Take a fresh look at your lifestyle.

‌స్త్రీత్వానికి వందనాలు

అగ్నిసాక్షిగా పరిణయమాడి పత్నిగా..
గృహ ప్రవేశంతో కాలు మోపి గృహిణిగా..
యజ్ఞయాగాదుల్లో సహధర్మచారిణిగా..
ఇంటికే దేదీప్యమాన దీపమై ఇల్లాలుగా..
భర్తకు కుడి భుజంగా బాధ్యత భార్యగా..
అందరినీ ఆదరించే ఆదర్శ అర్థాంగిగా..
సత్యగుణాల్ని శోభింపజేసే పవిత్ర ఆలిగా..
పతితో కలిసి సతిగా పయనించే దార !

ఆచార సంప్రదాయాలే కాదు..
సమాజ కట్టుబాట్లకూ ఆధారంగా..
పునర్జన్మతో పసిగుడ్డుకు ప్రాణం పోసి..
అందరి ఆకలిని పసిగట్టే జ్ఞానశీలిగా..
పిల్లల నొప్పికి తన స్పర్శే లేపనంగా..
కుటుంబ ఆరోగ్య ప్రదాయినిగా..
ఇంటి సంతోషాలకు ఇంధనంగా..
అన్నీ తెలిసిన అమాయక జీవి స్త్రీ !

అమ్మగా అమృతాన్ని పంచుతూ..
బ్రహ్మ సృష్టికి సహకరించే తల్లిగా..
గృహ పాలనలో బహు నేర్పరిగా..
ధైర్య ఆవేశాల్లో అపరదుర్గ రూపంగా..
జ్ఞాన సంపదలో సరస్వతి మాతగా..
భూదేవంత సహనశీలత మహాలక్ష్మిగా..
కుటుంబ దీపానికి తనో ఒత్తిగా..
మహాశక్తి స్వరూపిణి స్త్రీ మూర్తిగా..
బహు ‘భూమి’కల భారీ మనసున్న..
స్త్రీమూర్తికి సర్వదా శతకోటి జేజేలు !

burra madhusudhan reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply