Take a fresh look at your lifestyle.

ఆ చూపుడువేలు దేశానికే స్ఫూర్తిదాయకం

‘‘‌భారత రాజ్యాంగ నిర్మాత,ప్రపంచ మేధావి డాక్టర్‌ ‌బి.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌జయంతి సందర్భంగా… ప్రత్యేకం… భావి భారత స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్‌ ఆశయాల సాధనకు, ఆలోచన విధానానికి అనుగుణంగా దేశంలో పరిపాలన అందిస్తున్నా ఏకైక రాష్ట్రం కేసీఆర్‌ ‌నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యేలా బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ వాటి అమలు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నా కేసీఆర్‌ ‌దార్శనికతను విమర్శకులు సైతం అభినందించాల్సిందే…’’

ఒక గొప్ప సంకల్పానికి ఎదురయ్యే అడ్డంకులెన్నో… వాటిని అధిగమించి ఆ సంకల్పం సిద్దించే వరకు విరామమెరుగని సంకల్పసాధకుడు, కృషీవలుడు కేసీఆర్‌. ‘అవహేళన చేసిన నోర్లు అభినందించేలా- అడ్డుకోవాలనుకున్న వారే అబ్బురపడేలా’ నేడు చరిత్రాత్మక దృశ్యం అవిష్కృతం కాబోతుంది. అణగారిన వర్గాల ఆర్థిక సామాజిక సాధికారత కోసం తన తుది శ్వాస వరకు పోరాటం చేసిన, తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి మార్గం సుగమం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత,ప్రపంచ మేధావి డాక్టర్‌ ‌బి.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌జయంతి సందర్భంగా భావి తరాలకు దిశా నిర్ధేశం చేసేలా, ఆ మహనీయుని ఆశయాలు అనునిత్యం స్ఫురించేలా డా.బి.ఆర్‌.అం‌బేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్‌ ‌నడిబొడ్డున నూతన సచివాలయానికి అత్యంత సమీపాన ఏర్పాటు చెయ్యడం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భం. ఒక చూపుడు వేలు ఈ దేశ భవిష్యత్‌ ‌నినిర్ధేశించింది, అంబేద్కర్‌ ‌చూపిన మార్గం అనుసరణీయం ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాలలో అమలు అవుతున్నా అనేక సంక్షేమ పథకాలకు ఆయువు పోసింది ఆయన ఆలోచనలే అంటే  ఏ మాత్రం సందేహం లేదు. ప్రస్తుతం దళిత సాధికారత కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నా దళిత బంధు పథకానికి స్ఫూర్తి ఆ మహనీయుని ఆశయాలే. భావి భారత స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్‌ ఆశయాల సాధనకు, ఆలోచన విధానానికి అనుగుణంగా దేశంలో పరిపాలన అందిస్తున్నా ఏకైక రాష్ట్రం కేసీఆర్‌ ‌నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యేలా బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ వాటి అమలు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నా కేసీఆర్‌ ‌దార్శనికతను విమర్శకులు సైతం అభినందించాల్సిందే…

