Take a fresh look at your lifestyle.

అదో గమ్మత్తయిన మత్తులో తెలంగాణ కాంగ్రెస్‌!

“రాష్ట్ర రైతులలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపట్ల వైఖరిని సొమ్ము చేసుకునే పరిస్థితులు తెలంగాణ కాంగ్రెస్‌ ‌లో లేవన్న ధీమా ను తెరాస-భాజపా ప్రదర్శిస్తున్నాయి. వాస్తవాన్ని గమనించి రైతు సమస్యను పావుగా ఉపయోగించుకుంటే రైతుల మద్దతు తప్పకుండా తెలంగాణ కాంగ్రెస్‌ ‌కు వెయ్యేనుగుల బలమవుతుంది.”

ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెదొక దారి అని ఊరకే అనలేదు. ప్రపంచం మొత్తం మెలకువతో ఉన్నప్పుడు నిద్రపోయేవారు ఎప్పుడూ ప్రత్యేకం. వారిదదో గమ్మతైన మత్తు. మత్తు వదలకపోతే ఆ భగవంతుడు కూడా నిస్సహాయుడే. లాక్షాగృహ దహనం వేళ కాపలా కాస్తున్న భీముడు ఆదమరచి నిద్రిస్తుంటే స్వయానా కృష్ణుడే వచ్చి మత్తువదలరా.. అంటూ పాడాడని సినిమాలో ఎప్పుడో చూపారు. చెప్పడమే మన ధర్మం. వినకపోతే వారి ఖర్మమే..

ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పరిస్థితి అలాగే ఉందంటున్నారు రాజకీయ నాడీ వైద్యులు. మోదీ ప్రభుత్వం చీకట్లో రైతుల నెత్తిన రుద్దిన మూడు వ్యవసాయ చట్టాలను అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో దేశం మొత్తం నిరసన గళం ప్రతిధ్వనింప చేస్తుంటే, మరో ముందడుగు వేసి పంటల సేకరణ కేంద్రాలను కూడా మూతేసి తెలంగాణలో కె సి ఆర్‌ ‌ప్రభుత్వం రాష్ట్రంలో అనేక విధాల నష్టపోతున్న రైతులపై అదనంగా పిడుగులు కురిపించి నష్టపరుస్తున్నా కాంగ్రెస్‌ ఎం‌దుకో పెదవి విప్పి ధైర్యం ప్రదర్శించకుండా, నిమ్మకు నీరెత్తినట్లు .. అంతర్గత ముఠా మత్తులో మునిగిపోయినట్లుంది.

తెలంగాణలో రాజకీయ బలం సన్నగిల్లిన ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు సైతం రైతు సమస్యలను ఆసరాగా తీసుకుని, రైతులోకానికి అండగా నిలిచి బిజెపి వ్యతిరేకతను ప్రదర్శించేందుకు ముందడుగు వేసి పరిస్థితిని మెరుగుపరచుకునే ప్రయత్నంలో ఉండగా, కిసాన్‌ ‌పంచాయతీ ఆందోళన చేపట్టి అవకాశం అందిపుచ్చుకుని రైతుకు వెన్నుదన్నుగా నిలవడంలో విఫలమై అంతర్గత ముఠా పంచాయతీ గొడవల్లో కాంగ్రెస్‌ ‌మునిగిపోయిందనిపిస్తోంది. కేంద్రం వ్యవసాయ చట్టాల నిర్ణయం క్షేత్ర స్థాయిలో అమలుపరచడానికి సమయం ఉన్నందున రైతు సమస్యలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నం కాలేదని, ఇప్పటి పరిస్థితివల్ల అటు తెరాసా – భాజపాలకు తక్షణ నష్టం లేదని, అందువల్ల ఇప్పుడు ఏ ఉద్యమం చేపట్టినా తొందరపాటు చర్య అయి కాంగ్రెస్‌ ‌వనరులు వృధా అవుతాయని తెలంగాణా కాంగ్రెస్‌ ‌నేతలు భావిస్తున్నట్లున్నారు.

క్షేత్ర స్థాయిలో రైతుల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలపడని సమయంలో ఉద్యమించినా అటు భాజపాకు, గాని ఇటు తెరాసా కు కాని తక్షన నష్టం జరగదని భావిస్తూ నేతలు గాంధి భవన్‌ ‌కు పరిమితమై విలేఖరులతో చాయ్‌- ‌బిస్కట్‌ ‌ల ముచ్చట్లలో సరిపుచ్చుకుంటున్నారనిపిస్తోంది. వాస్తవానికి వస్తే.. భాజప – తెరాస మధ్య పెరుగుతున్న అఘాతాన్ని గమనంలోకి తీసుకుని రైతుసమస్యలను భుజాన వేసుకుని, ఎన్నికల తరుణానికి రైతులను కూడగట్టి వారికి వెన్నుదన్నుగా నిలిచి సమైక్య శక్తిగా రూపొందించకుంటే నష్టపోయేది తామేనని కాంగ్రెస్‌ ‌నాయకులు గుర్తించడం లేదు. రాష్ట్ర రైతులలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపట్ల వైఖరిని సొమ్ము చేసుకునే పరిస్థితులు తెలంగాణ కాంగ్రెస్‌ ‌లో లేవన్న ధీమా ను తెరాస-భాజపా ప్రదర్శిస్తున్నాయి. వాస్తవాన్ని గమనించి రైతు సమస్యను పావుగా ఉపయోగించుకుంటే రైతుల మద్దతు తప్పకుండా తెలంగాణ కాంగ్రెస్‌ ‌కు వెయ్యేనుగుల బలమవుతుంది.

