- పాక్‌తో చర్చలు జరపాలి
- భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్, జనవరి 20 : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం సజీవంగా ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. అసలు ఉగ్రవాదం పోవాలని అబ్దుల్లా కోరుకోవడం లేదా అని ప్రశ్నించింది. కాశ్మీరీ పండిట్ల గాయాలకు ఔషధం అవసరమని, ద్వేషం స్థానంలో ప్రేమను భర్తీ చేయడం ద్వారానే అది సాధ్యమవుతుందని ఫరూక్ అన్నారు. ఉగ్రవాదం సజీవంగా ఉందని, పాకిస్థాన్‌తో చర్చలు జరిపేంతవరకు అది అంతం కాదని తన రక్తంతో రాతపూర్వకంగా తెలియజేస్తున్నానని అన్నారు. 16 సార్లు మన సరిహద్దుల్లోకి ప్రవేశించిన చైనాతో చర్చలు జరపగలిగిన రు పాకిస్థాన్‌తో చర్చలకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ దుగా జమ్మూకాశ్మీర్లోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డియాతో మాట్లాడుతూ.. దేశ సమగ్రతను దెబ్బతీసేలా కేంద్రం విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని అన్నారు. బిజెపి ఓటు బ్యాంకు కోసం హిందు, ముస్లింల మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని అన్నారు. పాకిస్థాన్‌లో నివసిస్తున్న హిందువులు, మన దేశంలోని ముస్లింల భద్రత గురించి పట్టించుకోకుండా విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు.
ద్వేషాన్ని వ్యాపింపజేసి ఓట్లు దండుకోవడానికి వారి దుస్థితిని ఉపయోగించుకోవడానికి ఒక సినిమా విడుదల చేయబడిందని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఉద్యోగాలు ఇచ్చిన వారికి కూడా కాశ్మీర్లో ఉగ్రవాదం వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని అన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదం ప్రారంభమైనప్పటి నుండి కాశ్మీరీ పండిట్లు, ముస్లింలు ఇద్దరూ బాధపడ్డారని, తన కార్యకర్తలు, మంత్రులు కూడా పెద్ద సంఖ్యలో హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.