Take a fresh look at your lifestyle.

అన్నింటా విఫలమయ్యే ప్రైవేటీకరణ మంత్రం

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విధానాలనే తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ఎంపిక అయిన తర్వాత తొలి పత్రికాగోష్టిలో ప్రకటించారు. అప్పటికింకా ఆయన ప్రధాన మంత్రి పదవిని స్వీకరించలేదు. విదేశాంగ,ఆర్థిక విధానాల్లో వాజ్ పేయి విధానాలను కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాజ్ పేయి హయాంలో సంస్కరణలు అమలు జరిగాయి, సంస్కరణల అమలు కోసం ప్రత్యేక శాఖను డిజ్ఇన్వెస్ట్ మెంట్ పేరిట ఏర్పాటు చేశారు.అయితే, లాభాలతో పని చేస్తున్న సంస్థల జోలికి వెళ్ళలేదు.అందుకు ఉక్కుఫ్యాక్టరీయే ఉదాహరణ. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదన 2003లోనే వొచ్చింది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఆయన ఆ ప్రతిపాదనను మానుకున్నారు.అలాగే, బ్యాంకుల్లో బాగా పని చేస్తున్న వాటి జోలికి వెళ్ళలేదు. అలాగే, విదేశాంగ విధానానికి సంబంధించి వాజ్ పేయి పాకిస్తాన్ తో లాహోర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

అదే సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు.ఈ రెండింటినీ పాక్ గౌరవించలేదు.అది వేరే విషయం. మోడీ అధికారంలోకి రాగానే ఆనాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో అత్యంత సన్నిహితంగా మెలిగి , వ్యక్తిగత సంబంధాలను కూడ కొనసాగించారు . అయితే అంతలోనే పాక్ తో వైరానికి దిగారు. బ్యాంకింగ్ రంగానికి సంబందించి మోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు ఉద్యోగులు,అధికారులు భగ్గుమంటున్నారు. 15,16 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం రెండు బ్యాంకులనే ప్రైవేటీకరిస్తామని చెప్పి మరో రెండు బ్యాంకులను సిద్దం చేశారు. దీంతో ఉద్యోగ,అధికార సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన మొండి బకాయిలపై దృష్టిని కేంద్రీకరించకుండా వాటిని ప్రైవేటు సంస్థలకు అమ్ముకోవడం అంటే కొండనాలికకు మందు వేస్తే ఉన్న నాలిక పోయినట్టుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రైవేటీకరణను వ్యతిరేకించిన మాజీ గవర్నర్లు ఇప్పుడు ప్రైవేటీకరణను సమర్ధించడం శోచనీయం. ఎవరిని ఎక్కడ ఎలా ప్రసన్నం చేసుకోవాలో లేదా అనుకూలంగా మలుచుకోవాలో మోడీకి తెలుసు.అందుకే, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్లు ప్రైవేటీకరణను సమర్ధిస్తున్నారు. పదవుల్లో ఉన్నప్పుడు వారు బ్యాంకుల నష్టాల నివారణకు ప్రభుత్వానికి చేసిన సూచనల సంగతి మరిచిపోయినట్టున్నారు. మొండి బకాయిల గురించి ప్రస్తావన వొచ్చినప్పుడల్లా మోడీ ఇది యూపీఏ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వొచ్చిందని చెబుతూ ఉంటారు.ఆ మాట నిజమే కానీ, యూపీఏ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం కావడం వల్ల భాగస్వామ్య పక్షాల ఒత్తిడి ఎక్కువ ఉండేది.ఇప్పుడు కేంద్రంలో ఎన్ డిఏ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ఏకపక్ష ప్రభుత్వం కొనసాగుతోంది.అందులోనూ మోడీ నోటంట వొచ్చిన మాటే శిలాశాసంగా చలామణి అవుతోంది. మోడీకి రాజకీయ సంకల్పం లేకపోవడం వల్లనే మొండి బకాయిల జోలికి వెళ్ళడం లేదు.

- Advertisement -

భారీగా రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన వారంతా మోడీ చుట్టూ వారికి సన్నిహితులని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే చేస్తున్న ఆరోపణల్లో అసత్యం లేదు.కానీ, ఆయన ఆరోపణలనూ, ప్రకటనలనూ ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. .గతంలో ఎన్నికలు వొచ్చాయంటే కాంగ్రెస్ పార్టీ కోటాను కోట్ల రూపాయిలు ఖర్చు చేసేదని కమలనాథులు పదే పదే ఆరోపణలు చేసే వారు.ఇప్పుడు వారే ఆ పని చేస్తున్నారు. ఏ ఎన్నికలు వొచ్చినా బీజేపీ ఖర్చు చేస్తున్నంతగా మరే పార్టీ ఖర్చు చేయడం లేదని ఆ పార్టీతో దశాబ్దాల పాటు అనుబంధం కలిగి ఇటీవల తెంచుకున్న నాయకులే ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు వాజ్ పేయి కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పని చేసిన యశ్వంత్ సిన్హా మోడీ విధానాలతో విభేదించే బీజేపీకి రాజీనామా చేశారు. మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏక పక్షంగా ఉన్నాయని ఆయన పలు సందర్భాల్లో ఆరోపించారు. ఆయనను పార్టీలో పక్కన పెట్టడానికి వయసు మీరి పోవడమే కారణమని కుంటి సాకు చెప్పారు.

ఇప్పుడు తొంభై ఏళ్ళ వయసు కలిగిన మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను కేరళలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ది అని ప్రకటించారు.ఈ విషయాన్నే సిన్హాయే కాకుండా, సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి కమలనాథులు కోటాను కోట్ల రూపాయిలను ఎరవేయడాన్ని ఆయన బహిరంగంగానే తప్పు పట్టారు. చివరికి ఆయన శనివారం నాడు తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలను కూడా ఆయన తప్పు పట్టారు. అవన్నీ చూడలేకే తన వంతు సాయాన్ని అందించడానికి ఆ పార్టీలో చేరినట్టు ఆయన ప్రకటించారు.

మోడీ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటని బ్యాంకు ఉద్యోగ సంఘాల సమాఖ్య నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు ., మొండి బకాయిల సమస్యను పరిష్కరించడానికి ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని వాజ్ పేయి కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పని చేసిన యశ్వంత్ సిన్హా కూడా స్పష్టం చేశారు. మోడీ నిర్దిష్ట అజెండాతో పని చేస్తోందనీ, ప్రజ ల అజెండా కోసం కాదని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ మాజీ సీనియర్ నాయకుడు గళం ఎత్తడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు.

Leave a Reply