రెవెన్యూ విభాగాలను సర్కార్‌ ఆదేశించినా, పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ఇప్పటివరకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట గా మారింది. ఆశావహులు మాత్రం అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న కలల సౌధాలను ఎన్ని రోజులు ఖాలీ ఉంచుతారని అక్కడక్కడ అధికారిక సమావేశాల్లో నేతలను, యంత్రాంగంను ప్రశ్నిస్తున్నారు.

The arts mansions vacated for another year

రాష్ట్రంలో రూ.18 వేల కోట్ల అంచనా వ్యయంతో 2.91 లక్షల డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటి వరకు రూ.10,425 కోట్లు ఖర్చుకాగా, లక్షకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో ఆరు వేల ఇళ్ల పనులు తుది దశలో ఉన్నాయి. 6 వేలకు పైగా ఇళ్ల పనులు ఇప్పటికి ప్రారంభం కాలేదు. అయితే, పూర్తయిన ఇళ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించేందుకు ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. జీహెచ్‌ఎం‌సీలో 51 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభించడానికి సిద్ధంగా ఉండగా, ఇప్పటి వరకు 3880 మంది లబ్ధిదారులకు మాత్రమే కేటాయించారు.

రెండు పడక గదుల ఇళ్ల కోసం జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటిస్తుండగా, వీరిలో ఎక్కువ మంది గూడు లేని నిరుపేదలే. కొరోనా సంక్షోభ పరిస్థితుల్లో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులతో అద్దెలు చెల్లించలేక పేదలు సతమతమవుతుండగా, వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ఇళ్లను ఖాలీ గా ఉంచడం పట్ల ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్లకు జిల్లాల్లో రూ.55.7 లక్షలు ఖర్చు చేస్తుండగా, హైదరాబాదులో రూ.10 లక్షలు వెచ్చిస్తున్నారు. 2.91 లక్షల ఇళ్లకు రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చవుతాయని అంచనా వేశారు. అయితే, నిర్మాణాల్లో జాప్యం జరుగుతున్న కొద్దీ మౌలిక వసతులు, పెరిగిన స్టీల్‌, ఇతర ధరల నేపథ్యంలో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటి వరకు రూ.10,427 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చెబుతుండగా, ఇందులో పీఎంఏవై కింద మొదటి విడతలో కేంద్రం నుంచి రూ .1311 కోట్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం స్పందించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి జాబితా పంపితే, మిగతా నిధులు కూడా విడుదల చేసే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొంటుండగా, ప్రభుత్వం డబల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లపై దృష్టి సారించాలని ఆశావహులు కోరుతున్నారు.

– ఇ. సంజీవ రెడ్డి, కరీంనగర్‌.‌సెల్‌ : 9948639636

Leave a Reply