Take a fresh look at your lifestyle.

‌ప్రైవేటు దవాఖానాలకు వెళ్లి అప్పుల పాలవొద్దు

‌కొరోనా చికిత్సల కోసం ప్రైవేటు దవాఖానాలకు వెళ్లి అప్పుల పాలవొద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రజలకు సూచించారు. గతంలో కొరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయనీ, అయితే అప్పుడు ఇంతగా ప్రచారం లేని కారణంగా ప్రజల్లో భయం లేదనీ, ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లో భయం పోగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని పలు రెసిడెన్షియల్‌ ‌కాలనీల ప్రజలతో మంత్రి ఈటల సమావేశమయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రూ.లక్ష ఖర్చయ్యే వైద్యానికి ప్రైవేటు హాస్పిటల్స్ ‌రూ.30 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నాయనీ, ఈ సందర్భంలోనూ వ్యాపార ధోరణి సరికాదన్నారు. కొరోనా సోకిన వారిని వెలివేసినట్లు చూడటం సరికాదనీ, ప్రభుత్వం, ప్రజలు కలసి పనిచేస్తే సాధించలేనిది ఏమీ ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కొరోనా పాజిటివ్‌ ‌వచ్చిన వారు ఉండేందుకు కమ్యూనిటీ హాళ్లు, క్లబ్‌ ‌హౌజ్‌లు ఇస్తే ప్రభుత్వం వారికి మందులు, భోజనం అందజేస్తుందని చెప్పారు. పట్టణ పేదల ఇంటికే వైద్యం అందించేందుకు ప్రభుత్వం జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 200 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిందనీ, త్వరలోనే మరో 100 ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలతో కలిపి మొత్తంగా 145 చోట్ల కొరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే కొరోనా పరీక్షలు, చికిత్సల వివరాలు తెలిపేందుకు నోడల్‌ అధికారిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో మరణాల శాతంతో పోలిస్తే తెలంగాణలో అతి తక్కువగా ఉందనీ, కొరోనాపై పోరాటంలో రెసిడెన్షియల్‌,‌కాలసీ అసోసియేషన్‌ ‌ప్రతినిధులు మందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కొరోనా అనేక అనుభవాలను, బాధలను, అవమానాలను ఎదుర్కొనేలా చేసిందనీ, అయినా ప్రజలకు విశ్వాసం కల్పించి వారిని కాపాడుకోవడంలో ప్రభుత్వం విజయవంతంగా ముందుకు వెళుతున్నదని ఈ సందర్భంగా మంత్రి ఈటల స్పష్టం చేశారు.

Leave a Reply