Take a fresh look at your lifestyle.

ఆ ‌చర్య హర్షణీయం

“అధికార పార్టీలోని ఉన్నత స్థాయి సిఫారసుల ఆధారంగానే జడ్జీల నియామకాలు జరుగుతాయన్నది జగద్విదితమే. జడ్జీలను తమ పార్టీల తాబేదారులుగా మార్చుకుంటున్న ప్రభుత్వాలది కూడా ఇందులో భాగస్వామ్యం ఉందనుకోవచ్చు . అనుభవం , అవగాహన , నేర్పు నైపుణ్యాల ఆధారంగా పారదర్శకంగా నియామకాలు జరగనప్పుడు పుష్ప వీరేంద్ర గనెడివాలా వంటి న్యాయమూర్తులు వస్తూనే ఉంటారు. చట్టాలను తప్పుడు వ్యాఖ్యానాలతో వక్రీకరిస్తూనే ఉంటారు. ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవు ఉంటాయి.చట్టం పట్ల, న్యాయం పట్ల ప్రజలలో ఇప్పటికీ ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని, గౌరవాన్ని పోగొట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులదే , వ్యవస్థలదే..”

సుప్రీంకోర్టు కొలీజియం ఒక జడ్జి శాశ్వత హోదాపై చేసిన సిఫారుసుల్ని వెనక్కి తీసుకోవడం హర్షణీయం . ఈ నిర్ణయం జనవరి 30న తీసుకుంది .ఇది అసాధారణమైంది కాకపోయినా అరుదైన నిర్ణయమేనని చెప్పొచ్చు .

గత వారం రోజులుగా బాంబే హైకోర్టు జడ్జి పుష్ప వీరేంద్ర గనెడివాలా పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపించింది.  ఆమె ఇచ్చిన తీర్పులు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి . ఆగ్రహం తెప్పిచ్చాయి .  భవిష్యత్‌ ‌పట్ల భయాన్ని పెంచాయి .  అందుక్కారణం తనకున్న అధికారంతో చట్టాలకు వక్రభాష్యం ఇస్తూ వివాదాస్పద తీర్పులు ఇవ్వడమే .

ముఖ్యంగా పోక్సో చట్టాన్ని సరిగ్గా అధ్యయనం చేయకుండా అందులోని సెక్షన్స్ ‌కి తనదైన రీతిలో వక్రభాష్యం చెప్తూ నేరస్థుల శిక్షను రద్దు చేయడం లేదా తగ్గించడం జరిగింది . అందువల్ల సమాజంలో జరిగే దుష్పరిణామాల్ని అంచనా వేయలేకపోయిన ఆ మహిళా న్యాయమూర్తికి  ఇటువంటి కేసుల అనుభవ రాహిత్యం కూడా తోడై ఉండవచ్చు.  ఏదేమైనా, సుప్రీంకోర్టు నిర్ణయం తెలియగానే తిక్క కుదిరింది .  లేకపోతే స్కిన్ట్  ‌టు స్కిన్‌ ‌టచ్‌ ‌లేకపోతే అది లైంగిక దాడి కాదనీ , పోక్సో చట్ట పరిధిలోకి రాదని ఎడాపెడా తీర్పులిచ్చేస్తుందా .. అనిపించింది.  అందుకు దారి తీసిన  సంఘటన పూర్వాపరాల్లోకి వేళదాం . ఆ తీర్పులు ఏమిటి ? ఆవిడ ఎందుకు తిరోగమన దిశలోకి వెళ్లాల్సి వచ్చిందో  చూద్దాం .

‘2016లో సతీష్‌ అనే 39 ఏళ్ల వ్యక్తి పన్నెండేళ్ల బాలికకు పండు ఇస్తానని తన ఇంటికి తీసుకెళ్లి ఆ బాలికపై లైంగిక దాడిచేశాడు. ఆమె ఛాతీ నిమురుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ , దుస్తులు విప్పడానికి ప్రయత్నిస్తుంటే ఆ బాలిక భయంతో కేకలు వేసింది . ఆ  క్రమంలో ఆపిల్ల తల్లి వచ్చి బిడ్డను రక్షించుకుంది .  నేరం చేసినవాడికి తగిన శిక్ష పడాలని చట్టంపై నమ్మకంతో , కోర్టులపై విశ్వాసంతో ఆ తల్లి కేసు పెట్టింది . కింద కోర్టు నేరం నిరూపించి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది.  నిందితుడు హై కోర్ట్ ‌కి అప్పీల్‌ ‌చేసుకున్నాడు .

నిందితుడి చర్మానికి బాలిక చర్మం ఆనించినట్లుగా నిరూపణ కాలేదు కాదు కాబట్టి, దుస్తులపై నుంచి శరీర భాగాల్ని తాకడం లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పలేమని ముంబై హైకోర్టు నాగపూర్‌ ‌బెంచ్‌  ‌జడ్జి పుష్ప సురేంద్ర గనెడివాలా  అభిప్రాయపడింది .  లైంగిక ఉద్దేశ్యంతో బాలిక దుస్తులు తొలగించి లేదా లోపలికి చేయిపెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని తీర్పు ఇచ్చింది.

- Advertisement -

కాబట్టి ఈ కేసు • • 32/2012 (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ‌చిల్డ్రన్‌ ‌ఫ్రమ్‌ ‌సెక్సువల్‌ ఆఫెన్సెస్‌)  ‌చట్టంలోని సెక్షన్‌ 7 ‌కిందకు రాదని నేరస్తుడని నిర్ధారిస్తూ కింది కోర్టు విధించిన మూడేళ్ళ జైలు శిక్షను రద్దు చేసింది.   అయితే , ఐపీసీ సెక్షన్‌ 354 (ఓ ‌మహిళ గౌరవానికి భంగం కలిగించడం ), సెక్షన్‌ 342 (‌దురుద్దేశంతో నిర్బందించడం ) కింద కోర్ట్ ఇచ్చిన ఒక ఏడాది శిక్షను మాత్రం సమర్ధించింది .
అదే విధంగామరోకేసులోనూ తీర్పు ఇచ్చింది.
లిబ్నాస్‌ ‌కుజుర్‌ అనే యాభై ఏళ్ల వ్యక్తి  ఐదేళ్ల బాలిక చేతులు గట్టిగా పట్టుకుని పాంట్‌ ‌జిప్‌ ‌తీసి తన జననాంగాలు చూపాడు.  మంచం మీద పడుకుందాం రమ్మన్నాడు.   అతని ప్యాంటు జిప్‌ ‌తీసి ఉండడం ఆ బాలిక తల్లి కూడా గమనించింది.  తన బిడ్డపై లిబ్నాస్‌  ‌లైంగికదాడికి పాల్పడ్డాడని ఆమె కేసు పెట్టింది.  రెండేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై గడ్చిరోలి జిల్లా కోర్టు పోస్కో చట్టం ప్రకారం ఐదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
ఆ తీర్పును సవాలు చేస్తూ లిబ్నాస్‌  ‌గత అక్టోబరు లో  హైకోర్టుకు వెళ్ళాడు. పాంట్‌ ‌జిప్‌ ‌తీసి బాలిక చేతులు పట్టుకోవడం  లైంగిక దాడి లేదా తీవ్రమైన లైంగిక దాడి కిందకు రాదని అందువల్ల పోక్సో చట్టం పరిధిలోకి  రాదని ఐపీసీ సెక్షన్‌ 354 ‌కిందకు మాత్రమే వస్తుందని స్పష్టం చేస్తూ మరో వివాదాస్పద తీర్పునిచ్చింది బొంబాయి హైకోర్టు నాగపూర్‌ ‌బెంచ్‌ అడిషనల్‌ ‌జడ్జి పుష్ప గనెడివాలా  .  .కింద కోర్ట్  ‌తీర్పును కొట్టివేసింది.  నేరస్థుడ్ని వదిలి పెట్టమని సూచించింది. మూడో కేసు 15 ఏళ్ల బాలిక రేప్‌ ‌విషయంలోను , నాలుగో కేసు మైనర్‌ ‌బాలికపై అత్యాచారం కేసులోను లైంగిక అత్యాచారం జరిగినట్లు  సరైన సాక్ష్యాలు లేవని  అందువల్ల నేరం జరిగినట్లు కోర్టు నమ్మడం లేదని తీర్పు ఇచ్చి నేరస్తులకు మార్గం సుగమం చేసింది .

ఈ విధంగా లైంగిక నేరాలపై వరుస వివాదాస్పద తీర్పులతో నేరస్థులను నిర్దోషులుగా విడిచి పెట్టడం వల్ల వస్తున్న ఆందోళనలను సుమోటో తీసుకుని  ఈ తీర్పులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ప్రజలలో నెలకొన్న తీవ్ర ఆందోళనకు కారణమైన తీర్పులను దృష్టిలో పెట్టుకుని ఆ జడ్జికి సంబంధించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది .

ఈ నేపథ్యంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ అరుదైన నిర్ణయం తీసుకున్నది . జడ్జీలకు శాశ్వత హోదా కలిపించడం , ఈ విషయంలో కొలీజియం తన సిఫారసులను ప్రభుత్వానికి పంపడం పరిపాటి .  ముంబై హైకోర్ట్ ‌శాశ్వత  జడ్జిగా  పుష్ప వీరేంద్ర గనెడివాలాను ధృవీకరిస్తూ జనవరి 20 తేదీన సుప్రీం కోర్టు కొలీజియం ప్రభుత్వానికి సిఫారసు చేసింది . అదే కొలీజియం తన సిఫారసులను  వెనక్కి తీసుకున్నది .  అంతవరకూ బాగానే ఉంది .

అసలు సరైన శిక్షణ, సంబంధిత చట్టాల పట్ల అవగాహన, అనుభవం లేకుండా హై కోర్టు జడ్జి ఎలా నియమించారు?  కొత్తగా నియమితులయ్యే జడ్జీలకు మిగతా చట్టలన్నిటితో పాటు పిల్లలు, మహిళలు , దళితులు , మైనారిటీలు , ఆదివాసీలు మొదలైన వారి హక్కులకు సంబంధించి స్పష్టమైన దృష్టితో కూడిన అవగాహన, అనుభవం ఉండాలి కదా . చేసుకున్న చట్టాలపై సామాన్య ప్రజలలోనే కాదు ఆ చట్టాల్ని అమలుపరచాల్సిన యంత్రాంగంలోనూ అవగాహన లేదని అందువల్లే వక్రభాష్యం చెప్తూ వివాదాస్పద తీర్పులు వెలువడుతున్నాయని అర్ధం అవుతున్నది .  ఎప్పటికప్పుడు చట్టాల్లో చేసుకున్న మార్పులు , చేర్పులపై అధ్యయనం, శిక్షణతో తమ జానాన్ని మెరుగు పరచుకోవాల్సిన అవసరం కీలక స్థానాల్లో ఉండి తీర్పులకు చెప్పేవాళ్లకు అవసరం అన్నది గమనించుకోకుండా రాజకీయ సిఫారసులకనుగుణంగా మెదిలే వ్యవస్థలో ఉన్నాం.

అధికార పార్టీలోని ఉన్నత స్థాయి సిఫారసుల ఆధారంగానే జడ్జీల నియామకాలు జరుగుతాయన్నది జగద్విదితమే.  జడ్జీలను తమ పార్టీల తాబేదారులుగా మార్చుకుంటున్న ప్రభుత్వాలది కూడా ఇందులో భాగస్వామ్యం ఉందనుకోవచ్చు .  అనుభవం , అవగాహన , నేర్పు నైపుణ్యాల ఆధారంగా పారదర్శకంగా  నియామకాలు జరగనప్పుడు పుష్ప వీరేంద్ర గనెడివాలా వంటి న్యాయమూర్తులు వస్తూనే ఉంటారు.  చట్టాలను తప్పుడు వ్యాఖ్యానాలతో వక్రీకరిస్తూనే ఉంటారు. ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవు ఉంటాయి.చట్టం పట్ల, న్యాయం పట్ల ప్రజలలో ఇప్పటికీ ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని, గౌరవాన్ని  పోగొట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులదే , వ్యవస్థలదే..

వి . శాంతి ప్రబోధ

Leave a Reply