జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజకవర్గం లో తొమ్మిది డివిజన్లు గాను ఎనిమిది డివిజన్లో టీఆర్ఎస్ భారీ విజయం సాధించిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఎంతటి విజయాన్ని అందించారన్నారు. ఇదే స్ఫూర్తితో ఇకముందు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలిపారు. బిజెపి కులాలు, మతాల పేరుతో ఎంత రెచ్చగొట్టినా ప్రజలు సంయమనం పాటించి వారికి తగిన బుద్ధి చెప్పారన్నారు.
ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు నాయకులు జాతీయ నాయకులు దేశ ప్రధాని ఎంతమంది వచ్చినా కూడా వారిని ప్రజలు నమ్మలేదన్నారు. ఇకనైనా వారు విద్వేషాలు రెచ్చగొట్టకుండా అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయని, కానీ రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. డివిజన్లలోని ఓట్ల మార్పిడి వల్ల మూసాపేట్ డివిజన్ లో కూడా స్వల్ప మెజారిటీతో విజయం చేజారింది అన్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి కూడా పరోక్షంగా లోపాయికారీగా బీజేపీ విజయానికి సహకరించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త సతీష్ అరోరా తదితరులు పాల్గొన్నారు.