అవును ఇప్పుడో ధిక్కార స్వరం మూగబోయింది. దళిత బహుజనుల పెద్ద దిక్కు కాటికి పయనమైంది. ప్రపంచ విజేతగా చెప్పుకునే గ్రేట్ అలెగ్జాండర్ దోమ కాటుకు బలైనట్టుగా సమాజంలోని అసమానతలపై, హరించబడుతున్న హక్కులపై, ముఖ్యంగా దళిత బహుజనుల రాజ్యాధికార సాకారం కోసం తపించిన ‘‘ఊసా’’ ( ఊ. సాంబశివరావు )ను వైరస్ కాటుకు బలైననారనే వార్త నమ్మలేని నిజంగా ఉంది. నేను హైదరాబాద్ లో ఓ పత్రికలో హైదరాబాద్ సిటీ బ్యూరో రిపోర్టర్ గా పని చేస్తున్న కాలంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ( ఎస్వికే ) లో జరిగిన అనేక సభలు, సమావేశాలలో ఊసా పాల్గొన్న కార్యక్రమాలలో నేను నూస్ కవరేజ్ లో భాగంగా పాల్గొన్నాను. నేను కవర్ చేసే నా పరిధిలోనే ఎస్వికే బీట్ ఉన్నందున ఎస్వికే లో నిర్వహించే ప్రతి ప్రోగ్రాం ను నేను వినటం, పాల్గొనటం, రాయటం రిపోర్టర్ గా నాకు అవకాశం కలిగింది. ఇలా కొంతమంది ప్రత్యేక భావజాలం కలిగిన వ్యక్తుల సమావేశాలకు కొంచెం నేను కూడా ప్రత్యేకంగానే శ్రద్దతో వెళ్లి న్యూస్ కవర్ చేసేవాడిని. ఇలా ‘‘ఊసా’’ పాల్గొన్న అనేక కార్యక్రమాలు నేను చూశాను. న్యూస్ కవర్ చేశాను. తనలోని లోతైన అవగాహన, అవతలి వ్యక్తిని తను చూసే దృష్టి కోణాన్ని, తన హుందాతనాన్ని కాస్తో కూస్తో దగ్గరుండి చూసే అవకాశం నాకు దక్కింది. ఈ అనుభవం ఉన్నందున దళిత, బహుజనులపై వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా బహుజన రాజ్యాధికార సాధనకై నిరంతరం పనిచేస్తూ వచ్చిన ‘‘ ఊసా ‘‘ మృతికి సంతాపంగా శ్రద్దాంజలి ఘటించాలని ఇతరులను తట్టిలేపే సృహాను ప్రదర్శించాల్సిన బాధ్యత నాకు ఉందని భావిస్తున్న. ‘‘ఊసా’’ మృతి ఎవరిలో ఎలాంటి భావోద్వేగాలను కలిగించిందో తెలియదు కానీ ‘‘ఊసా’’ మృతి మీడియాలో ప్రధాన్యత సంతరించుకోకపోవటం నా వరకు మాత్రం కలత చెందే అంశంగానే భావిస్తున్న. ఎందుకంటే ‘‘ఊసా’’ మృతి వార్త సోషల్ మీడియాలో ప్రచారం అయినప్పటి నుంచి గంటల తరబడి వివిధ టివి ఛానల్స్ ను పరిశీలిస్తే కనీస వార్తగా కూడా కనిపించకపోవటం నన్ను తీవ్రంగానే బాదించింది.
