Take a fresh look at your lifestyle.

ఠాకూర్‌ ఔట్‌… ‌థాక్రే ఇన్‌

‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా ఉన్న మాణిక్యం ఠాకూర్‌ ‌స్థానంలో కొత్తగా మాణిక్‌రావు థాక్రేను ఇన్‌చార్జీగా నియమించింది ఏఐసీసీ. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినప్పటినుండీ ఆ పార్టీలో అంతర్గత కలహాలు మొదలైనాయి. దశాబ్ధాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను కాదని, తెలుగుదేశం పార్టీనుండి వొచ్చిన రేవంత్‌రెడ్డికి అధ్యక్షపదవిని కట్టబెట్టడంపైన సీనియర్లు అలుకపూనారు. చాలామంది బహిరంగంగానే ఆయనపైన విమర్శనాస్త్రాలను సంధించారు. పిసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నిర్వహించే ఏ కార్యక్రమంలోకూడా ఒక వర్గం పాల్గొనకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తూ వొస్తున్నది. అయినప్పటికీ తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చే క్రమంలో రేవంత్‌రెడ్డి మరింత దూకుడుగానే ముందుకు కదిలారు. ఆయన రాకతో ఒక విధంగా స్తబ్ధతగా ఉన్న కాంగ్రెస్‌ ‌కార్యకర్తల్లో ఊపు వొచ్చినప్పటికీ సీనియర్లు భీష్మించుకుని కూర్చోవడంతో రేవంత్‌రెడ్డికి అడుగడుగున అవాంతరాలు ఎదురవుతూ వొచ్చాయి. దీనికి తోడు తాజాగా ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కమిటీని ప్రకటించింది. ఇది జంబో కమిటీ అయినా సీనియార్టీని విస్మరించారన్న తీవ్ర విమర్శలు చోటు చేసుకున్నాయి. పైగా ఈ కమిటీలో రేవంత్‌రెడ్డి వర్గానికే పెద్ద పీట వేసారన్న ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా టిడిపినుండి వొచ్చిన వారినే ఏరికోరి తీసుకున్నారన్న విమర్శఉంది.

ప్రధానంగా కొండ సురేఖ కమిటీ ప్రకటించిన వెంటనే తాను అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో పార్టీలో అసంతృప్తి బహిరంగమైంది. అతర్వాత సీనియర్‌నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు దాదాపు ఎనిమిది మంది తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ఆ పార్టీ రెండుగా చీలిపోతుందన్న అనుమానాలకు తావిచ్చింది. దీంతో టిడిపినుండి వొచ్చినవారు వెంటనే తమ పదవులకు రాజీనామా ప్రకటించినా సీనియర్‌ల ఆగ్రహం మాత్రం చల్లారలేదు. రేవంత్‌రెడ్డికి అధ్యక్ష పదవిని కట్టబెట్టడంలోనూ, కొత్త పిసీసీ కమిటీని ప్రకటించడంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్యం ఠాకూర్‌ ‌ప్రయేయాన్ని వారు ప్రశ్నించడం ప్రారంభించారు. రేవంత్‌రెడ్డితో ఆయన లాలూచీ పడ్డారన్న నిందకూడా వేశారు. అది క్రమేణ పిసీసీ రెండుగా చీలికకు కారణంగా మారింది. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న నష్ట నివారణ చర్యలను చేపట్టాల్సిందిగా ఆ పార్టీ అధిష్టానం మరో సీనియర్‌ ‌నేత దిగ్విజయ్‌సింగ్‌ను ఆగమేఘాలమీద హైదరాబాద్‌కు పంపించింది. ఆయన రెండు రోజులు ఇక్కడ సీనియర్లు, అసంతృప్తివాదులు, రేవంత్‌ ‌వర్గంతో విస్తృతంగా చర్చించారు. వాస్తవంగా సీనియర్ల డిమాండ్‌లపై ఆయన ఏమేరకు స్పందించారన్నది పక్కకు పెడితే, ఇది కేవలం టీ కప్పులో తుఫాన్‌ ‌లాంటిదేనని, విభేదాలు సమసి పోయాయని ఒక ప్రకటచేసి దిల్ల్లీ విమానం ఎక్కారు. కాని, సీనియర్లలో ఏమాత్రం మార్పు రాలేదనడానికి ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 26 నుండి రాష్ట్రంలో చేపట్టనున్న రేవంత్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొనేదిలేదని స్పష్టంచేశారు.

మూడు నెలల పాటు నిర్వహించ తలపెట్టిన రేవంత్‌రెడ్డి పాదయాత్రను కాదని, తాము ఎవరి నియోజకవర్గాల్లో వారే పాదయాత్ర చేసుకునేందుకు అనుమతివ్వాల్సిందిగా వారు అధిస్టానానికి విన్నవించుకోవడమే వివాదం సమసిపోలేదనడాన్ని ఎత్తిచూపుతోంది. పైగా మాణిక్యం ఠాకూర్‌ ‌సారథ్యంలో తాము పనిచేయలేమని కూడా వారు స్పష్టం చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో అధిష్టానం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్‌రావు థాక్రేను నియమించింది. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన థాక్రే మంత్రిగా, ఎంఎల్‌ఏగా, ఎంఎల్‌సిగా, పిసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలకు కొత్తే అయినప్పటికీ ఆయన రెండుగా చీలిన రాష్ట్ర కాంగ్రెస్‌ను ఎలా ఏకతాటిపైకి తీసుకు వొస్తారన్నది చూడాల్సి ఉంది. ఠాకూర్‌ను మార్చడం ఒక విధంగా రేవంత్‌రెడ్డికి దెబ్బనేనన్న చర్చ జరుగుతున్నది. ఆయన బలంతోనే ఇంతకాలం రేవంత్‌రెడ్డి దూకుడుగా వ్యవహరించాడన్న అభిప్రాయం లేకపోలేదు.

వీరిద్దరు మాత్రమే సంప్రదించుకుని ఏకపక్షంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారన్న అపవాద వీరిమీద ఉండింది. కాని, ఇప్పుడు థాక్రే రంగప్రవేశంతో పార్టీలో ఎలాంటి మార్పులు వొస్తాయన్న విషయంలో ఆ పార్టీ కార్యకర్తలతో సహా పార్టీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒకవైపు రాబోయే ఎన్నికలకు బిజెపి, బిఆర్‌ఎస్‌లు పోటాపోటీన సిద్ధపడుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్‌ ‌సాధించాలని బిఆర్‌ఎస్‌ ‌ప్రణాళికలను రూపొందించుకుంటోంది. ఇక బిజెపి మిషన్‌ 90 అం‌టూ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిస్థిలో కాంగ్రెస్‌ ఎక్కడ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి తమను ప్రజలు తప్పక గెలిపిస్తారని చెబుతున్నప్పటికీ, ఆ పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగా క్యాడర్‌కూడా అయోమయంలో పడిపోయింది. పార్టీలో ఎంతో అనుభవమున్న నాయకులున్నా, కార్యకర్తలను లక్ష్యం దిశగా నడిపించే నాయకత్వ లోపం ఆ పార్టీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.

Leave a Reply