Take a fresh look at your lifestyle.

‘మెజార్టీ’కే పెద్ద నష్టం..!

‘ఈశాన్య న్యూఢిల్లీలో జరిగిన మతఘర్షణల వల్ల అత్యధికంగా నష్టపోయింది మానవులు. ఈ మానవుల జాతి ఏంటి అని పరిశీలించే పని చేసినట్లైతే మానవత్వం తలదించుకునే పనిచేసింది ఏ జాతి అనేది తేలుతుంది. ఈ విషయం తేలకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్న విషయంలో అధికారపక్షం పూర్తి జాగ్రత్తలు తీసుకుంది.ఈ ప్రసారాల ద్వారా మెజారిటీ ప్రజల ముందుకు మెజారిటీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అన్న చందాన మెసేజ్‌ ‌పోయింది. ఈ విధమైన పరిస్థితులు ఉండటం వలన ప్రస్తుతం ఢిల్లీకి మాత్రమే నష్టం జరగటం లేదు. మానవత్వం అనే విషయంలో మెజారిటీ ప్రజలు మృగాలు అయిపోతున్నారు.. అన్న నింద మోయాల్సిన పరిస్థితి మెజారిటీ ప్రజల పైకి వస్తుంది. వాస్తవంగా ఇది మెజారిటీ ప్రజలకు జరిగే అతి పెద్ద నష్టం.’

Aruna
Article By అరుణ, జర్నలిస్ట్, ‌న్యూఢిల్లీ

మత ఘర్షణలు జరిగేట ప్పుడు రిపోర్టు చేయడానికి వాడే పదాలు ఇలా ఉంటాయి. ‘అల్లర్లు’.. ఇంగ్లీషులో ‘రాయిట్స్’ అం‌టారు. తక్కువ హింస జరిగినప్పుడు ఈ పదాన్ని వాడతారు. హింస మోతాదు మించినప్పుడు ‘మతహింస’ పదం వాడతాం. ఇంగ్లీషులో ‘కమ్యూనల్‌ ‌వైలెన్స్’ అం‌టారు. హింస పతాకస్థాయికి చేరినపుడు, హింసకు పాల్పడటం జరిగింది అంటారు. ఇంగ్లీషులో ‘పొగ్‌రోమ్‌’ అనే పదం వాడతారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత హింస గురించి రిపోర్టు చేయాలనుకున్న జర్నలిస్టు వాడాల్సిన పదం చివరి పదం పొగ్‌రోమ్‌.. ఈశాన్య ఢిల్లీలో ‘‘హింసకు పాల్పడటం జరిగింది..’’ ఈ హింస జరిపించడానికి ముందు మూడు నెలలు ఈ హింసకు కావలసిన ద్వేషాన్ని పెంచి పోషించడం జరిగింది. దాని పర్యవసానమే ఈశాన్య ఢిల్లీలో జరిగిన విధ్వంసం. ముందుగా మనం గమనించాల్సింది ఏమిటంటే, దేశ రాజధానిలో హింసకు పాల్పడటానికి ఈశాన్య ఢిల్లీనే ఎందుకు ఎంచుకున్నారు..? ఈశాన్య ఢిల్లీలో ఎవరు ఉంటారు..? ఈశాన్య ఢిల్లీ హింసకు పాల్పడటం కోసం అనుకూలమైన ప్రాంతం ఎలా అయ్యింది ఈ అంశాలను గమనించాల్సి ఉంటుంది.•ఈశాన్య ఢిల్లీలో ఎక్కడైతే ముస్లిమ్స్ అధికంగా ఉన్నారో, ఆ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని హింసకు పాల్పడటం జరిగింది. చాంద్‌ ‌బాగ్‌, ‌గోకుల్‌ ‌పూరి, భజనపురా ప్రాంతాలలో •ముస్లిం జనాభా ఎక్కువ. గోకుల్‌పూరీలో ఉన్న టైర్‌ ‌మార్కెట్‌ ‌మొత్తం అగ్నికి ఆహుతి చేసి ఆర్థికంగా ముస్లింలను దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసి విజయం సాధించారు. ఇక చాంద్‌ ‌బాఘ్‌, ‌భజన్‌ ‌పురా విషయానికి వస్తే అక్కడ ప్రతి ఇల్లు కూడా ఒక గృహ ఫ్యాక్టరీ నడుపుతుంది. ఇక్కడ రెడీమేడ్‌ ‌బట్టల తయారీ, ప్రతి నివాసంలో హోం బేస్డ్ ‌కొనసాగుతున్నది. ఈ ప్రాంతంలో కనీసం ఇళ్లలో నడిచే ఫ్యాక్టరీలు ఏడువందలు కొనసాగుతున్నాయి.

