- బోర్వెల్ లారీని ఢీకొన్న ఇన్నోవా
- ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- ఖమ్మం జిల్లాలో టిప్పర్ను ఢీకొన్న స్కూటీ..ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై బుధవారం ఉదయం ఇన్నోవా కారు ఓ బోర్వెల్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేకువజామున మంచు కప్పుకోవడంతో ఎదురుగా వొస్తున్న వాహనాన్ని గుర్తించకపోడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. తాడ్బండ్ నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న ఇన్నోవా కారు చేవెళ్ల మండలం కందవాడ-మల్కాపూర్ శివారులోని మూలమలుపు వద్ద ఎదురుగా వొస్తున్న బోర్వెల్ లారీని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా ఆరుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతులు సికింద్రాబాద్లోని తాడ్బండ్కు చెందిన అసిఫ్ఖాన్, సానియా, నజియాబేగం, హర్ష, నజియాభాను, హర్షభానుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖమ్మం జిల్లా కామేపల్లిలో టిప్పర్ను ఢీకొన్న స్కూటీ..ఇద్దరు మృతి
ఖమ్మం జిల్లా కామేపల్లిలో ఆగివున్న టిప్పర్ను ఓ స్కూటీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. కామేపల్లి మండలం పెద్దాపురం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ను స్కూటీ వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో భదాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన కుసుమ రాజు, హైదరాబాద్కు చెందిన కర్రి మాలతి అక్కడిక్కడే మరణించారు. వీరు ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా, రోడ్డుపై ఆగివున్న టిప్పర్ కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. వేకువ జాములన మంచుతెరల కారణంగా ఈ ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నారు.