అంబేద్కర్‌ అం‌టే అన్ని రాజకీయ పక్షాలకు ఎన్నిక వేళ అవసరమయ్యే నినాదం. కానీ ఆయన అందరివాడనీ, ఆయన మన భవిష్యత్తు అని గుర్తెరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. వాస్తవానికి అంబేద్కర్‌ ఆలోచన రూపానికి ప్రతిరూపంగా తెలంగాణలో దళిత, బహుజనుల అభివృద్ది జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని అనేక ఘట్టాలను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాజ్యాంగా నిపుణుడు, న్యాయకోవిదుడైన అంబేద్కర్‌ ‌గురించి జోకిం అల్వా తన గ్రంథమైన ‘మెన్‌ అం‌డ్‌ ‌సూపర్‌ ‌మెన్‌’’ ‌లో   ఈ విధంగా వర్ణిస్తారు ‘‘అంబేడ్కర్‌ ‌పండితుడు, నిండైన విగ్రహంతో అందుకు తగిన నిశితమైన బుద్దితో ఆయన ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ చోటైనా చొచ్చుకుపోగలరు.  దళితుల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారబోసిన ధీరుడాయన, వర్ణ,వర్గ వివక్ష, పరపీడన నిర్మూలనకై అవిరళ పోరాటం సాగించిన యోధుడు. అమెరికాలో నల్లవారి కోసం విద్యాలయాలను ఏర్పాటు చేసి, వారి ప్రగతికి పాటుపడిన నల్లజాతి వజ్రం బుకర్‌ ‌టి. వాషింగ్టన్‌ ‌జీవితం అంబేద్కర్‌ ‌కు ఎంతో ప్రేరణ కలిగించింది. పాఠశాలలో ప్రవేశం కోసం తెల్లవారి చర్చి కుర్చీలను తుడిచిన ఆయన స్పూర్తి అంబేద్కర్‌ ‌ను విపరీతంగా ఆకట్టుకుంది, ఆయన లాగే తాను కూడా తన ప్రజల ఉద్దరణకు పాటుపడాలని నిర్ణయించుకున్నాడు. చిన్నతనం నుంచే వివక్షతను చవి చూసిన అంబేద్కర్‌ ‌కు అగ్రవర్ణ విద్యార్థుల అవహేళనలు నిత్యకృత్యమే, తరగతి బయట మాత్రమే కూర్చోని పాఠాలు వినవలసి వచ్చేది, కులదూషణ అనుక్షణం వేంటాడుతుండేది.

వేటికి వేరవని అంబేద్కర్‌ ‌బరోడా రాజు స్కాలర్‌ ‌షిప్పుతో విదేశి విద్యను విజయవంతంగా పూర్తి చేశాడు. ఉన్నత విద్యానంతరం స్వదేశానికి వచ్చిన ఆయనకు బరోడా రాష్ట్ర ప్రభుత్వంలో రక్షణశాఖ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చింది.  అమెరికలోని ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌ ‌డి , లండన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ఎకానామిక్స్ ‌నుండి డిఎస్‌ ‌సి సంపాదించుకున్న ఆయనను బరోడాలో తన కింది స్థాయి ఉద్యోగులు చేసిన అవమానాల గాయాలు తీవ్రంగా బాధించాయి. బరోడాలో బంట్రోతులు సైతం అంబేద్కర్‌ ‌ను అంటరాని వాడిగానే చూశారు గాని, తమ పై అధికారి అని గౌరవించలేదు. కిందిస్థాయి ఉద్యోగులమనే భయం లేకుండా ఫైళ్ళను ఆయన టేబుల్‌ ‌పై దూరం నుంచి విసిరికొట్టేవారు. తన పట్ల చూపుతున్న ఈ వివక్షే తన పోరాటానికి స్పూర్తిని రగిలించింది. ఒక సందర్భంలో ఆయన బసచేసిన సత్రం యజమాని అంటరానివాడవని సత్రం నుంచి ఆయన సామానులను బయట పడవేయించాడు. అంబేద్కర్‌ ‌కు విదేశి విద్యకు సహాయమందించిన బరోడా మహరాజు సైతం ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడటంలో తన నిస్సహయతను వెలిబుచ్చడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఒక చదువుకున్న ఉన్నతోద్యోగికే ఇన్ని అవమానాలు ఎదురైతే దేశంలో ఉన్న కోట్లాధి నిమ్నవర్గ ప్రజల పరిస్థితేంటనే ఆలోచన ఆయన మనసును తొలచివేసింది.