ఈ ఫ్యాక్టరీల ఓనర్లు అధికంగా ముస్లింలే. ఒక్కో ఇంటిలో నడిచే ఫ్యాక్టరీలో సుమారు నలభై నుంచి యాభై మంది వర్కర్లు పని చేస్తూ ఉంటారు. ఈ వర్కర్లు చేసే పని వస్త్రాలు కట్‌ ‌చేయడం, కట్‌ ‌చేసిన వస్త్రాలను రెడీమేడ్‌ ‌డ్రెస్సులుగా •కుట్టడం, బటన్లు కుట్టడం, ఆనక బట్టలు వాషింగ్‌ ‌చేసి వాటిని ప్యాకింగ్‌ ‌చేసి మార్కెట్‌ ‌కి పంపించడం. ఈ ప్రాంతంలో ఓ పెద్ద రెడీమేడ్‌ ‌బట్టల మార్కెట్‌ ఉం‌ది. ఇక్కడి నుంచి ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు రెడీమేడ్‌ ‌బట్టలు పోతూ ఉంటాయి. ఇటువంటి మార్కెట్‌ ఉం‌డటం వలన ఎక్కువ మంది ముస్లిం కార్మికులకు ఇక్కడ పని దొరుకుతున్నది. అంచేత ఎక్కువ మంది ముస్లింలు అక్కడ నివాసం ఉంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టి ఈ ప్రాంతం హింసకు పాల్పడటానికి అనువైనదని ఎంచుకోవడం జరిగింది. •ఈశాన్య ఢిల్లీ బట్టల వ్యాపారం, టైర్ల వ్యాపారం, స్పేర్‌ ‌పార్టస్ ‌వ్యాపారాలకు మాత్రమే ప్రసిద్ధికెక్కిన ప్రాంతం కాదు. ఇక్కడ కొంతమంది దగ్గర చేతినిండా పని, ఆదాయం ఉంటే, కొంతమంది దగ్గర పని, ఆదాయంలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. దీని కారణంగా •ప్రాంతంలో క్రైమ్‌ ‌కూడా చాలా ఎక్కువ. ఢిల్లీలో మిగతా ప్రాంతాలతో పోల్చిచూస్తే ఈశాన్య ఢిల్లీలో నేర ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నాసిర్‌ ‌గ్యాంగ్‌, ‌చేను గ్యాంగ్‌ అనే రెండు క్రిమినల్‌ ‌గ్యాంగ్స్ ‌కూడా ఉన్నాయి. పనీపాటా లేని యువత ఈ గ్యాంగుల చుట్టూ తిరుగుతూ హఫ్తా వసూల్‌ ‌వంటివి చేస్తుంటాయి.

