- బండి సంజయ్ అరెస్టు అత్యంత అప్రజాస్వామికం
- తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా ?
- జీఓ 317కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన కొనసాగుతుంది
- తెలంగాణలో ధర్మ యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళ్తాం..
- దేశంలో అత్యంత అవినీతి పరుడైన ముఖ్యమంత్రి కేసీఆర్
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రతినిధి: దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఓటమితో సీఎం కేసీఆర్‌కు మతి భ్రమించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైనసీఎం కేసీఆర్ అనీ, తెలంగాణలో ఆయన నియంతృత్వ,కుటుంబ పాలనకు త్వరలోనే ప్రజలు స్వస్తి పలుకుతారని పేర్కొన్నారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో తమ పార్టీ ధర్మయుద్ధం చేస్తున్నదనీ, ధర్మ యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళ్లి జాతీయ పార్టీగా కేసీఆర్ ముసుగు తీసివేస్తామని స్పష్టం చేశారు.బీజేపీ చేస్తున్న పోరాటంలో అంతిమ విజయం ధర్మానిదేననీ, అంతిమ నిర్ణయం వచ్చే వరకు దీనిని కొనసాగిస్తామనీ, హుజురాబాద్ ఫలితాన్ని టీఆర్ఎస్కు రాష్ట్రమంతా చూపిస్తామని పేర్కొన్నారు.జీఓ 317కు వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన శాంతియుతంగా దీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన అత్యంత అప్రజాస్వామికంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంజయ్ తన క్యాంపు కార్యాలయంలో రాత్రి సమయంలో దీక్షకు దిగితే గ్యాస్ కట్టర్లతో గ్రిల్స్ తొలగించి వాటర్ క్యానన్లు ప్రయోగించి అదుపులోకి తీసుకున్నారనీ విమర్శించారు. బండి సంయ్తో పాటు బీజేపీ కార్యకర్తలపై పోలీసులు అరెస్టుల పేరుతో దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో అత్యంత అవినీతి నియంతృత్వ పాలన కొనసాగుతోందనీ, సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు, మేనల్లుడు, కూతురు, సమీప బంధువులకు కీలక పదవులతో కుటుంబ పాలనకు త్వరలోనే అంతమవుతుందన్నారు.దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం కేసీఆర్ అనీ, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఆయన రూ.లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా తయారైందనీ, లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కేవలం సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌కు మాత్రమే నీరు అందుతుందని ఆరోపించారు.
వినాశకాలే..విపరీత బుద్ధి అనే విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అరాచకాలపై బీజేపీ ధర్మయుద్ధం కొనసాగుతుందనీ, దీనికి తాను నాంది పలికాననీ, రేపు మరొకరు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని చెప్పారు. కొరోనా పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదనీ, బీజేపీ పోరాటాన్ని అణచివేయడానికి ప్రభుత్వం కొరోనాను సాకుగా తీసుకుందని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందనీ, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల దెబ్బకు కేసీఆర్ మతితప్పి ఇష్టం వచ్చిన రీతిలో పాలన కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా జేపీ నడ్డా విరుచుకుపడ్డారు.