అణగారిన వర్గాల విమోచనకు, విముక్తికి తాను కదనరంగంలోకి దూకవలసిన అవసరాన్ని ఆయన గుర్తించాడు. తరతరాల బానిసత్వానికి, వివక్షకు గురవుతున్న కోట్లాది అంటరాని కులస్తుల తరపున పోరాడవలసిన తన కర్తవ్యాన్ని మననం చేసుకున్నాడు. డా. అంబేద్కర్‌ ‌తన విమోచన ఉద్యమాన్ని మూక్‌ ‌నాయక్‌ (‌మూగ నాయకుడు) అనే మరఠా పక్షపత్రికతో ప్రారంభించాడు, అణగారిన వర్గాల హక్కులను వారికి తెలియపరిచాడు, వయోజన వోటుహక్కు ప్రాధాన్యతను గుర్తెరిగిన మొట్టమొదటి భారతీయుడు బహుశా అంబేద్కరే కావచ్చు. వయోజన వోటుహక్కు, షెడ్యులు కులాల ప్రాతినిథ్యం కోసం ‘సౌత్‌ ‌బరో కమిటీ’కి ఆయన చేసిన నివేదన అభినందనీయం. ‘‘బహిష్కృత్‌ ‌భారత్‌’’ ‌స్థాపన షెడ్యులు కులాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రజలను ఉద్యోన్ముఖులను చేయడంలో ఆయన చూపిన మార్గం ప్రశంసనీయం.త్రాగునీటి కోసం సత్యాగ్రహం చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు ఏకై సత్యాగ్రహి బాబా సాహెబ్‌. ‌కొలాబా జిల్లాలోని  మహద్‌ ‌గ్రామంలోని చౌదర్‌ ‌చెరువులో నీరు తీసుకోవడం కోసం అంటరానివారితో కలిసి  సత్యాగ్రహం (1927) చేశాడు. అదే సమయంలో దేశవ్యాప్తంగా కొందరు అగ్రకుల నాయకులు పాలుపంచుకున్న ఆలయ ప్రవేశ ఉద్యమం కేవలం మొక్కుబడి ఉద్యమమేనని గ్రహించిన అంబేద్కర్‌ ‌వేలాది తన అనుచరగణంతో నాసిక్‌ ‌లోని ‘కాలారాం ఆలయం’లోనికి ప్రవేశించడం(1935) ఒక సంచలనం.

గాంధీజీ చేసిన ఉప్పుసత్యాగ్రహం కన్న ముందే అంబేద్కర్‌ ఈ ఉద్యమాలు సత్యాగ్రహ స్పూర్తితో జరగడం గమనార్హం. దురదృష్టక రమైన విషయం ఏమిటంటే ఒక రకంగా గాంధీజీకే దారిచూపిన ఈ ఉద్యమాలు చరిత్రకారులకు కనిపించకపోవడం ఒక్క ధనుంజయ్‌ ‌కీర్‌ ‌తప్ప మరే చరిత్రకారుడు ఈ ఉద్యమాలకు ప్రాధాన్యత కల్పించ కపోవడం శోచనీయం. నిమ్న తరగతుల సమస్యలను విన్నవించేందుకు ఇంగ్లండ్‌ ‌వెళ్లిన  అంబేద్కర్‌ ‌కు రాజ్యాంగ సభలో పాలుపంచు కోవాల్సిందిగా ప్రతిపాదన వచ్చింది. ముందు ముసాయిదా కమిటి సభ్యుడిగా, ఆ తరువాత చైర్మన్‌ ‌గా నియమించబడ్డాడు. ‘‘రాజ్యంగ ముసాయిదా సంఘం చైర్మన్‌ ‌గా నియమించేటప్పుడు, ఆ నియామకం సరైందా కాదా అని తర్కించుకునే అవసరం లేదు. తనకు అప్పగించిన పనిని అంబేద్కర్‌ ‌సమర్థ వంతంగా నిర్వర్థించి ఆ పదవికి మరింత వన్నె తెచ్చారని’’ రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్‌ ‌కొనియాడాడు. వాస్తవానికి రాజ్యాంగ రచనలో అంబేద్కర్‌ అం‌దెవేసిన చేయి. 1932లో రాజ్యాంగబద్ద సంస్కరణలు తీసుకొచ్చేందుకు నియమించబడిన సంయుక్త సంఘంలో సభ్యుడు. ఆ సమయంలోనే వివిధ దేశాల రాజ్యాంగాలని అధ్యయనం చేశాడు. సంయుక్త సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగానే బ్రిటీష్‌ ‌పార్లమెంట్‌ 1935 ‌భారత ప్రభుత్వ చట్టం తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల రూపకల్పనకు కారకుడు అంబేద్కర్‌.

బలమైన కేంద్రాన్ని కోరుకున్న అంబేద్కర్‌ ‌భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించాడు, ‘‘ఒకే దేశంలో అనేక దేశాల ఆవిర్భవానికి భాషాప్రయుక్త రాష్ట్రాలు దారి తీస్తాయని’’ థార్‌ ‌కమిటీకి ఇచ్చిన నివేదికలో హెచ్చరించాడు. దేశంలో అనేక సామాజిక రుగ్మతలకు మహిళల వెనుకబాటుతనమే కారణమని నమ్మిన అంబేద్కర్‌ ‌రాజ్యాంగంలో వారికి సమున్నత స్థానాన్ని కలిపించాడు. వివాహం, విడాకులు వంటి వ్యక్తిగత విషయాలలో మహిళలకి స్వయం నిర్ణాయాధికారం ఇవ్వాలన్నాడు, వారి సంపాదనపై వారికే సర్వహక్కులు ఉండాలన్నాడు. అంబేద్కర్‌ ఆలోచన విధానం విశ్వజనినం, ఆయన అందరివాడు కేవలం ఒక వర్గానికే ఆయన నాయకత్వాన్ని ఆపాదించి అవమానించడం క్షమించరాని నేరం, వివక్షను ఎదుర్కొనే ప్రతి చోటా అంబేద్కర్‌ ఆశయం సాక్షాత్కారం అవుతుంది. ఆయన నిఖార్సైన జాతీయ నాయకుడు వేదన, పీడన, దోపిడి, నిరాధరణకు గురైన వారికే కాక సమసమాజాన్ని నిర్మిద్దామన్న ప్రతి ఒక్కరికి స్పూర్తినిచ్చేది అంబేద్కర్‌ ‌జీవితం. ఆయనను విస్మరించడం అంటే దేశ భవిష్యత్తును విస్మరించడమే. మహానీయుల ఆశయాలు సాధిస్తాం అనేది ఒక నినాదంగానే మిగలకుండా ఆచరణలో చేసి చూపిస్తున్న కార్యసాధకుడు కేసీఆర్‌. ‌తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్‌ ఆశయాల సాధనకు కృషిచేయడంలో ముందువరుసలో ఉంది. హుస్సేన్‌ ‌సాగర్‌ ‌నడుమ నిలబడి ఉన్న బోధిసత్వుని ఎదురుగా ఆయన మార్గాన్ని అనుసరించి, ధర్మాన్ని బోధించిన సమతా మూర్తి సబ్బండ వర్గాల సమైక్యతా ప్రతీకగా అంబేద్కర్‌ ‌మహానీయుని 125 అడుగుల  విగ్రహ రూపం మన రాష్ట్రానికి కూడా బంగారు భవిష్యత్తును చూపుతుందని ఆకాక్షింద్దాం. భారతదేశం ఉన్నంత వరకు మహనీయుడు అంబేద్కర్‌ ‌పేరు అంతర్లీనంగా ధ్వనిస్తూనే ఉంటుంది. స్త్రీ విముక్తి ప్రధాతగా, తత్వబోధకుడిగా, సామాజిక విప్లవ మార్గాన్ని చూపిన అంబేద్కర్‌ ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి….
   – గుండగాని కిరణ్‌ ‌గౌడ్‌
‌న్యాయ పరిశోధక విద్యార్థి,
బి.ఆర్‌.ఎస్‌.‌వి. రాష్ట్ర ఉపాధ్యక్షులు.
9441333223

Leave a Reply