ఈ ప్రాంతంలో •నేరం చేసేందుకు ఆయుధాలు కూడా అధికంగా వాడతారని తెలుస్తున్నది. ఇటువంటి ప్రాంతంలో ఉన్న ముస్లిం యువతలో మమ్మల్ని దేశంనుంచి వెల్లగొట్టేందుకు ప్రభుత్వం సీఏఏ చట్టం తీసుకు వచ్చిందన్న అభిప్రాయం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు షాహీన్‌బాగ్‌ని చూసి, ఆ ప్రేరణతో అక్కడ ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే.. ధర్నా కార్యక్రమంను క్రాస్‌ ‌చేసుకుంటూ పోయే నెపంతో కొంత మంది రైట్‌ ‌వింగ్‌ ‌యువత రోజు బైక్‌ ‌మీద వస్తూ పోతూ ‘‘హిందువులతో పెట్టుకున్నారు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమి తరిమి కొడతాం’’ అని కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. ఇలా కొంతకాలంగా అక్కడ ఈ కవ్వింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులకు ఎంతగా కంప్లైంట్‌ ‌చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదు. పైగా మిమ్మల్ని కాపాడేందుకు మాకు ఆర్డర్స్ ‌లేవు అని చెబుతూ మీకు మీరే కొంత జాగ్రత్తగా మసలుకోవాలి అని ముస్లింలకు నచ్చజెప్పే ప్రయత్నం పోలీస్‌ ‌చేసింది.ఈ కవ్వింపు చర్యలు చిలికి చిలికి గాలివాన అవుతున్న పరిస్థితి ఈశాన్య ఢిల్లీలో నెలకొని ఉన్న తరుణంలో ఆదివారం మౌజ్‌ ‌పురా రోడ్డులో పౌర సవరణ చట్టానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న మహిళలు క్యాండిల్‌ ‌లైట్‌ ‌మర్చ్‌కు ప్లాన్‌ ‌చేసుకుంటూ ఆ రోడ్డుపై సమీకృతం కాసాగారు. పరిస్థితి గమనించిన బీజేపీ నాయకుడు కపిల్‌మిశ్రా తన మద్దతు దారులను కూడగట్టుకుని ఆదివారం మధ్యాహ్నం డిసిపి ఎదురుగా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉన్నాడు కాబట్టి మేము శాంతంగా ఉన్నా ట్రంప్‌ ‌వెళ్లిపోగానే మేము మీ మాట వినం, ఇక్కడ జరుగుతున్న నిరసన ప్రదర్శన లన్నిటిని ఎత్తి వేస్తాం. రోడ్లన్నీ ఖాళీ చేయిస్తాం’ అని ప్రకటించారు. ఒక పోలీస్‌ అధికారికి హెచ్చరిక చేస్తున్నట్లు కపిల్‌మిశ్రా ప్రసంగించడంతో ఆయన మద్దతుదారులలో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. తత్ఫలితంగా అదే రోజు హింసకు పాల్పడటం అనే పని జరిగిపోయింది.•బుధవారం మధ్యాహ్నం వరకూ హింస తాండవం చేసింది. బుధవారం మధ్యాహ్నానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అజిత్‌ ‌దోబల్‌ ‌కు బాధ్యత ఇవ్వటంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. అయితే అజిత్‌ ‌దోవల్‌ ‌రంగంలోకి దిగడంతో ‘‘అయిందేదో అయింది ఇక శాంతిగా ఉండండి’’ అని ముస్లింలకు •చెప్పటంతో తన పని మొదలు పెట్టారు. వాస్తవానికి అక్కడ జరిగిన హింసకు దోషులను పట్టుకోవాలసిన పనిచేయాల్సి ఉంది. అజిత్‌ ‌దోవల్‌ ఆ ‌పని చేయటం కంటే ముస్లింలకు నచ్చజెప్పే పని ఎక్కువ చేస్తున్నారు. దీనివలన రానున్న కాలంలో పరిస్థితి మరింత అధ్వాన్నం అయ్యే అవకాశాలే ఎక్కువ.•ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసలో అత్యంత ఎక్కువగా నష్టపోయింది మైనారిటీలు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ ‌చేసుకోవడానికి హాస్పిటల్లో ఉన్న మార్చురీ గదులు చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం హిందూ పరిరక్షక ప్రభుత్వం కేంద్రంలో ఉన్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్న అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌కూడా మైనారిటీలను దగ్గర తీసుకుంటే ఎక్కడ నష్టపోతాయనో అని భయపడుతూ ఉన్నారు. అందుకే ఈశాన్య ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరుగుతూ ఉంటే కేజ్రీవాల్‌ ఈశాన్య ఢిల్లీ పర్యటనకు రాకుండా రాజ్‌ ‌ఘాట్‌ ‌కి పోయి గాంధీ సమాధికి నివాళి ఇచ్చారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు తాహిర్‌ ‌హుస్సేన్‌ ‌తన నివాసం చుట్టూ ఉద్రిక్త వాతావరణం పెరుగుతున్న కొలదీ, తమకు సహాయం కావాలని పోలీసులకు ఫోన్‌ ‌చేస్తూనే ఉన్నారు.తాహిర్‌ ‌హుస్సేన్‌ ‌కు సహాయం అందించటానికి చాలా కాలయాపన చేసిన తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన వెంటనే తన ఫ్యాక్టరీ తాళం చెవులు వారికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాహిర్‌ ‌హుస్సేన్‌ ‌ఫ్యాక్టరీ నుంచి రాళ్ల వర్షం జరిగింది, అని వస్తున్న ఆరోపణలపై పోలీస్‌ ‌కూడా స్పందించాల్సి ఉంది. దీనిపైన పోలీసులు మాట్లాడక మునుపే కేజ్రీవాల్‌ ‌తాహిర్‌ ‌హుస్సేన్‌ ‌పార్టీ సభ్యత్వం రద్దు చేశారు. ఈ విధంగా చేయడం ద్వారా తాను హిందూ బంధువునని చెప్పే ప్రయత్నం కేజ్రీవాల్‌ ‌చేస్తున్నారు. ఇలా ప్రయత్నించటం ద్వారా అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌బీజేపీకి పరోక్షంగా సహాయం చేశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీ బీజేపీకి ఈ విధంగా సహాయం చేస్తూ ఉంటే.. అనుకూల మీడియా కూడా బీజేపీకి కొమ్ము కాస్తూ చక్కగా తన సహాయ సహకారాలు అందిస్తున్నది.•మత ఘర్షణలు ఎక్కడ జరిగినా నష్టపోయేది సామాన్యులే.. అందులో ఎటువంటి అనుమానం లేదు. మత ఘర్షణలు జరిగే టప్పుడు దానికి సంబంధించిన సమాచారం అందిం చేటప్పుడు పాటించవలసిన మానవత్వాన్ని కాపాడే నియమా లు మనం పాటిస్తున్నామా లేదా అన్నది అతి ముఖ్యమైన అంశం.ఈశాన్య న్యూఢిల్లీలో జరిగిన మతఘర్షణల వల్ల అత్యధికంగా నష్టపోయింది మానవులు. ఈ మానవుల జాతి ఏంటి అని పరిశీలించే పని చేసినట్లైతే మానవత్వం తలదించుకునే పనిచేసింది ఏ జాతి అనేది తేలుతుంది. ఈ విషయం తేలకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్న విషయంలో అధికారపక్షం పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. ఈ జాగ్రత్తల పర్యవసానమే మీడియాలో తొలిగా ప్రసారం అయిన కార్యక్రమాలు. ఐబీలో పని చేస్తున్న అంకిత్‌ ‌శర్మ తల్లిదండ్రుల ఇంటర్వ్యూ. ఈ ఇంట ర్వ్యూ తరవాత పాలు కొనడానికి పోయి ఉన్మాదుల చేతిలో హతం అయిన రాహుల్‌ ‌సోలంకి తల్లిదండ్రుల ఇంటర్వ్యూ ప్రసారమైంది. దీని తరవాత కమల్‌ ‌శర్మ ఇంటర్వ్యూ ప్రసారం అయ్యింది.. ఈ ప్రసారాల ద్వారా మెజారిటీ ప్రజల ముందుకు మెజారిటీ ప్రజలకు అన్యాయం జరుగు తుంది అన్న చందాన మెసేజ్‌ ‌పోయింది. ఈ విధమైన పరిస్థితులు ఉండటం వలన ప్రస్తుతం ఢిల్లీకి మాత్రమే నష్టం జరగటం లేదు. మానవత్వం అనే విషయంలో మెజారిటీ ప్రజలు మృగాలు అయిపోతున్నారు.. అన్న నింద మోయాల్సిన పరిస్థితి మెజారిటీ ప్రజల పైకి వస్తుంది. వాస్తవంగా ఇది మెజారిటీ ప్రజలకు జరిగే అతి పెద్ద నష్టం.

Aruna
అరుణ,జర్నలిస్ట్, ‌న్యూఢిల్లీ

Leave a Reply