ఇది ఈ సమాజానికి సరైన సంకేతం కాదు. ‘‘ ఊసా ‘‘ సమాన్యమైన వ్యక్తి కాదు. ఆయనో ఆలోచన. ఆయనో ధిక్కార స్వరం. విప్లవోద్యమంతో మొదలైన ఆయన ప్రస్థానం ఆ తర్వాత లాల్-నీల్ సిద్దాంతంతో కుల వర్గ నిర్మూలన పోరాటం వైపు సాగింది. అరవై ఏళ్ల వయసులోనూ.. యువతతో మమేకం అవుతూ ఎన్నో సిద్దాంతాలను వారికి పూసగుచ్చినట్లు వివరించిన వ్యక్తి. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ… ప్రజాస్వామికవాదిగా తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారనేది గ్రహించాలి. మార్క్సిస్టు తాత్వికత, అంబేడ్కర్ సిద్దాంతాలతో బహుళ బహుజన రాజకీయాలకు ఊసా ఒక ప్రాతిపదిక ఏర్పరిచారనటంలోనూ సందేహం లేదు. విప్లవ, బహుజన రాజకీయాల పట్ల సమగ్ర అవగాహనతో, ముందు చూపుతో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 1985లో కారంచేడులో దళితుల నరమేధం సందర్భంగా ‘‘ కమ్మ భూస్వాముల దాడి’’ అంటూ ధిక్కార స్వరంతో కరపత్రం రాసిన సాహసోపేత ధైర్యం ఆయన సొంతం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుజన ఉద్యమ నాయకుడు మారోజు వీరన్న కుల-వర్గ పోరాటాల డాక్యుమెంట్ తయారీలో కీలక పాత్ర పోషించారు. ఆధిపత్య అహంకారం, రాజ్యహింస ఎక్కడుంటే అక్కడ ఊసా ప్రత్యక్షమై ముందుండి పోరాడారు. చిన్నరాష్ట్రాల్లో దళిత, బహుజన ఉద్యమాల ప్రస్తావన, మనుగడ ఉందంటే అందుకు కారణమైన వ్యక్తుల్లో ‘‘ ఊసా ‘‘ ప్రముఖుడనే చెప్పాలి. ఒక దశలో దళిత, బహుజన ఐక్య ఉద్యమాలకు కేంద్రబిందువుగా మారి చర్చను నడిపారు. కుల, వర్గ ఉద్యమాలను బతికించుకునేందుకు కృషి చేశారు. పైన చెప్పినట్లుగానే ఆధిపత్య అహంకారం, రాజ్యహింస ఎక్కడుంటే అక్కడ ఊసా ప్రత్యక్షమై ముందుండి పోరాడారు. అంతెందుకు గత రెండెండ్లక్రితం కూడా వరంగల్ ( కోటి లింగాల గుడి ప్రాంతం )లో జరిగిన టపాసుల ప్యాక్టరిలో బాంబు పేళుళ్ల వల్ల మృతి చెందిన కూలీ జనం పక్షాన, వారికి న్యాయం చేయాలని ప్రత్యక్ష ఆందోళనకు ఊసా శ్రీకారం చుట్టారు. అప్పట్లో రాష్ట్రంలో చర్చానీయాంశంగా మారిన ఈ టపాకాసుల ఫ్యాక్టరీ బాంబు పేళుళ్ల ఘటనలో మృతులకు న్యాయం చేయాలని బలమైన గొంతును వినిపించిన వారిలోనూ అగ్రభాగాన నిలిచింది కూడా ‘‘ఊసా’’ నే అని చెప్పాలి. ఈ ఘటనపై అనేక సందర్భాలలో వరంగల్ వచ్చి భాదితుల పక్షాన ఊసా తన గళం విప్పారు. అయితే హైదరాబాద్ లో రిపోర్టర్ గా పని చేసినప్పుడు నేను చూసి, మాట్లాడి, ఆయన పాల్గొన్న కార్యక్రమాలను న్యూస్ కవర్ చేసిన నాకు మళ్లీ వరంగల్ లోనూ ఇదే వరంగల్ టపాకాసుల తయారీ ఫ్యాక్టరీ లో తలెత్తిన ఘటన సందర్భంలో ‘‘ఊసా’’ మాటలు విని న్యూస్ కవర్ చేసే అవకాశం కలిగింది. ప్రస్తుతం ‘‘ ఊసా ‘‘ లేరనే చేదు నిజం తెలుగు నేలపై ఎంతోమందిని శోకసంద్రంలో ముంచేస్తుంది.