పంట సేకరణ కేంద్రాలు మూతపడే సమయానికైనా కాంగ్రెస్‌ ‌రైతులను కూడ గట్టి ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దగలిగితే 2018 ఎన్నికలప్పుడు కె సి ఆర్‌ ‌ను బలపరచిన రైతులందరూ ప్రస్తుత తరుణంలో ఆయనకు దూరం కావడమే కాక, గ్రామీణ ప్రాంతాలలో భాజపా బలం పెరగకుండా నివారించడంలో విజయం సాధించ గలుగుతారు. ఇటీవల తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలను, తదనంతరం మేయర్‌ ‌స్థానం దక్కించుకునేందుకు పడ్డ కష్టం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే గతం కంటే ఇప్పుడు కె సి ఆర్‌ ఎం‌త ప్రజా వ్యతిరేకత అనుభవిస్తూ బలహీన పడ్డారో తెలుస్తుంది.

- Advertisement -

2014 ఎన్నికలలో అఖండ విజయం సాధించిన నుంచీ క్రమేపీ మారుతున్న పరిస్థితుల్లో కె సి ఆర్‌ అనేక విషయాల్లో ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటూ, అనేక విషయాల్లో యు టర్న్ ‌తీసుకుంటూ పదవిని పరిరక్షించుకునేందుకు కేంద్రంతో ఒక కచ్చితమైన అవగాహనకు వచ్చిన విషయం తేట తెల్లమవుతుంది. తన స్థానం పదిల పరుచుకుంటూ కె సి ఆర్‌ ‌కేంద్రంలో బి జె పి తో అంటకాగుతూ, ఆ పార్టీ ప్రయోజానాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని విపక్షాలు తరచూ విలేఖరుల సమావేశాలకు పరిమితమై ఆరోపణలు, విమర్శలు చేయడం తప్ప కార్యాచరణ మార్గం అవలంబించనందున 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగలమని కాంగ్రెస్‌ ‌కన్న కలలు కల్లలుగా మిగిలిపోయాయని ఇప్పటికీ గుర్తించినట్లు లేదు.

అసలు రాష్ట్ర విభజనకు అవలంబించిన అసంబద్ధ విధానం, అనుచిత ఎత్తుగడల కారణంగానే రాష్ట్రం కాంగ్రెస్‌ ‌చేతుల్లో నుంచీ జారిపోయిందన్న వాస్తవాన్ని ఇప్పటికీ గుర్తించకపోవడం మరొక తప్పిదం. ఇప్పటికీ కె సి ఆర్‌ ఎత్తుగడలకు దీటుగా కాంగ్రెస్‌ ‌లో వ్యూహరచన లేకపోవడం, గాంధీ భవన్‌ ‌కే పరిమితమై రాసిచ్చిన కాగితాలను వల్లె వేయడం మినహా క్షేరస్థాయిలో కె సి ఆర్‌ ‌పట్ల ఉన్న వ్యతిరేకతను సమర్ధంగా ఉపయోగించుకోలేకపోవడం, నాయకులు పార్టీని జన బాహుళ్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు లేకపోవడమే స్తబ్దు వాతావరణానికి కారణమని అంటున్నారు.

కేసీఅర్‌ ‌పట్ల అయిష్టతను, బిజెపి పట్ల రాష్ట్రంలో వ్యతిరేకతను వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే శక్తి యుక్తులు ఆచరణలో పెట్టకుండా కాంగ్రెస్‌ ఇప్పటికీ మత్తులో జోగుతునే ఉంటే..వచ్చే ఎన్నికల్లో కూడా ఘోరంగా విఫలమవడం ఖాయమన్న భావన ప్రజల్లో కలుగుతున్నది. కెసీఅర్‌ ‌నిరంకుశత్వాన్ని ఎదిరించేందుకు, మత్తు వీడని కాంగ్రెస్‌ ‌పార్టీ కంటే బిజెపి మతోన్మాదానికి ప్రజలు మద్దతు నివ్వాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్‌ ‌మత్తు వీడకపోతే భవిష్యత్తు ఊహించడం బాధగా ఉంటుంది.

రాష్ట్ర విభజనకు పూర్వం కాంగ్రెస్‌ ‌పట్ల ఒటరు ఎలాంటి తీర్పు ఇచ్చాడో, ఇప్పుడుకూడా రాజకీయపరినతి లేని కాంగ్రెస్పట్ల అదే మాదిరి వ్యవహరిస్తాడా, తమను మోసగించిన కెసీఅర్‌ ‌కు గుణపాఠం చేబుతాడా.. ఈ రెంటికంటే భాజాపా నే నయమని నిర్ధారించుకుని ఎన్నుకుంటాడా.. అనే విషయం అందరి మనసుల్లో మెదలుతున్నది. కె సీఅర్‌ ‌వ్యవహరించిన తీరుతో మోసపోయామని భావించి తెలంగాణ ఓటర్లు మోదీ హిందుత్వ మార్క్ ‌రాజకీయాలపట్లనే మొగ్గు చూపే అలోచనలో పడితే తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తన గొయ్యి తానే తవ్వుకున్నట్లవుతుంది. తెలంగాణ ను కాష్యాయ రాష్ట్రంగా మార్చడంలో భాజపా విజయం సాధిస్తే అందుకు పూర్తి బాధ్యత కెసీఅర్‌ – ‌కాంగ్రెస్‌ ‌లదే. తెలంగాణ కాంగ్రెస్‌ ‌మత్తు వదలించేందుకు ఆఏ శ్రీకృష్ణుడు వచ్చి మత్తువదలరా.. అని పాట పాడతాడో వేచి చూడాలి.

-శామ్ సుందర్

Leave a Reply